• Home »
  • Content Code »
  • ప్రభుత్వాన్ని క్షమాపణ కోరిన రష్యా టుడే చానల్

ప్రభుత్వాన్ని క్షమాపణ కోరిన రష్యా టుడే చానల్

అసభ్యకరమైన దృశ్యాలు ప్రసారం చేసినందుకు రష్యా టుడే టీవీ చానల్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. భారత్ లో ప్రసారమయ్యే అంశాలవిషయంలో ఇకముందు మరింత జాగ్రత్తగా ఉంటామని, తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామని కూడా చెప్పింది. నిరుడు ప్రసారమైన కొన్ని దృశ్యాల మీద సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ లేవనెత్తిన అభ్యంతరాలమీద మాస్కో కేంద్రంగా నడిచే ఈ చానల్ స్పందించింది.

గత డిసెంబర్ లో అసభ్యకరమైన దృశ్యాలు ప్రసారం కావటం మంత్రిత్వశాఖ దృష్టికి రాగానే షో కాజ్ నోటీస్ పంపింది. రష్యా టుడే వారి పంపిణీ భాగస్వామ్య సంస్థ అయిన లంహాస్ శాటిలైట్ సర్వీసెస్ లిమిటెడ్ దీనికి స్పందిస్తూ, తాము ఉద్దేశపూర్వకంగా అలాంటి పిరపాటు చేయలేదని, మహిళలను అసభ్యంగా చిత్ర్రీకరించటం తమ అభిమతం కాదని పేర్కొంది. మరింత జాగ్రత్తగా ఉండాల్సిందిగా తమ చానల్ రష్యా టుడే తమను హెచ్చరించిందని కూడా ఆ సంస్థ పేర్కొంది.

చానల్ ప్రతినిధి కూడా మంత్రిత్వశాఖల ప్రతినిధుల బృందం ఎదుట హాజరై తప్పిదాన్ని అంగీకరించారు. బాగా పొద్దుపోయాక ప్రసారం చేశామని, అయినప్పటికీ క్షమాపణలు కోరుకుంటున్నామని చెప్పారు. క్షమాపణ కోరటంతోబాటు ముందు ముందు జాగ్రత్తగా ఉంటామని చెప్పటం వల్ల సలహాతో సరిపెడుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. భారత ప్రభుత్వ నియమనిబంధనలు తెలుసుకొని మసలాలని ఆ ఆదేశాలలో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.