• Home »
  • Content Code »
  • మంత్రిత్వశాఖ హెచ్చరిక మీద ఢిల్లీ హైకోర్ట్ లో సత్యం టీవీ పిటిషన్

మంత్రిత్వశాఖ హెచ్చరిక మీద ఢిల్లీ హైకోర్ట్ లో సత్యం టీవీ పిటిషన్

తమిళనాడుకు చెందిన సత్యం టీవీ కేసులో సమాధానం ఇవ్వాలని సమాచార, ప్రసారశాఖను ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించింది. ప్రధాని నరేంద్రమోడీని కించపరచే విధంగా వార్త ప్రసారం చేసిందంటూ హెచ్చరిక జారీచేసిన సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆదేశాలను తమిళ న్యూస్ చానల్ సత్యం టీవీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ఒకవేళ రెండో సారి హెచ్చరించాల్సి వస్తే లైసెన్స్ సైతం రద్దయే అవకాశం ఉండటంతో సత్యం టీవీ కోర్టుకెళ్ళాలన్న నిర్ణయం తీసుకుంది. విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు ఈ రోజు మంత్రిత్వశాఖకు నోటీసు జారీ చేసింది. కేసు విచారణను జనవరి 15 కు వాయిదా వేసింది.

2014 డిసెంబర్ 9 న ప్రసారమైన కార్యక్రమాలలో ప్రధానిని అవహేళన చేసినందుకు సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ తీవ్రంగా ఆ చానల్ కు హెచ్చరిక జారీచేసింది. సత్యం టీవీలో ఉంగళ్ ఆశీర్వాద నేరమ్ (మీ ఆశీర్వాద సమయం) అనే మతపరమైన కార్యక్రమం, పార్తదుమ్, పడిదదుమ్ (చూసిందీ, చదివిందీ) పేరిట ఒక వార్తా విశ్లేషణ కార్యక్రమం ప్రసారమయ్యాయని, అందులో ఒక జర్నలిస్ట్ ప్రధానిని చాలా అవమానకరంగా చిత్రిస్తూ వ్యాఖ్యలు చేశారని సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ జారీచేసిన నోటీసులో పేర్కొంది. ఈ రెండు కార్యక్రమాలూ 2014 డిసెంబర్ 14 న ప్రసారమయ్యాయి.

మొదటి కార్యక్రమంలో ఒక బైబిల్ ప్రచారకుడు “ ఓ ప్రభువా, ఈ వ్యక్తినీ, ఇతడి బిడ్దలనూ నానుంచి దూరముగా తీసుకువెళ్ళుము “ అన్నారని, ఒక రాజకీయనాయకుడిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సున్నితమైన అంశంగా మారి అల్లర్లకు దారితీసే ప్రమాదమున్నదని మంత్రిత్వశాఖ వ్యాఖ్యానించిది. వార్తల ఆధారంగా రూపొందించిన మరో కార్యక్రమంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ “ రాజకీయాల్లో విజయం సాధించాలంటే ఒక అబద్ధాన్ని నిజంగా మార్చాలి, అన్నిటికంటే ముఖ్యంగా ఆ మాటను జనం నమ్మేట్టు చేయాలి” అన్నారు.

అయితే, సత్యం టీవీ వివరణ ఇస్తూ , మత సంబంధమైన కార్యక్రమంలో పేర్కొన్న అంశం సాధారణ ప్రార్థనలో భాగమే తప్ప ఎక్కడా ప్రధాని ప్రస్తావనే లేదని, గౌరవనీయులైన ప్రధానిని ఉద్దేశించినది కాదని పేర్కొంది. ఇక ’ పార్తదుమ్, పడిదముమ్ ’ విషయానికొస్తే, అది పత్రికల వార్తాకథనాలమీద చర్చా కార్యక్రమమని చెప్పింది. రాజకీయ చతురునిగా ప్రధాని నైపుణ్యాన్ని పోల్చిచెప్పటానికి ఉద్దేశించిన వ్యాఖ్యలే తప్ప అంతకు మించి మరేమీ కాదని చెప్పింది. పైగా తమకు ఎలాంటి రాజకీయ పక్షపాతంగాని, దురుద్దేశాలుగాని లేవని కూడా చానల్ తన వివరణలో పేర్కొంది.

అయితే మంత్రిత్వశాఖల కమిటీ మాత్రం సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ పేర్కొన్న అభ్యంతరాలు సబబేనని అభిప్రాయపడింది. ఇకముందు అలాంటివి పునరావృతం జరగకుండా చూసుకోవాలని హెచ్చరించింది. క్షమాపణలు చెప్పాలని కూడా ఆదేశించగా సత్యం టీవీ అందుకు నిరాకరించింది. హెచ్చరిక అర్థరహితమంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. దీనిమీద ప్రభుత్వానికి నోటీసులిచ్చిన హైకోర్ట్ విచారణను వచ్చే జనవరి 15 కు వాయిదా వేసింది.