• Home »
  • Broadcasting »
  • టీవీ రంగంలో మళ్ళీ కీలకపాత్ర దిశగా శరద్

టీవీ రంగంలో మళ్ళీ కీలకపాత్ర దిశగా శరద్

సన్ నెట్ వర్క్ విజయంలో అత్యంత కీలకపాత్ర పోషించిన శరద్ కుమార్ మళ్ళీ బ్రాడ్ కాస్ట్ రంగంలో ప్రత్యక్షంగాగాని, పరోక్షంగా గాని ప్రవేశించే ఆలోచనలో ఉన్నారు. టీవీ వ్యాపారంలో కార్యక్రమాల స్థాయిని అంచనావేయటంలోను, మార్కెటింగ్ వ్యూహకర్తగాను, సాంకేతికపరిజ్ఞానం విషయంలోను ఆయనకున్న పరిజ్ఞానానికిగాను ఆయనకు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్నాయి. ఇప్పుడు కొత్తగా చానల్ పెట్టే ఆలోచన లేకపోయినా పెట్టుబడి పెట్టటానికి ఆసక్తి చూపుతున్నారు. డిజిటల్ మాధ్యమంలో విజయావకాశాలున్న ఆలోచనలతో ముందుకొచ్చే స్టార్టప్ లను సైతం ప్రోత్సహించే దిశలో ఆయన ఆలోచనలు సాగుతున్నాయి.

కళానిధి మారన్ తో కలిసి సన్ నెట్ వర్క్ ను విజయపథంలో నడిపించటంలో ఆయన పాత్ర గురించి టీవీ రంగంలో అనుబంధం ఉన్నవాళ్ళందరికీ తెలుసు. సన్ టీవీ, సూర్య టీవీ బాధ్యతలు కళానిధి మారన్ చూస్తున్న సమయంలో ఉదయ, జెమిని బాధ్యతలు తీసుకున్న శరద్ కుమార్ ఆ రెండింటినీ ఈనాడుకు రెట్టింపు రేటింగ్స్ స్థాయిలో నిలబెట్టిన ఘనత ఆయనది. ఒక దశలో సన్ టీవీని సైతం మించి జెమినీ రేటింగ్స్ సంపాదించుకుంది.

కన్నడ, తెలుగు భాషల్లో ఈటీవీ బాగా వెనుకబడిన సమయంలో రెండో స్థానం కూడా ఖాళీగా ఉన్నదని సవాలు విసరటమేకాకుండా రెండో చానల్ కూడా ప్రారంభించి విజయం వైపు నడిపించారు.

పే  చానల్స్  ఆలోచనను మొట్టమొదటగా అమలు చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. సన్ టీవీ సైతం ధైర్యం చేయని సమయంలో ఆయన తేజా టీవీని, ఆ తరువాత జెమిని టీవీని పే చానల్స్ గా మార్చి చూపించారు. కేబుల్ ఆపరేటర్లనుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ అందులో ఉన్నవ్యాపార అవకాశాలను విప్పి చెప్పటం ద్వారా వాళ్ళు పోటాపోటీగా జెమినీ బాక్సులకోసం క్యూ కట్టే పరిస్థితి తెచ్చారు. జెమినీ కనెక్షన్ ఉంటేనే ఒక ఎమ్మెస్వోగా మనుగడ ఉంటుందనే పరిస్థితి వచ్చేలా చానల్ కార్యక్రమాలను ఒకవైపు, పే చానల్ ద్వారా ఆదాయాన్ని  మరోవైపు తీర్చి దిద్దారు.

అయితే, 2004 లో సన్ నెట్ వర్క్ నుంచి ఆయన వైదొలగాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. కరుణానిధి సైతం సన్ నెట్ వర్క్ లో వాటాల వివాదం కారణంగా వైదొలిగారు. కొద్ది కాలానికే కరుణానిధి కోరిక మేరకు కలైంజ్ఞర్ చానల్ నెలకొల్పి మరిన్ని చానల్స్ జోడించి ఆ నెట్ వర్క్ ను ముందుకు నడిపించగలిగారు. అయితే, ఆ చానల్ ఎండీగా ఉన్న కారణంగా 2జి కుంభకోణంలో ఆయన పేరు కూడా చేరింది. ఈటీవలే నిర్దోషిగా బైటపడిన తరువాత మళ్ళీ ఆయన తన అనుభవాన్ని టీవీ రంగం కోసం ఉపయోగించే ఆలోచనలో పడ్డారు.

బ్రాడ్ కాస్టింగ్ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ వచ్చిన శరద్ కుమార్ ఇప్పటి పరిస్థితులకు అనువైన వ్యూహంతో  ముందుకెళ్ళాలనుకుంటున్నారు. డిజిటల్ రంగంలో వస్తున్న మార్పుల దృష్ట్యా భవిష్యత్తును ఊహించి అందుకు తగినట్టు మసలుకోవటం ముఖ్యమనేది ఆయన అభిప్రాయం. త్వరలోనే ఆయన తన ఆలోచనలకు ఒక స్పష్టమైన రూపం ఇచ్చే అవకాశముంది.