• Home »
  • Legal Issues »
  • దయానిధి మారన్ అరెస్ట్ ను నిలిపేసిన సుప్రీంకోర్టు

దయానిధి మారన్ అరెస్ట్ ను నిలిపేసిన సుప్రీంకోర్టు

మాజీ కేంద్రమంత్రి దయానిధి మారన్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అక్రమ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కేసులో మద్రాసు హైకోర్టు రద్దు చేసిన ముదస్తు బెయిల్ మీద సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఇప్పటికిప్పుడు ఆయనను సిబిఐ అరెస్టు చేసే అవకాశం లేదు. సుప్రీంకోర్టు స్టే సెప్టెంబర్ 14 వరకు అమలులో ఉంటుంది. ఈ విషయంలో రెండు వారాల్లోగా సమాధానమివ్వాలని కూడా సుప్రీంకోర్టు సిబిఐ కి నోటీసులు జారీచేసింది.
సిబిఐ తరఫున హాజరైన అటార్నీ జనరల ముకుల్ రోహత్గీ ఈ కేసు పూర్వాపరాలు వివరిస్తూ ఇది భారీ అవినీతికి సంబంధించినదని, సన్ టీవీ కోసం టెలిఫోన్ లైన్లను వాడుకున్నారని, ఇందులో సన్ టీవీ, బి ఎస్ ఎన్ ఎల్ కుట్రను బహిర్గతం చేయటానికి మారన్ ను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరమున్నదని వాదించారు. అయితే, నిందితుడు దేశం వదిలి వెళ్ళే అవకాశమునప్పుడు, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే బెయిల్ నిరాకరించవచ్చు తప్ప కేవలం అవమానించటానికి సిబిఐ పట్టుబడుతున్నదని మారన్ తరఫు న్యాయవాది వాదించారు.
న్యాయమూర్తులు జస్టిస్ టిఎస్ టాకూర్, జస్టిస్ వి గోపాలగౌడ ఇరుపక్షాల న్యాయవాదులనూ ప్రశ్నించిన మీదట ఆదేశాలు జారీచేశారు.

కోటి రూపాయల పెండింగ్ ఫోన్ బిల్లులున్న కారణంగా సిబిఐ అరెస్ట్ చేస్తుందా అని ప్రశ్నించారు. 2013 లోనే ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసినప్పుడు అరెస్ట్ ఎందుకు చేయలేదని కూడా అడిగారు. ఒకవేళ ఫోన్ లైన్లు బిగించటం కుట్రలో భాగమే అయితే మారన్ ను, బిఎస్ ఎన్ ఎల్ అధికారులను ప్రశ్నించవచ్చు కదా అని కూడా అడిగారు. అరెస్ట్ చేయటాన్ని మీరు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారా? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినవారెవరూ తప్పించుకోవటానికి వీల్లేదు. కానీ ప్రశ్నించటానికి కస్టడీ అవసరమా? నష్ట కోటి రూపాయలని మీరు ఎలా అంచనావేశారు ? అసలు బిల్లులే తయారు చేయలేదంటున్నారు. ఆయనేమో కట్టేస్తానంటున్నాడు. ఇప్పుఇడు బిల్లు ఇవ్వండి , కడతాడు. “ అన్నారు జస్టిస్ ఠాకూర్.

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం టెలికమ్యూనికేషన్ల శాఖామంత్రిగా ఉన్న మారన్  బిఎస్ ఎన్ ఎల్ అధికారులతో కలిసి కుట్రపూరితంగా ప్రభుత్వానికి నష్టం కలిగించారు. తన నివాసంలో ఆయన 300 టెలిఫోన్ కనెక్షన్లు ఏర్పాటుచేసుకొని వాటిని సర్వీస్ కేటగిరీ కింద రాయించి ఎలాంటి చెల్లింపులూ జరపలేదన్నది అభియోగం.