• Home »
  • Broadband »
  • ధీరూభాయ్ అంబానీ పుట్టినరోజు కానుకగా రిలయెన్స్ జియో లాంఛనంగా ప్రారంభం

ధీరూభాయ్ అంబానీ పుట్టినరోజు కానుకగా రిలయెన్స్ జియో లాంఛనంగా ప్రారంభం

భారత టెలికమ్యూనికేషన్ల రంగంలో పెను విప్లవంగా భావిస్తున్న రిలయెన్స్ జియో ప్రారంభ తేదీ ఎట్టకేలకు వెల్లడైంది. రిలయెన్స్ సామ్రాజ్య వ్యవస్థాపకుడైన ధీరూభాయ్ అంబానీ పుట్టినరోజు అయిన డిసెంబర్ 24 న లాంఛనంగా ప్రారంభించబోతున్నట్టు ముఖేశ్ అంబానీ వెల్లడించారు. అయితే, దాదాపుగా అదే సమయానికి భారతీ ఎయిర్ టెల్ కూడా 4జి ప్రారంభించటానికి సిద్ధం కావటం కూడా విశేషం.

నిజానికి డిసెంబర్ లో రిలయెన్స్ జియో ప్రారంభిస్తామని ఆరునెలల కిందటే కంపెనీ సర్వసభ్య సమావేశంలో ముఖేశ్ ప్రకటించినా తన తండ్రి పుట్టినరోజే ఉంటుందని అప్పట్లో చెప్పలేదు. అయితే, డిసెంబర్ లో నామమాత్రంగా ప్రారంభించినా, పూర్తి స్థాయి కార్యకలాపాలు మాత్రం 2016 మార్చి తరువాతనే సాధ్యమని తెలుస్తోంది.

ఎయిర్ టెల్ కి ఉన్న అనుకూల వాతావరణం రిలయెన్స్ జియో కి లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చందాదారులు 4జి కవరేజ్ లేని ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో ఉన్న 3జి నెట్ వర్క్ అందుకుంటుంది కాబట్టి ఎక్కడా ఇబ్బంది ఉండదని, రిలయెన్స్ జియో కు అలాంటి అవకాశం లేకపోవటం వలన పూర్తి స్థాయి కార్యకలాపాలకు ఇంకా ఆరునెలల సమయం పడుతుందని చెబుతున్నారు. అందుకే మార్చి లోగా ఈ సేవలు అందుబాటులోకి రావటం అనుమామనమేనని విశ్లేషిస్తున్నారు.
.
లక్ష కోట్ల పెట్టుబడితో చేపట్టిన రిలయెన్స్ జియో ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 5 వేల నగరాలలో 4జి సేవలు అందించటానికి పథక రచన జరిగింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్నిచోట్ల పరీక్షించి చూడటం కూడా పూర్తయింది. కేబుల్ టీవీ డిజిటైజేషన్ జరుగుతున్న సమయంలో డిజిటల్ ఎమ్మెస్వోగా లైసెన్స్ కూడా తీసుకున్న రిలయెన్స్ జియో సంస్థ ఎలాంటి ప్రభావం చూపుతుందోనని కేబుల్ రంగం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.