• Home »
  • BARC »
  • ఒలంపిక్స్ చూసిన ప్రేక్షకులు 20 కోట్లు: సింధు ఫైనల్ మాచ్ కే అత్యధిక ఆదరణ

ఒలంపిక్స్ చూసిన ప్రేక్షకులు 20 కోట్లు: సింధు ఫైనల్ మాచ్ కే అత్యధిక ఆదరణ

2016 రియో ఒలంపిక్స్ భారతదేశ ప్రేక్షకాదరణలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఉద్వేగభరితమైన బాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో  భారత క్రీడాకారిణి పివి సింధు తన ప్రత్యర్థి కెరోలినా మారిన్ మీద తలపడినప్పుడు భారతదేశపు టీవీ ప్రేక్షకులంతా టీవీలకు అతుక్కుపోయారు. ప్రతి ముగ్గురు టీవీ ప్రేక్షకులలో కనీసం ఇద్దరు ఆ కార్యక్రమం చూసినట్టు బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ అందజేసిన తాజా సమాచారం వెల్లడించింది.

మొత్తం 16 రోజులలోనూ స్టార్ సంపాదించుకున్న ప్రేక్షకాదరణ చాలా ఎక్కువగా ఉందని, ఈ మెగా ఈవెంట్ ను బుల్లితెరమీద అద్భుతంగా అందించగలిగామని స్టార్ ఇండియా చెప్పుకుంది. అదే సమయంలో స్టార్ ఇండియా వారి వెబ్ పోర్టల్ హాట్ స్టార్ కు కేవలం బాడ్మింటన్ ఫైనల్స్ లోన్ 50 లక్షలకు పైగా సందర్శకులు దొరికారు. ఆరు ప్రధాన మెట్రో నగరాలలో 70 శాతం మంది ధనవంతుల కుటుంబాలను చేరుకోగలిగినట్టు వెల్లడించింది.

2016 రియో ఒలంపిక్స్ కు భారతదేశానికి ప్రసార హక్కులను స్టార్ ఇండియా సొంతం చేసుకోగా, దాని డిజిటల్ భాగస్వామి హాట్ స్టార్ కూడా చెప్పుకోదగిన ఆదరణ పొందింది. కేవలం క్రికెట్ కే పరిమితం కాకుండా అనేక క్రీడాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న తమ లక్ష్యంలో భాగంగా ఒలంపిక్స్ ప్రసారం చేసి విజయం సాధించినట్టు స్టార్ చెప్పుకుంటోంది. హాట్ స్టార్ తో కలిసి భారత్ లో మొత్తం 3 వేల గంటల ఒలంపిక్ కవరేజ్ చేసినట్టు చెబుతోంది.