• Home »
  • Cable »
  • బడా ఎమ్మెస్వోలకే లోకల్ కేబుల్ చానల్స్, ఫీడ్ తీసుకునే వాళ్ళకు మొండిచెయ్యి ?

బడా ఎమ్మెస్వోలకే లోకల్ కేబుల్ చానల్స్, ఫీడ్ తీసుకునే వాళ్ళకు మొండిచెయ్యి ?

కేబుల్ చందాదారుల ద్వారా వచ్చే ఆదాయానికి తోడు స్థానికంగా నడుపుకునే కేబుల్ చానల్స్ ద్వారా వచ్చే ఆదాయమే చిన్న ఎమ్మెస్వోలకు కొండంత అండ. కాస్త పలుకుబడి వచ్చినా అదొక్కటే అధారం. స్థానిక కార్యక్రమాలు, వార్తలు ప్రసారం చేసి పదిమందికి సాయపడాలన్నా ఆ కేబుల్ చానల్ ఒక్కటే ఆధారం.

కానీ డిజిటైజేషన్ తరువాత పరిస్థితి మారిపోతుందా?  ఫీడ్ పంపిస్తామనే పెద్ద ఎమ్మెస్వోలు స్థానిక కేబుల్ చానల్ ఇవ్వటం సాధ్యమా?  ఇప్పుడు ఎమ్మెస్వోలను పట్టి పీడిస్తున్న సమస్య ఇది. అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసే ఈ కీలకమైన అంశం మీద ఎవరూ నోరు మెదపటం లేదెందుకు ? చిన్న ఎమ్మెస్వో ఫీడ్ తీసుకున్నా, తన కంట్రోల్ రూమ్ దగ్గర రెండు చానల్స్ కలుపుకోవచ్చునని చెప్పటం మభ్యపెట్టటానికేనా?

డిజిటైజేషన్ హడావిడిలో సమాధానాలు లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. నిజానికి సమాధానాలు లేక కాదు. ఇబ్బందికరమైన ప్రశ్నలకు మొహం చాటేయటమే అందుకు కారణం.  బడా ఎమ్మెస్వోలు తమ డిజిటల్ హెడ్ ఎండ్ నుంచి ఫీడ్ ఇస్తామని చెబుతున్నారు. అందులో తప్పుపట్టటానికేమీ లేదు. బాండ్ విడ్త్ చార్జీలు కట్టుకుంటే ఫీడ్ అందుతుంది. ఎలాగూ కోట్లు ఖర్చుపెట్టి సొంత డిజిటల్ హెడ్ ఎండ్ పెట్టుకోలేనప్పుడు నెలవారీ చార్జీలు సగటున 50 వేలకు పైగా అయినాసరే భరించేందుకు కొంతమంది చిన్న ఎమ్మెస్వోలు సిద్ధమవుతున్నారు.

కానీ అసలు సమస్య లోకల్ కేబుల్ చానల్స్ దగ్గర వస్తుంది. ఈ చానల్స్ లో కార్యక్రమాలన్నీ స్థానికంగా తయారయ్యేవే. డిజిటల్ హెడ్ ఎండ్ ఉన్న పెద్ద ఎమ్మెస్వో నుంచి ఫీడ్ తీసుకుంటే ఈ లోకల్ చానల్స్ మాటేంటి ? ఫీడ్ ఇచ్చేవాళ్ళు చెబుతున్నదొకటే.. మీ దగ్గరకు ఫీడ్ రాగానే మీ లోకల్ చానల్స్ కలుపుకోవటానికి అవకాశం ఉన్నదని. చాలామంది చిన్న ఎమ్మెస్వోలు ఇది నిజమేనని నమ్ముతున్నారు. కానీ అక్కడే ఉంది అసలు చిక్కు. డిజిటల్ హెడ్ ఎండ్ నుంచి పంపాల్సింది కేవలం ఎన్ క్రిప్ట్ చేసిన సిగ్నల్స్ మాత్రమే. ఎన్ క్రిప్ట్ చేయని లోకల్ కేబుల్ చానల్స్ జోడించటం డిజిటైజేషన్ నిబంధనలకు విరుద్ధం. కాబట్టి చిన్న ఎమ్మెస్వో సొంత కేబుల్ చానల్స్ ఇచ్చుకోవటం కుదరదు.

దీనికి ప్రత్యామ్నాయం లేదా? ఒకటే ప్రత్యామ్నాయం. ఫీడ్ తీసుకునే ప్రతి చిన్న ఎమ్మెస్వో తన చానల్స్ ను ఆ పెద్ద డిజిటల్ హెడ్ ఎండ్ కు పంపి, అక్కడ ఎన్ క్రిప్ట్ అయాక తిరిగి అది తన దగ్గరకు వచ్చేట్టు చేసుకోవటం. అంటే, అప్పటికే  ఫీడ్ తీసుకోవటానికి పెడుతున్న బాండ్ విడ్త్ చార్జీలకు ఇప్పుడు నెలనెలా రెట్టింపు ఖర్చవుతుందన్నమాట. రెండు ఖర్చులూ చిన్న ఎమ్మెస్వో మీదనే పడతాయి.

ఇక్కడ కూడా ఇంకో సమస్య ఏంటంటే, ఒక డిజిటల్ హెడ్ ఎండ్ నుంచి మొత్తం 18 కి మించి లోకల్ చానల్స్ ఇవ్వటానికి వీల్లేదు. అలాంటప్పుడు ఆ డిజిటల్ హెడ్ ఎండ్ యజమాని తన సొంతానికి ఎన్ని చానల్స్ ఉంచుకుంటాడు, తన నుంచి ఫీడ్ తీసుకునే వాళ్ళకు ఎన్ని చానల్స్ కేటాయిస్తాడు అన్నది. చాలా పెద్ద హెడ్ ఎండ్ అని చెప్పుకునేవారు కూడా ఒకటీ అరా మించి ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఇది చిన్న ఎమ్మెస్వోలు ఇప్పటిదాకా ఊహించని, లేదా డిజిటల్ హెడ్ ఎండ్ యజమాని చెప్పింది నిజమని నమ్మిన కీలకమైన అంశం.

నెక్స్ట్ డిజిటల్ లో సాధ్యమే : శ్రీకుమార్

ఈ సమస్యను ప్రస్తావించినప్పుడు  హిందుజా వారి హిట్స్ ప్లాట్ ఫామ్  ’ నెక్స్ట్ డిజిటల్ ’ తెలంగాణ, రాయసీమ హెడ్ గా ఉన్న శ్రీకుమార్ వివరణ ఇస్తూ , హిట్స్ లో ఆ సమస్య ఉత్పన్నం కాదన్నారు. హిట్స్ సొల్యూషన్ తీసుకున్నవారికి అలాంటి ఎన్ క్రిప్షన్ సమస్య ఉండదని, స్థానిక కేబుల్ చానల్స్ జోడించుకునే అవకాశం కల్పించటానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని స్పష్టం చేశారు. నిజానికి హిట్స్ లో ఉన్న ప్రత్యేకతలలో అది కూడా ఒకటని చెబుతూ ఈ పాటికే చాలామంది ఎమ్మెస్వోలు ఈ వాస్తవం గ్రహించి హిట్స్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. స్థానికంగా కేబుల్ చానల్ నడుపుకోవటమనేది అక్కడి ఎమెస్వో/ఆపరేటర్ కు చాలాకాలంగా ఒక ప్రత్యేకతను, గౌరవాన్ని సంపాదించిపెట్టిందని, హిట్స్ ద్వారా ఎమ్మెస్వోల వ్యాపార స్వతంత్రతను మాత్రమే కాకుండా వారి గౌరవాన్ని కూడా కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు.