• Home »
  • MIB/Licencing »
  • ’రిలయెన్స్ జియో’ కు డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్

’రిలయెన్స్ జియో’ కు డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్

Reliance Jio

రిలయెన్స్ జియో ఇప్పుడు మూడో దశ డిజిటైజేషన్ లో అడుగుపెడుతున్నట్టు విస్పష్టంగా  తెలియజేస్తూ డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ తెచ్చుకుంది. కొంతకాలంగా లైసెన్స్ రావటం  వాయిదాలు పడుతూ వచ్చినా జూన్ 17 రాత్రి లైసెన్స్ వచ్చినట్టు స్వయంగా రిలయెన్స్  అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు డేటా, వాయిస్ సర్వీసులతో జనంలోకి వెళతామంటూ  చెప్పుకుంటున్నప్పటికీ, ఎమ్మెస్వో లైసెన్స్ కు దరఖాస్తు చేయటం, హాత్ వే లాంటి సంస్థలనుంచి  ఉన్నతాధికారులను తన సంస్థలో నియమించుకోవటం చూసినప్పుడు సహజంగానే రిలయెన్స్  ఆలోచనలు అర్థమవుతూ వచ్చాయి. లైసెన్స్ వచ్చే వరకూ తన ప్రణాళికలు ఎవరికీ  చెప్పకూడదనుకున్న రిలయెన్స్ ఒకటీ రెండు రోజుల్లొనే తన ఆలోచన వెల్లడించే అవకాశాలున్నాయి. దీంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేబుల్ రంగం మరింత ఉత్కంఠ ఎదుర్కుంటోంది.

 రిలయెన్స్ జియో పేరుతో 70 వేల కోట్ల పెట్టుబడులతో ప్రారంభమవుతున్న 4 జి సేవలు కేబుల్, డిటిహెచ్ వ్యాపారాన్ని సమూలంగా తుడిచిపెట్టే ప్రమాదముందని కేబుల్ పరిశ్రమలో భయాందోళనలు నెలకొన్నాయి. మొదలయ్యాయి. అతి తక్కువ ధరలో వినియోగదారులకు అత్యధిక సేవలందించటం ధ్యేయమంటున్న రిలయెన్స్ ఒక విప్లవం తీసుకురాబోతున్నదని ప్రచారం జరగటం కేబుల్ రంగాన్ని భయపెడుతోంది. అయితే  ఏది ఏమైనప్పటికీ ఇందులో నిజమెంత ఉంది, కేవలం భయాలెన్ని, పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలమీద చర్చించుకోవాల్సిన సమయం ఇది. నిజానికి రిలయెన్స్ జియో ఇప్పటిదాకా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. కానీ డిజిటల్ ఎమ్మెస్వోగా రిజిస్టర్ చేసుకోవటంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

 కొంతకాలంగా రిలయెన్స్ ఈ పథకాన్ని సిద్ధం చేసుకున్నప్పటికీ, బిజెపి అధికారంలోకి రాగానే కార్యాచరణ వేగవంతం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్ వాడుకుంటూ ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో వై ఫై ని యాక్టివేట్ చేసింది. జియో కోసం పది వేలమంది పూర్తికాలపు ఉద్యోగులు పనిచేస్తుండగా మరో 30 వేలమంది నిపుణులు సేవలందిస్తున్నారు. పైగా ఈ నెట్ వర్క్ కోసం డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చటానికి లక్షమంది పనిచేస్తున్నారు. భారత్ లో అతిపెద్ద వ్యాపారాల్లో ఇది ఒకటి అవుతుందని అంబానీ అంటున్నారు.  నిరుడు ఆగస్టులో క్షేత్ర స్థాయిలో ప్రయోగాత్మకంగా పరీక్షించి చూసి, వచ్చే మార్చి నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. మొదటి విడతలోనే 5,000 పట్టణాల్లోనూ, 2,15,000 గ్రామాల్లోనూ జియో 4జి సేవలు విస్తరిస్తారు. ఆ తరువాత మొత్తం ఆరులక్షల గ్రామాల్లో మిగిలిపోయినవాటికి అందిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, భవిష్యత్తులో మరే ఇతర సాంకేతిక పరిజ్ఞానమూ దీనికి సాటిరాకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని ముఖేష్ అంబానీ చెబుతున్నారు.

ఆపరేటర్లకు సదవకాశమే

రిలయెన్స్ జియో గురించి వస్తున్న వార్తలను నిశితంగా గమనిస్తున్న ఆపరేటర్లు దీనిని ఒక వ్యాపార అవకాశంగా తెలుసుకుంటున్నారు. మొదట్లో కొంత మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, క్రమంగా సానుకూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిలయెన్స్ కు దేశవ్యాప్తంగా ఫైబర్ నెట్ వర్క్ ఉన్నప్పటికీ స్థానికంగా ఇంటింటికీ కేబుల్ ఉన్న ఆపరేటర్ స్థానం పదిలమని భావిస్తున్నారు. రిలయెన్స్ కూడా ఈ విషయంలో స్థానిక ఆపరేటర్ల మీద అనివార్యంగా ఆధారపడుతుందనే అభిప్రాయానికి బలం చేకూరుతూ వస్తోంది. ఏది ఏమైనా చాలామంది వేచి చూద్దామనే ధోరణిలో ఆలోచిస్తున్నారు. రిలయెన్స్ ప్రవేశంతో కార్పొరేట్ ఎమ్మెస్వోలలో కలకలం మొదలైందని, స్థానిక కేబుల్ ఆపరేటర్ కు మాత్రం ఇదొక మంచి అవకాశమని మహారాష్ట్ర కేబుల్ ఆపరేటర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు అరవింద్ ప్రభు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడే నిజమైన డిజిటైజేషన్ జరుగుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కేవలం ఎమ్మెస్వోలను కొనేసినంత మాత్రాన కనెక్షన్లు తమ చేతికి రావు కాబట్టి రిలయెన్స్ అనివార్యంగా స్థానిక కేబుల్ ఆపరేటర్ మీద ఆధారపడుతుందన్న వాదన అర్థవంతంగా ఉంది. మరి రిలయెన్స్ వలన ఎవరికి ఎక్కువ నష్టం? ఇప్పటి వరకు ఆధిపత్యం చెలాయిస్తున్న కార్పొరేట్ ఎమ్మెస్వోలు సైతం రిలయెన్స్ స్థాయిలో భారీ పెట్టుబడులు పెట్టటం సాధ్యం కాదు గనుక ఇబ్బందులలో పడతారు. వాళ్లతోబాటి డిటిహెచ్ బాగా పోటీ ఎదుర్కుంటుందని భావిస్తున్నారు. డిటిహెచ్ కేవలం వీడియో సర్వీసులు మాత్రమే అందించగలిగే అవకాశం ఉండటం వలన రిలయెన్స్ బాగా మెరుగైన స్థితిలో ఉన్నట్టు లెక్క.

మొత్తంగా చూస్తే, రిలయెన్స్ మంచి ప్రతిపాదనలతో ముందుకొస్తే. స్థానిక కేబుల్ ఆపరేటర్లు ఆ అవకాశాన్ని వినియోగించుకోవటానికి సిద్ధపడే వీలుంది. కాకపోతే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అరసు కేబుల్ సంస్థ వలన రిలయెన్స్ జియో కు ఇబ్బందులు రావచ్చు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా తప్పకుండా మార్కెట్ లో ఇది గందరగోళం సృష్టిస్తుందని మాత్రం అందరూ నమ్ముతున్నారు. అది అందించే సేవల ద్వారా కాకపోయినా ధర విషయంలో నైనా కచ్చితంగా కలకలం రేపే అవకాశం ఉంది. ఇప్పటికే రకరకాల సెట్ టాప్ బాక్సులు అందిస్తూ ఇంటర్నెట్ సర్వీసులకు కూడా అవకాశం కల్పిస్తున్న ఎమ్మెస్వోలు మాత్రం రిలయెన్స్ జియో గురించి పెద్దగా భయపడటం లేదు. అయితే, చిన్న ఆపరేటర్లను తమ పరిధిలోకి  తెచ్చుకోవాలనుకుంటున్న ఎమ్మెస్వోలు మాత్రం రిలయెన్స్ జియో వలన మార్కెట్ లో కొంత గందరగోళం తప్పదని భావిస్తున్నారు.