• Home »
  • Cable »
  • నెట్ వర్క్స్ కొనుగోళ్ళలో సిటీ కేబుల్: సగటు కనెక్షన్ ధర రూ.2,500?

నెట్ వర్క్స్ కొనుగోళ్ళలో సిటీ కేబుల్: సగటు కనెక్షన్ ధర రూ.2,500?

ఎదుగుదలబాటలో దూసుకుపోతున్న సిటీ కేబుల్ నెట్ వర్క్ పెద్ద ఎత్తున చందాదారుల కొనుగోలు మొదలుపెట్టింది. అనలాగ్ కనెక్షన్లను కొనుగోలు చేయటం ద్వారా డిజిటల్ నెట్ వర్క్స్ ను బలోపేతం చేసుకునే ప్రయత్నంలో చురుగ్గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఒక్కో కనెక్షన్ కు రూ. 2,500 వరకు ధర నిర్ణయిస్తోంది. మార్కెట్ ప్రమాణాలతో పోల్చినప్పుడు ఇది చాలా తక్కువధరేనని భావిస్తున్నారు.

ఇటీవలే ముంబై కి చెందిన స్కాడ్ 18 నెట్ వర్క్ లో 76%, వడోదరకు చెందిన సాయి స్టార్ డిజిటల్ మీడియాలో 51% కొనుగోలు చేయటం ద్వారా తన కనెక్షన్ల సంఖ్యను కోటీ 7 లక్షల నుంచి కోటీ 20 లక్షలకు పెంచుకుంది. అదే విధంగా సిటీ కేబుల్ నెట్ వర్క్ ఈ మధ్యనే హైదరాబాద్ కు చెందిన వెరైటీ ఎంటర్టైన్మెంట్ లో మొత్తం 100% వాటా, తిరుపతికి చెందిన కృష్ణ తేజ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో 51% వాటా. ఢిల్లీకి చెందిన బర్గాచ్ డిజిటల్ కమ్యూనికేషన్ నెట్ వర్క్ లో నూ 51% తీసుకుంది. ఈ ఐదు కొనుగోళ్ళకు కలిపి సిటీ కేబుల్ 65 కోట్ల 30 లక్షల రూపాయలు వెచ్చించింది

స్కాడ్ 18 నెట్ వర్క్, సాయి స్టార్ డిజిటల్ మీడియా లో కొనుగోళ్ళు  ముంబై, గుజరాత్ లలో సిటీ కేబుల్ విస్తరణకు వ్యూహాత్మకంగా ఈ రెండు కొనుగోళ్ళూ ఉపయోగపడతాయని భావిస్తున్నారు. పైగా బ్రాడ్ బాండ్ అవకాశాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని సిటీ కేబుల్ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చునని భావిస్తున్నారు. కేబుల్ లో బలంగా ఉంటే తప్ప బ్రాడ్ బాండ్ లో రాణించే అవకాశం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సిటీ కేబుల్ నెట్ వర్క్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, సీఈవో విడి వాధ్వా చెప్పారు.

ఇకముందుకూదా ఇదే విధంగా వీలైనన్ని నెట్ వర్క్స్ ను సొంతం చేసుకుంటామని సిటీకేబుల్ చెబుతోంది. వ్యూహాత్మకంగా లాభదాయకమనిపిస్తే నిధులు సమకూర్చుకోవటం సమస్యే కాదని కూడా వాధ్వా చెబుతున్నారు. నిజానికి ఇలాంటి కొనుగోళ్ళకోసం నిధులు సిద్ధంగా ఉంచుకోకపోయినప్పటికీ అదొక సమస్య కానే కాదంటున్నారు. బెంగళూరు లాంటి మార్కెట్లలో అవకాశాలు ఉన్నప్పటికీ లాభదాయకం అనిపించకపోవటం వల్లనే వదిలేశామని కూడా చెప్పారు.