• Home »
  • Broadcasting »
  • 412 కు చేరిన రిలయెన్స్ జియో చానల్స్

412 కు చేరిన రిలయెన్స్ జియో చానల్స్

రిలయెన్స్ జియో వారి ఓవర్ ద టాప్ ( ఒటిటి ) యాప్ ద్వారా అందుబాటులోకి వస్తున్న చానల్స్ సంఖ్య  412 కు చేరింది. గడిచిన సెప్టెంబర్ వరకు 368 చానల్స్ ఇస్తుండగా మరో 44 చానల్స్ పెరగటంతో ఆ సంఖ్య ఇప్పుడు 412 కు చేరుకున్నట్టయింది. దీంతో ఏ డిటిహెచ్ ఆపరేటర్ కూ, ఎమ్మెస్వో కూ తగ్గకుండా వాటికి దీటుగా ఉన్నట్టయింది. అదే సమయంలో మరే మొబైల్ టీవీ కూడా ఇంత పెద్ద సంఖ్యలో టీవీ చానల్స్ ఇవ్వటం లేదని కూడా తేల్చి చెప్పినట్టయింది. జీ గ్రూప్ వారి లైవ్ టీవీ యాప్ డిటో టీవీ సైతం స్టార్ ఇండియా, సన్ గ్రూప్ చానల్స్ అందించలేకపోతోంది.

జియో టీవీ మాత్రం అందుకు భిన్నంగా దాదాపు అన్ని పెద్ద చానల్స్ నూ అందించగలుగుతోంది. అందులో స్టార్ ఇండియా చానల్స్, సోనీ గ్రూప్ చానల్స్, జీ గ్రూప్ చానల్స్, టీవీ 18, వయాకామ్ 18, సన్ నెట్ వర్క్, డిస్కవరీ, టర్నర్ ఇండియా, టీవీ టుడే, ఎబిపి న్యూస్  నెట్ వర్క్, ఎన్డీటీవీ లాంటి గ్రూపుల చానల్స్ అన్నీ ఇవ్వగలుగుతోంది. తాజాగా కలిపిన చానల్స్ లో 18 న్యూస్ చానల్స్, 9 ఎంటర్టైన్మెంట్ చానల్స్, ఆరు ఆధ్యాత్మిక చానల్స్, నాలుగు మూవీ చానల్స్, మూడు మ్యూజిక్ చానల్స్ ఉన్నాయి.

ప్రస్తుతం జియో టీవీలో 130 న్యూస్ చానల్స్, 99 ఎంటర్టైన్మెంట్ చానల్స్, 36 మూవీ చానల్స్ , 34 మ్యూజిక్ చానల్స్, 27 ఆధ్యాత్మిక చానల్స్ ఉన్నాయి. లైఫ్ స్టైల్ చానల్స్  సంఖ్య 25 కు చేరుకోగా బిజినెస్ చానల్స్ సంఖ్య 12 కు, ఇన్ఫొటైన్మెంట్ చానల్స్ సంఖ్య 8 కి చేరుకున్నాయి.

జియో టీవీ లో టీవీ చానల్స్ ప్రత్యక్షంగా చూడటంతోబాటు గడిచిన వారం రోజుల కార్యక్రమాలు కూడా చూసే అవకాశం ఉంది.  లైవ్ టీవీ చానల్స్ చూడటమే కాకుండా స్టార్ ఇండియా వారి వీడియో ఆన్ డిమాండ్ విభాగం హాట్ స్టార్ సేవలు సైతం అందుకోవచ్చు. దాదాపు ఐదు కోట్ల మంది ఆండ్రాయిడ్ మీద జియో టీవీని ఇన్ స్టాల్ చేసుకున్నట్టు చెబుతున్నారు.  సెప్టెంబర్ 5 న సేవలు ప్రారంభించిన రిలయెన్స్ జియో ఇన్ఫొకామ్ కేవలం 83 రోజుల్లో ఐదు కోట్ల చందాదారుల సంఖ్యను దాటినట్టు చాటుకుంది.

డిసెంబర్ 4 న ప్రారంభించిన జియో హాపీ న్యూ ఎయర్ ఆఫర్ కింద జియో చందాదారులందరూ ఉచిత డేటా, వాయిస్ కాల్స్, వీడియో తో బాటు జియో యాప్స్ పూర్తి బొకేను 2017 మార్చి 31 దాకా ఉచితంగా పొందే సౌకర్యం పొడిగించిన సంగతి తెలిసిందే.  నిజానికి జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్, జియో మాగ్స్, జియో ఎక్స్ ప్రెస్ న్యూస్, జియో క్లౌడ్, జియో మనీ అనే యాప్స్ అన్నీ కలిపి రూ. 1250 విలువచేస్తాయి.