• Home »
  • Entertainment »
  • ముందు మరాఠీ, ఆ తరువాతే తెలుగు: ప్రాంతీయ భాషల్లోకి సోనీ విస్తరణ

ముందు మరాఠీ, ఆ తరువాతే తెలుగు: ప్రాంతీయ భాషల్లోకి సోనీ విస్తరణ

పెద్ద ఎత్తున ప్రాంతీయ భాషల్లోకి విస్తరించాలనుకున్న సోనీ ప్రయత్నాలు మరాఠీ తో ప్రారంభమవుతున్నాయి. సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా సంస్థ చాలాకాలంగా ప్రాంతీయ భాషల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నప్పటికీ రకరకాల కారణాల వలన వెనుకబడుతూ వచ్చింది. ఒక విడత ఈటీవీతోను, మరోవిడత మా టీవీతోను చర్చలు జరిపి విఫలమైంది. ఆ తరువాత,  టీవీ18 సంస్థ 2012లో 2053 కోట్లకు ఈటీవీ గ్రూప్ చానల్స్ ను కొనుగోలు చేయగా, స్టార్ గ్రూప్ 2015 లో మా టీవీ చానల్స్ ను 2500 కోట్లకు  సొంతం చేసుకోవటం తెలిసిందే.

అప్పట్లో మల్టీ స్క్రీన్ మీడియా పేరుతో కొనసాగిన కాలంలో 2009 లో ఆథ్ టీవీని సొంతం చేసుకోగా దాన్ని ఇప్పుడు సోనీఆథ్ పేరుతో బెంగాలీ లో నడుపుతున్నారు. ఇదొక్కటే సోనీ ఆధ్వర్యంలోని ప్రాంతీయ భాషా చానల్. అయితే ఈ మధ్యనే తెలుగు, బంగ్లా, మరాఠీ, పంజాబీ భాషల్లో చానల్స్ పెట్టటానికి లైసెన్సులు తీసుకుంది. తెలుగులో ముందుగా ప్రారంభిస్తారనే వార్తలు వచ్చినప్పటికీ ఇపుడు మరాఠీ చానల్ ప్రకటన వెలువడింది. దీనికి అజయ్ భల్వంకర్ చీఫ్ క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తారని తెలుస్తోంది.

నిజానికి మరాఠీ జనరల్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో జీ గ్రూప్ తిరుగులేని ఆధిక్యం కనబరుస్తోంది. జీ మరాఠీ నెంబర్ వన్ స్థానంలో ఉండగా కలర్స్ మరాఠీ, స్టార్ ప్రవాహ్ ఆ తరువాత రెండు, మూడు రాంకుల్లో ఉన్నాయి. అయితే ఆ తరువాత రెండు స్థానాలూ జీ గ్రూపుకే చెందిన జీ టాకీస్, జీ యువ చానల్స్ దక్కించుకుంటున్నాయి. పైగా, జీ మరాఠీ సంపాదించుకునే రేటింగ్స్ దాని తరువాత ఉన్న రెండు చానల్స్ కలర్స్ మరాఠీ, స్టార్ ప్రవాహ్ కలిసి కూడా సంపాదించుకోలేకపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో సరైన  నెంబర్ టూ స్థానం ఖాళీగా ఉందన్నదే సోనీ అభిప్రాయం.