• Home »
  • Cable »
  • డిజిటైజేషన్ అమలు పర్యవేక్షణ కోసం ప్రాంతీయ విభాగాలు

డిజిటైజేషన్ అమలు పర్యవేక్షణ కోసం ప్రాంతీయ విభాగాలు

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, మరింత క్లిష్టమైన మూడో దశ డిజిటైజేషన్ అమలు తీరు నిరాశాజనకంగా ఉండటం ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపరుస్తోంది. అనేక కారణాల వలన ప్రతిష్ఠంభన ఏర్పడుతున్నట్టు ప్రభుత్వ విభాగాలు గుర్తించాయి. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు సమావేశాలు జరిపి సమీక్షిస్తున్నప్పటికీ చిక్కులు వస్తూనే ఉన్నాయి. తొమ్మిదవ టాస్క్ ఫోర్స్ సమావేశంలోనూ అవే ప్రశ్నలు, అవే ఇబ్బందులు మళ్ళీ మళ్ళీ చర్చకు వస్తున్నాయి. గడువు తేదీ ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించే ప్రసక్తే లేదని చెబుతున్న ప్రభుత్వం అందుకు తగినట్టుగా సమస్యలను పరిష్కరించలేకపోతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మొదటి రెండు దశల డిజిటైజేషన్ పూర్తయిందంటున్న నగరాలలోనే ఇంకా సమస్యలు ఒక కొలిక్కి రాలేదు. బిల్లింగ్ అమలు చేయటలోనూ చిక్కులు ఎదురవుతున్నాయి. మరోవైపు ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు కూడా పూర్తి కాకపోవటంతో బిల్లింగ్ కు ఆపరేటర్లు సహకరించటం లేదు. ఇన్ని సమస్యల మధ్య ముందుకు సాగటానికి ఇప్పుడున్న వ్యవస్థలో మార్పులు తప్పనిసరి అయ్యాయి. అందుకే  ఎక్కడికక్కడే ప్రాంతీయ విభాగాలు ఏర్పాటు చేయటం మంచిదని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నిర్ణయించిందని తాజాగా జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆ శాఖ జాయింట్ సెక్రెటరీ ఆర్ జయ వెల్లడించారు. దేశవ్యాప్తంగా మొత్తం 12 ప్రాంతీయ యూనిట్లు ఏర్పాటవుతాయి. డిజిటైజేషన్ మీద ఈ యూనిట్ల ఆధ్వర్యంలో వర్క్ షాప్ లు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు నామినేట్ చేసిన జిల్లా నోడల్ అధికారులు ఈ అంశాలన్నీ చర్చిస్తారు.

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి మాథుర్ అధ్యక్షతన జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ఎమ్మెస్వోలు అకారణంగా సిగ్నల్స్ నిలిపివేస్తున్నారని, స్థానిక అధికారులు ఫిర్యాదులను పట్టించుకోవటంలేదని అస్సాం కు చెందిన కేబుల్ ఆపరేటర్లు ఈ సమావేశం  దృష్టికి తీసుకువచ్చారు. కేబుల్ టీవీ చట్టాన్ని ఉల్లంఘించినవారిమీద చర్యలు తీసుకునేందుకు, బాధితుల పక్షాన నిలబడేందుకు రాష్ట స్థాయిలో ఎలాంటి వ్యవస్థా లేదన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రతి కేబుల్ ఆపరేటర్ టిడిశాట్ కి వెళ్ళి ఫిర్యాదు చేయటమనేది ఆచరణసాధ్యం కాదన్నారు.  దీంతో ప్రాంతీయ యూనిట్ల ఏర్పాటు అంశాన్ని మంత్రిత్వశాఖ ప్రకటించింది. మూడో దశ డిజిటైజేషన్ లో ఎదురయ్యే ఇబ్బందులన్నిటినీ ఈ యూనిట్లు పరిశీలిస్తాయని చెప్పారు.

ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలమీద సంతకాలు

ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల విషయంలో ఏర్పడుతున్న ప్రతిష్ఠంభనను కొంతమంది ఎమ్మెస్వోలు టాస్క్ ఫోర్స్ దృష్టికి తెచ్చారు. బ్రాడ్ కాస్టర్ల వైపు నుంచే సమస్యలు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేశారు. సెట్ టాప్ బాక్సుల ఏర్పాటు ప్రణాళికలతో సహా రకరకాల సమాచారం అడుగుతున్నారని, ఈ దశలో ఆ వివరాలన్నీ అందించటం సాధ్యం కాదని చెప్పారు.  మూడో దశ డిజిటైజేషన్ జరుగుతున్న ప్రాంతాల్లో చానల్స్ చందా ధరలే ఒప్పందాల విషయంలో ప్రధాన అవరోధంగా తయారయ్యాయని కూడా మరికొందరు టాస్క్ ఫోర్స్ కు చెప్పారు.

కొంత మంది ఎమ్మెస్వోలు 2015 డిసెంబర్ వరకూ అనలాగ్ రేట్లతో ఒప్పందాలు చేసుకోవాలని ప్రతిపాదిస్తుండగా మరొకొందరు రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ ధరలు చెబుతున్నారని కూడా కొందరు ఫిర్యాదు చేశారు. మొదటి రెండు దశల్లో ఒప్పందాలకు నిర్దిష్ట నమూనా ఏదీ లేకపోవటంతో వత్తిడి చేసి ఒప్పందాలు చేయించుకున్నారని కొంతమంది ఆపరేటర్లు ఆరోపించారు. ఇలాంటి సమస్యలుంటే వెంటనే ట్రాయ్ కి ఫిర్యాదుచేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ సూచించారు.


టారిఫ్ సమస్యలు

టారిఫ్ ఉత్తర్వులమీదకోర్టులలో కేసులుండటం వలన కొన్ని చట్ట పరమైన ఇబ్బందులు తలెత్తాయని జాతీయ ఎమ్మెస్వోల ప్రతినిధులు టాస్క్ ఫోర్స్ దృష్టికి తీసుకువచ్చారు. ట్రాయ్ నిర్దేశించిన ప్రకారం ఒక్కో మార్కెట్ కు ఒక్కో రకమైన ధర వసూలు చేసుకునే అవకాశమున్నదని గుర్తుచేశారు. అయితే, బ్రాడ్ కాస్టర్లు అనలాగ్ ధరలు అడుగుతుండటం వల్ల ఒప్పందాలు ఖరారు కావటం లేదు. జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రాంరాలలో డిజిటల్ నెట్ వర్క్ నడపటం లాభదాయకంగా కనబడటం లేదని కూడా కొంతమంది ఎమ్మెస్వోలు టాస్క్ ఫోర్స్ కు చెప్పారు. ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల విషయంలో బ్రాడ్ కాస్టర్ల నుంచి తమకు కూడా అశించిన స్పందన కానరావటంలేదని హిట్స్ ఆపరేటర్ల ప్రతినిధులు కూడా ఫిర్యాదు చేశారు.

బ్రాడ్ కాస్టర్లు ఇప్పటివరకూ ఐదు ప్రాంతీయ ఎమ్మెస్వోలతో మాత్రమే ఒప్పందాలు కుదుర్చుకోగలిగినట్టు బ్రాడ్ కాస్టర్ల సంఘం ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబిఎఫ్) ప్రతినిధులు చెప్పారు. పే చానల్ చందాలు పెంచుకోవటానికి అవకాశమిస్తూ ట్రాయ్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కొంతమంది ఎమ్మెస్వోలు టిడిశాట్ ను ఆశ్రయించగా అక్కడ బ్రాడ్ కాస్టర్లకు ప్రతికూలత ఎదురైందని, దీనిమీద సుప్రీంకోర్టుకు వెళ్ళామని, ఈ కారణంగా ఆలస్యం జరిగిందని వివరణ ఇచ్చారు.

ట్రాయ్ ప్రతినిధి కేశర్వాణి మాట్లాడుతూ, ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలమీద సంతకాల విషయంలో జులై 6 న జరిగిన సమావేశంలో చర్చించామని, దాదాపు ఎవరూ సంతకాలు చేయలేదని తేలిందని చెప్పారు. మూడు పెద్ద బ్రాడ్ కాస్టింగ్ సంస్థలకు మొత్తం 55 విజ్జాపనలు రగా కేవలం రెండు ఒప్పందాలు మాత్రమే సంతకాలు అయ్యాయన్నారు. మరో 11 మంది ఎమ్మెస్వోలతో చర్చలు పురోగతిలో ఉన్నట్టు తేలిందన్నారు. డిజిటైజేషన్ లో హిట్స్ కార్యకలాపాలు కూడా ఉన్నందున వారు కూడా బ్రాడ్ కాస్టర్లనుంచి స్పందన లేకపోతే పురోగతిని తెలియజేయాల్సి ఉందన్నారు.

సెట్ టాప్ బాక్సులు


ఇక సెట్ టాప్ బాక్సుల విషయానికొస్తే, స్వదేశీ సెట్ టాప్ బాక్సులకు ఆర్డర్లు రావటం లేదని తయారీదారుల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు ఎమ్మెస్వోల నుంచి చెప్పుకోదగిన పెద్ద ఆర్డర్లేవీ రాలేదని, ఇది ఒకరకమైన స్తబ్దతకు నిదర్శనంగా కనబడుతోందని చెప్పారు. డిటిహెచ్ ప్రతినిధులు మాట్లాడుతూ వీడియోకాన్ నుంచి 30 లక్షల సెట్ టాప్ బాక్సులు తీసుకున్నామన్నారు. ఎమ్మెస్వోలవైపునుంచి కూడా స్వదేశీ సెట్ టాప్ బాక్సుల వినియోగం మీద శ్రద్ధ ఉండాలని ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ చైర్మన్ సూచించారు.

ఇలా ఉండగా సెట్ టాప్ బాక్సులు అమర్చే విషయంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. సమాచార ప్రసార మంత్రిత్వశాఖ జారీ చేసిన పట్టణ ప్రాంతాల జాబితాకు అనుగుణంగా బాక్సుల లెక్క తేల్చాలని టాస్క్ ఫోర్స్ సూచించింది.ఎమ్మెస్వోలు ఎన్ని సెట్ టాప్ బాక్సులు అమర్చారో ఎప్పటికప్పుడు తెలియజేయాలని కోరగా కేవలం 50 శాతం సమాచారం మాత్రమే అందిందని, అందినమేరకు లెక్కలు తేల్చుతున్నామని టాస్క్ ఫోర్స్ ప్రతినిధులు సమావేశానికి తెలియజేశారు.


ప్రజా చైతన్యం

కేబుల్ టీవీ డిజిటైజేషన్ మీద ప్రజలకు తగినంత అవగాహన లేకపోవటం వలన ఒప్పించటానికి ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తున్నదన్న ఎమ్మెస్వోల ఫిర్యాదులమీద కూడా టాస్క్ ఫోర్స్ చర్చించింది. ప్రజలకు డిజిటైజేషన్ వలన అకలిగే లాభాలను వివరించినప్పుడే స్వయంగా ఇందులో పాల్గొనటానికి ఆసక్తి చూపుతారని, అందుకే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్  అండ్ ఇండస్ట్రీ ( ఫిక్కీ ) , అసోసియేషన్ ఆఫ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్  (అసోచామ్ ) సంస్థల సహాయ  కోరామని మంత్రిత్వశాఖ ప్రతినిధులు టాస్క్ ఫోర్స్ కు తెలియజేశారు. ప్రజాచైతన్యానికి అనువైన కార్యక్రమాలు రూపొందించి ప్రచారం చేయటానికి ఆ రెండు సంస్థలూ ముందుకు వచ్చాయన్నారు. ఆ కార్యాచరణ పథకానికి తుది మెరుగులు దిద్దారని, మంత్రిత్వశాఖ ఆమోదంతో ఆచరణలో పెడతారని చెప్పారు. త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామని కూదా వెల్లడించారు.

ఎమ్మెస్వోల రిజిస్ట్రేషన్


ఎమ్మెస్వోల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగం పుంజుకున్నదని, తాత్కాలిక పద్ధతిలో కూదా లైసెన్సులు మంజూరు చేయటానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయటంతో అఫిడవిట్ ఇచ్చి తాత్కాలికలైసెన్సులు తీసుకోవటానికి కూదా చాలామంది ఎమ్మెస్వోలు ముందుకు వస్తున్నట్టు అధికారులు టాస్ద్క్ ఫోర్స్ కు తెలియజేశారు. పైగా, డిజిటల్ ఎమ్మెస్వో దరఖాస్తుదారులకు హోం శాఖ క్లియరెన్స్ అవసరం లేదన్న సడలింపు కారణంగా చాలా మంది అతి తక్కువ సమయంలోనే లైసెన్స్ పొందగలిగే అవకాశం వస్తుందని  అధికారులు హామీ ఇచ్చారు.

గతంలో  కొంతమంది గడువు ముగిసిందని దరఖాస్తు చేసుకోలేకపోవటంతో ఇప్పుడు గడువుతో నిమిత్తం లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని కూడా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అధికారులు టాస్క్ ఫోర్స్ కు వివరించారు. సకాలంలో డిజిటైజేష పూర్తి కావటానికి ప్రభుత్వం వైపు నుంచి సాయశక్తులా కృషి చేస్తున్నామని, ఇందులో భాగస్వాములైన ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు, బ్రాడ్ కాస్టర్లు, సెట్ టాప్ బాక్స్ తయారీదారులు అందరూ ఎవరి  పాత్ర వారు పోషిస్తే  లక్ష్యం నెరవేరుతుందని టాస్క్ ఫోర్స్ చైర్ పర్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు.