• Home »
  • Cable »
  • మొదటి రెండు దశల నగరాల ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల్లో సిటీ కేబుల్ ముందడుగు

మొదటి రెండు దశల నగరాల ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల్లో సిటీ కేబుల్ ముందడుగు

ఎమ్మెస్వోలు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కి అందజేసిన సమాచారం ప్రకారం డిజిటైజేషన్ అమలు జరిగిన మొదటి రెండు దశల్లో ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలలో సిటీకేబుల్ ముందుంది. మొత్తం 19 నగరాలకు చెందిన 3,387 మంది కేబుల్ ఆపరేటర్లతో ఒప్పందాలమీద సంతకాలు చేసింది.  ఢిల్లీ, ముంబై, కోల్ కతా నగరాలలో అత్యధిక సంఖ్యలో ఒప్పందాలు చేసుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

అహమ్మదాబాద్ కు చెందిన జిటిపిఎల్ ఈ విషయంలో  రెండో పెద్ద ఎమ్మెస్వోగా నిలిచింది. మొత్తం 9 నగరాలలో 3,125 మంది కేబుల్ ఆపరేటర్లతో ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల మీద సంతకాలు చేసింది. ఈ సంస్థకు మొదటి దశలో ఎక్కువ కనెక్షన్లు లేకపోవటంతో రెండో దశ నగరాలలైన అహమ్మదాబాద్, సూరత్, వడోదర లో ఎక్కువ ఒప్పందాలు జరిగాయి.  సమీర్ మన్ చందా స్థాపించిన డెన్ నెట్ వర్క్స్ ది ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలలో మూడో స్థానం. మొత్తం 18 నగరాలకు చెందిన 3,010 మంది ఆపరేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలలో ఎక్కువభాగం ఢిల్లీ, కోల్ కతా, జోధ్ పూర్ నగరాలలోని ఆపరేటర్లతో జరిగాయి.

హిందుజా గ్రూప్ వారి ఇండస్ ఇండ్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఐ ఎం సి ఎల్) ప్రధానంగా నాగపూర్, ఢిల్లీ, ముంబై నగరాలలో 2,769 మందితో ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు కుదుర్చుకుంది. హాత్ వే సంస్థ10 నగరాలలో మొత్తం 1,462 మందితో ఒప్పందాలు చేసుకుంది. అందులో ప్రధానంగా కోల్ కతామ్ భోపాల్, ఇండోర్ నగరాలు ప్రధానంగా ఉన్నాయి.  ముంబయ్ లో కేవలం 112 మంది ఆపరేటర్లతో మాత్రమే ఒప్పందం చేసుకుంది.

వీలైనంత త్వరగా ఇంటర్ కనెక్ట్ ఒప్పందలు జరగాలని ట్రాయ్ అదే పనిగా గుర్తు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు తమ మధ్య విభేదాలను పక్కనబెట్టి ఒప్పందాలు కుదుర్చుకోవాలని, లేని పక్షంలో మొదటి రెండు దశల డిజిటైజేషన్ జరిగిన నగరాలలో సైతం చందాదారుల బిల్లింగ్ లో అసాధారణ జాప్యం ఇలాగే కొనసాగుతుందని హెచ్చరిస్తూ వస్తోంది. ఒప్పందాలు లేకుండా సిగ్నల్స్ తీసుకునే ఆపరేటర్లను గుర్తించబోమని, తమ నుంచి ఎలాంటి సహకారమూ ఉండబోదని ట్రాయ్ హెచ్చరించింది.