• Home »
  • Cable/DTH/HITS »
  • అప్పులు తగ్గించుకునేందుకు డిటిహెచ్ వ్యాపారం అమ్మేస్తున్న రిలయెన్స్ ?

అప్పులు తగ్గించుకునేందుకు డిటిహెచ్ వ్యాపారం అమ్మేస్తున్న రిలయెన్స్ ?

రిలయెన్స్ డిజిటల్ టీవీ పేరుతో నడుపుతున్న డైరెక్ట్ టు హోమ్ (డిటిహెచ్) ప్లాట్ ఫామ్ ను అమ్మేయాలని అనిల్ అంబానీ సారధ్యంలోని రిలయెన్స్ కమ్యూనికేషన్స్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని అప్పులు తీర్చటానికి వినియోగించాలని భావిస్తోంది. దూరదర్శన్ వారి డిటిహెచ్ పక్కనబెడితే, మొత్తం ఆరు ప్రైవేట్ డిటిహెచ్ సంస్థలుండగా రిలయెన్స్ ది ఆఖరిస్థానం. అమ్మాలన్న ఆలోచనకు ఇది కూడా ఒక కారణం కావచ్చు.

మొత్తం డిటిహెచ్ మార్కెట్ లో కేవలం 7% వాటా ఉన్న రిలయెన్స్ డిటిహెచ్ కొంత కాలంగా కొత్త చందాదారులను ఆకర్షించటం మానేసి కేవలం ప్రస్తుత చందాదారులను నిలుపుకోవటం మీదనే దృష్టిసారించింది. దేశవ్యాప్తంగా 8,366 నగరాలు, పట్టణాలలో అందుబాటులో ఉన్న రిలయెన్స్ డిటిహెచ్ కి 48 లక్షల 70 వేల మంది చందాదారులున్నారు.

గతంలో ఒకసారి సన్ టీవీ తో చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, అమ్మకం వ్యవహారం అప్పట్లో కొలిక్కి రాలేదు. సన్ గ్రూప్ వారి డిటిహెచ్ కూడా అదే ఉపగ్రహం ద్వారా ప్రసారాలు అందిస్తూ ఉండటంతో ఈ కొనుగోలు అర్థవంతమే అవుతుందని వార్తలు వచ్చాయి. నిజానికి ఉచిత చానల్స్ కు సంబంధించినంతవరకు బాండ్ విడ్త్ ఖర్చు తగ్గించుకోవటానికి సన్, రిలయెన్స్ కలిసి ఉమ్మడిగా బాండ్ విడ్త్ వాడుకుంటున్నాయి.