• Home »
  • National Channels »
  • రూ. 3 వేల కోట్లకు చేరనున్న స్పోర్ట్స్ టీవీల ఆదాయం

రూ. 3 వేల కోట్లకు చేరనున్న స్పోర్ట్స్ టీవీల ఆదాయం

టీవీ పరిశ్రమ అంచనాల ప్రకారం స్పోర్ట్స్ చానల్స్ ప్రకటనల ఆదాయం ఈ 2016 లో రూ.3 వేల కోట్లకు చేరుతుంది. ఈ ఎదుగుదలకు ప్రధాన కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్), ట్వెంటీ 20 వరల్డ్ కప్ అని కూడా ఆ అంచనాలు తేల్చాయి. ఈ ఏడాదిలోనే యూరో 2016 కూడా జరగాల్సి ఉంది. ఈ మూడూ ఈ ఏడాది ఆదాయాన్ని గణనీయంగా ప్రభావితం చేసి ముందుకు నడిపిస్తాయని సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ గుప్తా అభిప్రాయపడ్డారు.

ఫీఫా వరల్డ్ కప్ తరువాత అతిపెద్ద సాకర్ ఈవెంట్ గా వచ్చే నెల జరిగే యూరోకు ప్రాధాన్య ఉందన్న సంగతి గుర్తు చేస్తూ ఆదాయం మెరుగ్గా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలో స్పోర్ట్స్ ప్రసారాల ప్రాధాన్యం తక్కువే అయినప్పటికీ ఇటీవలి కాలంలో పుంజుకుంటున్నాయని అనేక బ్రాండ్లు క్రీడా ప్రసారాలలో ప్రకటనలివ్వటానికి ముందుకొస్తున్నాయని చెప్పారు.

అంతా సానుకూలమైన దృక్పథం కనబడుతోందని, ఐపిఎల్ లో 20% ఆదాయం పెరుగుదల నమోదు కాగా రాబోయే యూరోలో మరింత పెద్ద మార్పు కనబడే అవకాశముందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే స్పాన్సర్లను ఖరారు చేసుకోవటం పూర్తయినట్టు కూడా వెల్లడించారు. సాకర్ పట్ల ఆదరణ బాగా పెరుగుతున్న నేపథ్యంలో దీని ఆదాయంలో పెరుగుదల 20-25% వరకు ఉండవచ్చునని రోహిత్ గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇపిఎల్ 1200 కోట్ల రూపాయలు సంపాదించింది. క్రికెట్ కున్న ప్రాధాన్యంతో పోల్చలేకపోయినా, మరీ ముఖ్యంగా టి 20 నమూనాతో పోటీపడే అవకాశం లేకపోయినా ఎన్ బి ఎ, యు ఎఫ్ సి కూడా పూర్తిగా తీసేయదగినవేమీ కాదన్నారు. ఇవి ప్రాధాన్యం పెంచుకోవటానికి రెండేళ్ళు పట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. అప్పటికి ఇవి గణనీయమైన స్థానం సంపాదించుకోగలవని ధీమా వ్యక్తం చేశారు.  క్రికెటేతర క్రీడల్లో లీగ్ లు పెద్దగా ఆదాయాన్ని తెచ్చిపెట్టలేవని కూడా ఒప్పుకున్నారు.

గతంలో పాత నమూనాలో క్రికెట్ పోటీలు జరిగినప్పుడు ఆదాయం సంపాదించుకోవటం చాలా కష్టంగా ఉండేదని టి20 తో పోల్చి చూసినప్పుడు రేట్లలో పెద్దగా ఎదుగుదల కనబడదని గుర్తుచేశారు. వన్డే ఇంటర్నేషనల్  రేటింగ్స్ కూడా గత రెండేళ్ళ కాలంలో దాదాపు స్థిరంగా ఉండిపోయాయని చెబుతూ యువతను వేగంగా ఆకట్టుకోగలిగే ఆట మాత్రమే ఎక్కువా ఆదాయం తెచ్చిపెడుతుందని తేల్చిచెప్పారు. న్యూస్ చానల్స్ ద్వారా ఎగువ వయోవర్గాలవారిని ఆకట్టుకోగలిగే మాట నిజమే అయినా జనాభాలో 65% మంది 35 ఏళ్ళ లోపు వాళ్ళేనన్నది చాలా కీలకమైన విషయమని గుప్తా వ్యాఖ్యానించారు.

యువతను ఆకట్టుకోవాలనుకునే ఏ బ్రాండ్ అయినా సరే ఈ అవకాశాన్ని బాగా వాడుకుంటుందన్నారు.  టెలికామ్, ఆటొమొబైల్స్ లాంటి రంగాలు అందుకే ఎక్కువగా స్పాన్సర్లుగా ముందుకొస్తుంటాయని విశ్లేషించారు. మొత్తం స్పోర్ట్స్ ప్రకటనల ఆదాయంలో క్రికెట్ ఒక్కదానికే 85% వాటా లభిస్తుండగా స్టార్ స్పోర్ట్స్ కేవలం టి20 వరల్డ్ కప్ ద్వారానే  రూ.300 నుంచి 350 కోట్ల వరకు ఆదాయం వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్పోర్ట్స్ ఆదాయంలో పెరిగే 10 శాతంలో 90 శాతం వాటా క్రికెట్ కే చెందుతుందని చెబుతున్నారు. మొత్తం క్రికెట్ ఆదాయంలో ఐపిఎల్ వాటా కనీసం 40 శాతం ఉంటుందని అంచనా. నిరుడు ఈ-కామర్స్ బాగా చురుగ్గా ఉండగా ఈ సారి మొబైల్ విభాగం బాగా చురుగ్గా ఉందని యాడ్ ఏజెన్సీలు అంచనా వేశాయి.