• Home »
  • News »
  • కలాం కు 65 గంటల ఘననివాళి: రేటింగ్స్ లో ’పుదియ తలైమురై’ సరికొత్త రికార్డ్

కలాం కు 65 గంటల ఘననివాళి: రేటింగ్స్ లో ’పుదియ తలైమురై’ సరికొత్త రికార్డ్

తమిళనాడు మార్కెట్లో ఇంతకుముందు మరో న్యూస్ చానల్ ఏదీ సాధించని ప్రత్యేకతను పుదియ తలైమురై ( ఎస్ ఆర్ ఎమ్ విద్యా సంస్థలవారి న్యూస్ చానల్ ) సొంతం చేసుకుంది. ఎంటర్టైన్మెంట్ చానల్స్ కే సాధ్యమైన స్థాయిలో రేటింగ్స్ సంపాదించుకోగలిగింది. నెంబర్ వన్ స్థానం పుదియ తలైమురై కి కొత్త కాకపోయినా భారీ రేటింగ్స్ సంపాదించుకోవటం విశేషం. 30 వ వారానికి టామ్ ప్రకటించిన రేటింగ్స్ ప్రకారం పుదియ తలైమురై కి 22,983 టివిటి లు దక్కగా దినతంతి గ్రూప్ వారి తంతి టీవీ కి 15,069 టివిటిలు, సన్ నెట్ వర్క్ వారి సన్ న్యూస్ చానల్ కు11,900 టివిటి లు వచ్చాయి.

ఈ స్థాయిలో రేటింగ్స్ నమోదు కావటానికి కారణం గతవారం మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం కు ఘన నివాళి అర్పించటంలో పుదియ తలైమురై అందరికంటే ముందుండటమే. తమిళ ప్రజలగుండెల్ని పిండేసే నేపథ్య సంగీతం ఒక్కటే కాదు, ఆయన మరణ వార్త తెలిసిన క్షణం నుంచి 65 గంటలపాటు ఏకధాటిగా నిమిషనిమిషానికీ సమాచారం అందిస్తూ రామేశ్వరంలో అంత్యక్రియలు ముగిసేదాకా ఈ చానల్ చేసిన ప్రసారాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రజలందరూ స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించిన అనుభూతిని కలిగించింది.

రామేశ్వరంలో ప్రత్యేకంగా ఒక తాత్కాలిక స్టుడియో ఏర్పాటు చేసి ప్రత్యక్షప్రసారం కోసం 30 మందికి పైగా సిబ్బందిని సిద్ధం చేయటం ఒక వంతైతే, రామేశ్వరం పట్టణమంతటా వీడియో వాల్స్ ఏర్పాటు చేసి అంతిమనివాళి దృశ్యాలను ప్రజలకు అందించగలగటం మరోవంతు. రామేశ్వరం అంతా స్వచ్ఛందంగా బంద్ పాటించటంతో తిండి దొరకకపోయినా సిబ్బంది విధి నిర్వహణమీద దృష్టి సారించారని సీఈవో శ్యామ్ కుమార్ చెప్పారు.