• Home »
  • Broadband »
  • రిలయెన్స్ జియో వ్యూహం మీద మల్లగుల్లాలు: కేబుల్ వ్యాపారంలో పాత్ర మీద వీడని సందిగ్ధత

రిలయెన్స్ జియో వ్యూహం మీద మల్లగుల్లాలు: కేబుల్ వ్యాపారంలో పాత్ర మీద వీడని సందిగ్ధత

డిజిటైజేషన్ క్రమంలో ఎమ్మెస్వోగీ ఏడాది జూన్ లోనే లైసెన్స్ తీసుకున్న రిలయెన్స్ జియో మీడియా కేబుల్ పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టిస్తుందని భావిస్తుండగా ప్రస్తుతం 4జి సేవలమీద దృష్టి సారించటం రకరకాల అనుమానాలకు తావిచ్చినట్టయింది. అయితే, ఈ మేరకు వస్తున్న వార్తలన్నీ నిరాధారమంటూ సంస్థ అధికారికంగా ఖండించింది. మూడో దశ, నాలుగో దశ డిజిటైజేషన్ లో కచ్చితంగా రిలయెన్స్ జియో తనదైన ముద్ర వేస్తుందని స్పష్టం చేసింది. కానీ రెండు నెలల్లో మూడో దశ గడువు పూర్తవుతుండగా సంస్థ వైఖరిమీద, వ్యూహం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే వస్తున్నాయి.

రిలయెన్స్ 4జి సేవలమీద ఎన్నో ఊహాగానాలు ఉండగానే ఎయిర్ టెల్ మార్కెట్లో 4జి సేవలతో హడావిడి ప్రారంభించింది. సహజంగానే మొదటి సర్వీస్ ప్రొవైడర్ కు ఉండే వెసులుబాటును ఉపయోగించుకుంటోంది. ఆ విధంగా చూస్తే రిలయెన్స్ వెనకబడిందేమోనన్న అభిప్రాయం ఒక వైపు కలుగుతూనే ఉంది. అయితే, రిలయెస్న్ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నదన్న వార్తల మధ్య కేబుల్ వ్యాపారాన్ని పక్కన బెట్టిందేమోనన్న ఊహాగానాలూ మొదలయ్యాయి. అయితే, కేబుల్ వ్యాపారమనేది రిలయెన్స్ జియో నుంచి విడదీయలేని అంతర్భాగమంటూ సంస్థ ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రారంభం కాబట్టి ఆచితూచి అడుగులేస్తున్నామని చెబుతోంది.

ముందుగా మొదటి రౌండ్ కింద 15 నగరాలతో ప్రారంభించి క్రమంగా 100 నగరాలకు విస్తరిస్తామని రిలయెన్స్ జియో తాజాగా ప్రకటించింది. జనవరి-మార్చి మధ్యలో సేవలు ప్రారంభిస్తామని కూడా వెల్లడించిం ది. స్టాండర్డ్ డెఫినిష, హై డెఫినిషన్ తో బాటు అల్ట్రా హెచ్ డి సేవలు కూడా అందించబోతున్నట్టు ప్రకటించింది. ఒక్కో కనెక్షన్ కు గరిష్టంగా సగటు ఆదాయం లభించేలా పథక రచన జరుగుతున్నట్టు రిలయెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది. చందాదారుడికి నాణ్యమైన సేవలందించే విషయంలో రాజీ ప్రసక్తే లేదని కూడా సంస్థ సాంకేతిక నిపుణులు ఇప్పటికే ప్రకటించారు.

హెడ్ ఎండ్స్, సాంకేతిక భాగస్వాములు, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ఇప్పటికే ఒప్పందాలు పూర్తయ్యాయని, అన్ని వ్యవహారాలూ పూర్తి చేసుకొని డిసెంబర్ లోగా రంగ ప్రవేశం చేస్తామని చెబుతున్నారు. కేబుల్ తోబాటు బ్రాడ్ బాండ్ సేవలు కూడా అందించే విషయంలో ఇప్పటికే అనేకమంది కేబుల్ ఆపరేటర్లను సంప్రదించామంటున్నారు. దీపావళి తరువాత కేబుల్ ఆపరేటర్లతో తుదివిడత చర్చలు జరుగుతాయని రిలయెన్స్ జియో సీఈవో జయరామన్ చెబుతున్నారు. గతంలో హాత్ వే సీఈవో గా పనిచేసిన జయరామన్ కు ఈ రంగంలో ఉన్న విశేషానుభవం బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ఇలా ఉండగా, రిలయెన్స్ ధీమా చూస్తుంటే డిజిటైజేషన్ మూడో దశ గడువు తేదీ పొడిగించే అవకాశముందని కేబుల్ పరిశ్రమలో చర్చ మొదలైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేయగల సత్తా ఉన్న రిలయెన్స్ సంస్థ కచ్చితంగా గడువు పొడిగింపుకోసం ప్రయత్నిస్తుందని అంచనా వేస్తున్నారు. నిజానికి మూడో దశలో పురోగతి ఇంకా 50 శాతం కూడా లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా పొడిగించక తప్పదనే అభిప్రాయం నెలకొంది.
మరోవైపు రిలయెన్స్ కేవలం మూడు, నాలుగు దశల మీద దృష్టి సారించకుండా, ఇప్పటికే డిజిటైజేషన్ పూర్తయిన నగరాలనూ వదలకపోవటం మరింత అయోమయ వాతావరణానాన్ని సృష్టిస్తోంది. డిజితైజేషన్ పూర్తయిన చోత కూడా సరికొత్త పాకేజీలతో ప్రవేశిస్తే కేబుల్ ఆపరేటర్లు ప్రస్తుత ఎమ్మెస్వోలకు గుడ్ బై చెప్పి రిలయెన్స్ పంచన చేరే అవకాశముందని, అదే జరిగితే మొత్తంగా కేబుల్ వ్యాపారమే తీవ్ర సంక్షోభంలో పడవచ్చునని భావిస్తున్నారు.