• Home »
  • Legal Issues »
  • సన్ టీవీ ఆస్తుల జప్తు మీద సుప్రీంకోర్టు స్టే

సన్ టీవీ ఆస్తుల జప్తు మీద సుప్రీంకోర్టు స్టే

ఎయిర్ సెల్- మాక్సిస్ కేసులో సన్ టీవీ ఆస్తులు జప్తుచేయాలన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నిర్ణయం అమలుకాకుండా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో మారన్ సోదరులు కాస్త ఊపిరి పీల్చుకున్నట్టయింది. ఎఫ్ ఎం చానల్స్  వేలంలో సన్ గ్రూప్ పాల్గొనకుండా దిగువ కోర్టులు  అడ్డుకున్నా,  సుప్రీంకోర్టు అనుమతించటంతో ఆఖరి నిమిషంలో వేలంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

అదే క్రమంలో ఇప్పుడు రెండో విడత కూడా  సుప్రీంకోర్టు సన్ టీవీని ఆదుకుంది. ఆస్తుల జప్తుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన ఆదేశాలమీద స్టే ఇచ్చింది. అయితే, జప్తును ధ్రువీకరించటానికి అవసరమైన 180 రోజుల గడువు ముగిసినప్పటికీ ఉత్తర్వులు సజీవంగా ఉంటాయని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఎయిర్ సెల్ – మాక్సిస్ వ్యవహారంలో సంబంధం ఉందన్న ఆరోపణలతో సన్ టీవీ కి చెందిన 742 కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులను జప్తు చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద ఈ చర్య తీసుకుంది.

సన్ టీవీ మొదట మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఇది 2జి స్పెక్ట్రమ్ కేసుకు సంబంధించిదని, ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నదని పేర్కొంటూ విచారణకు ఒప్పుకోలేదు. దీంతో స్న్ టీవీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.