• Home »
  • Cable »
  • సిటీ కేబుల్, డిష్ టీవీ ఉమ్మడి వ్యాపారం

సిటీ కేబుల్, డిష్ టీవీ ఉమ్మడి వ్యాపారం

జీ గ్రూపుకు చెందిన డిటిహెచ్ సంస్థ డిష్ టీవీ, కేబుల్ ఎమ్మెస్వో సిటీ కేబుల్ ఇకమీదట కలిసి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాయి. రెండూ జీ గ్రూపు పంపిణీ సంస్థలే అయినప్పటికీ వేరు వేరు ప్లాట్ ఫామ్స్ మీద  సేవలందిస్తున్నాయి. రెండింటికీ కలిపి రెండు కోట్ల కనెక్షన్లున్నాయి. అయితే, ఉమ్మడిగా పనిచేయటం వలన పరస్పర బలాలు పెరిగి, బలహీనతలు తగ్గుతాయని అంచనావేసి ఈ ఉమ్మడి వ్యాపారం నిర్ణయానికొచ్చాయి.

డిటిహెచ్ రంగంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నప్పటికీ డిష్ టీవీకి కారేజ్ ఆదాయం అంతగా లేదు. అదే విధంగా బ్రాడ్ కాస్టర్లతో పే చానల్ చందాల మొత్తంలో సిటీ కేబుల్, డిష్ టీవీ వేరువేరుగా బేరమాడటం కూడా పెద్దగా లాభదాయకంగా లేదు. అందుకే ఇకమీదట కలిసి పనిచేయటానికి వీలుగా డిష్ టెవీ, సిటీ కేబుల్ కలిసి కామ్ నెట్ పేరుతో ఒక ఉమ్మడి వ్యాపార సంస్థను ఏర్పాటుచేసుకున్నాయి.

డిష్ టీవీలోనూ సిటీ కేబుల్ లోనూ ప్రసారం కావాలంటే చానల్ యజమానులు  ఉమ్మడిగా నిర్ణయించే ధరలకు ఒప్పుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో పే చానల్స్ తమ కంటెంట్ ను తక్కువ ధరకే ఇవ్వజూపాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రయోజనాలకోసమే రెండు సంస్థలూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. పైగా, డిజిటైజేషన్ జరుగుతున్న క్రమంలో రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ మీద ఒప్పందాల మీద సంతకాలయ్యే సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఇంతో కీలకమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.