• Home »
  • Production »
  • మాతా అమృతానందమయి మీద శేఖర్ కపూర్ డాక్యుమెంటరీ

మాతా అమృతానందమయి మీద శేఖర్ కపూర్ డాక్యుమెంటరీ

ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు, నటుడు, నిర్మాత శేఖర్ కపూర్  పేరుమోసిన ఆధ్యాత్మిక వాది, మానవతావాది అయిన శ్రీ మాతా అమృతానందమయి దేవి మీద తాజాగా రూపొందించిన  డాక్యుమెంటరీ  “ ద సైన్స్ ఆఫ్  కంపాషన్ ” ను విడుదల చేశారు.  సెప్టెంబర్ లో జరిగే అమ్మ 60 వ జన్మదినోత్సవం కోసం  కేరళలోని కొల్లం జిల్లాలో ఉన్న అమ్మ ఆశ్రమంలో నాలుగు రోజులపాటు నిర్మించిన ఈ డాక్యుమెంటరీ నిడివి 50 నిమిషాలు.

మానవాళిపై అమ్మ కురిపించే కారుణ్యపు మూలాలను పరిశోధించి మరీ శేఖర్ కపూర్ ఈ డాక్యుమెంటరీని నిర్మించారు.  ఇందులో అత్యంత అరుదైన అమ్మ ఇంటర్వ్యూ తోబాటు నోబెల్ బహుమతి గ్రహీత అయిన డాక్టర్ లేలాండ్ హార్ట్ వెల్ తదితర ప్రముఖులు అమ్మ  విశిష్ట వైఖరిమీద వెలిబుచ్చిన అభిప్రాయాలను గుదిగుచ్చారు. మాత ప్రేమపూర్వకమైన స్పర్శతో ఎన్నో జీవితాలు మారిన తీరును ఇందులో పొందుపరచామని శేఖర్ కపూర్ వెల్లడించారు.

“ మన సొంత వ్యక్తిత్వానికి ఆవల ఏముంటుందన్న అనుమానంతో నా పరిశోధన 15 ఏళ్ళుగా సాగుతూనే ఉంది. నిజమైన ప్రేమ స్వభావం ఎలా ఉంటుంది? మన ప్రేమ మీద మన హక్కు ఉండకపోవటముంటుందా? కరుణ అంటే ఏమిటి ? అది మీరు చేసే పని అనుకోవాలా? ఒక మానసిక స్థితి అనుకోవాలా? ఒక అస్తిత్వ భావనా? మారు మరింత కరుణామయులుగా మారిపోతే అది మీ శారీరక స్థితిని కూడా మార్చేస్తుందా? మీకొక అంతరాత్మ ప్రబోధం పెరిగిపోతుందా? ఇది కేవలం నాకొక ఆధ్యాత్మిక శోధన మాత్రమే కాదు, ఒక శాస్త్రీయమైన ప్రశ్న కూడా. అమ్మ 60 వ జన్మదినోత్సవం కోసం కలుసుకోవటం నాకోపెద్ద అవకాశం. లోతైన నా ప్రశ్నలన్నిటికీ సమాధానంకోసం ఈ డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో అమ్మనే అడిగా” అన్నారు శేఖర్ కపూర్.

అమ్మ సమక్షంలో ఉండటంలోనే ఒక విశిష్టమైన అనుభూతి ఉందని, అమె నుంచి శక్తిపాతం సంక్రమిస్తుందని శేఖర్ కపూర్ అభిప్రాయపడ్డారు. అనంతమైన ప్రశ్నలడిగినా నిర్దిష్టమైన సంఖ్యలో జవాబులు రావని, ఆ మాటకొస్తే జవాబులే లేవని అన్నారాయన. అనుభూతి చెందటమే అన్నిటికీ సమాధానమని అర్థమైందన్నారు. అమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు అలాంటి అనుభూతి కోసమే వెళతామని, ఆధ్యాత్మికత అంటే అద్భుతాలు, మాయాజాలం, నాటకీయత కాదని అమ్మ సాన్నిధ్యంలో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. “ ఆమ్మ సందేశం ప్రభావం అంతా ఇంత అని చెప్పలేను. ప్రేమ, కరుణ నిండి ఉండే సందేశంలో ఆమె ఎంతగా ప్రభావితం చేయగలదో, ఆ ప్రభావం క్రమంగా ఎలా పెరుగుతుందో అర్థమవుతుంది.

మాతా అమృతానందమయి మఠం వైస్ చైర్మన్ స్వామి అమృత స్వరూపానంద మాట్లాడుతూ, శేఖర్ కపూర్ లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి స్వయంగా అమ్మ మీద డాక్యుమెంటరీ నిర్మాణానికి పూనుకోవటం విశేషమన్నారు. ఆయన అమ్మ మీద ఉంచిన విశ్వాసానికి, సృజనాత్మకతను రంగరించి నిజమైన ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేసి  సహృదయంతో డాక్యుమెంటరీ నిర్మించినందుకు ఎంతో సంతోషంగా ఉన్నామన్నారు.