• Home »
  • MIB/Licencing »
  • అదనపు చానల్స్ కి సెక్యూరిటీ క్లియరెన్స్ అక్కర్లేదు : హోం శాఖ

అదనపు చానల్స్ కి సెక్యూరిటీ క్లియరెన్స్ అక్కర్లేదు : హోం శాఖ

చానల్ యజమానులకు ఊరటనిస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ తాజాగా ఒక ప్రకటన చేసింది. ఇప్పటికే చానల్స్ నడుపుతున్న సంస్థలు కొత్తగా చానల్స్ పెట్టదలచుకుంటే హోంశాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీనివలన నేరుగా సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ లైసెన్సులు ఇవ్వటానికి వీలవుతుంది. ఎంతో కాలంగా బ్రాడ్ కాస్టర్ల సంఘమైన ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ ( ఐబిఎఫ్ ) చేస్తున్న విజ్ఞప్తులకు హోంశాఖ ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది.

ఒక మీడియా సంస్థగాని, ఒక మీడియా సంస్థలో డైరెక్టర్లు గాని శాటిలైట్ చానల్స్ నడపటానికి ఒకసారి హోం మంత్రిత్వశాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకున్న పక్షంలో మళ్ళీ పదేళ్ళ వరకూ తీసుకోవాల్సిన అవసరం ఉండదని హోంశాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. గతంలో ఒకసారి ఈ వ్యవధిని మూడేళ్లకు కుదించాలని నిర్ణయించినప్పటికీ , తీవ్రమైన వ్యతిరేకత రావటంలో హోంశాఖ ఆ ఆలోచనను విరమించుకుంది. పైగా, డిజిటల్ ఎమ్మెస్వోలకు సైతం క్లియరెన్స్ ఇవ్వాల్సిరావటం, బాగా జాప్యం అవుతుండటం కూడా హోంశాఖ నిర్ణయానికి కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు.

ఇలా ఉండగా, మొత్తం లైసెన్సింగ్ విధానం మీద ఒక సమగ్రమైన, పారదర్శకమైన విధానాన్ని ప్రకటించవలసిందిగా ఎంటర్టైన్మెంట్ చానల్స్ యజమానుల సంఘం ఐబిఎఫ్ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖకు విజ్ఞప్తిచేస్తోంది. అదే విధంగా దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట కాలపరిమితి లోగా లైసెన్సులు మంజూరు చేసేలా చూడాలని కూడా కోరింది. లైసెన్సుల జారీలో ఇప్పుడు జరుగుతున్న ఆసాధారణ జాప్యం వలన పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నట్టు ఐబిఎఫ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది. పెండింగ్ దరఖాస్తుల సెక్యూరిటీ క్లియరెన్స్ కు గరిష్టంగా రెండు నెలలు మాత్రమే పట్టేలా చూడాలని విజ్ఞప్తి చేసింది.