• Home »
  • Entertainment »
  • సోనీ ఆధ్వర్యంలో త్వరలో ’సబ్ తెలుగు’ టీవీ

సోనీ ఆధ్వర్యంలో త్వరలో ’సబ్ తెలుగు’ టీవీ

సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా త్వరలో తెలుగు సహా మొత్తం ఐదు ప్రాంతీయ భాషలలో చానల్స్ ప్రారంభించటానికి రంగం సిద్ధం చేసుకుంది. అయితే, సోనీ బ్రాండ్ తో కాకుండా సబ్ (ఎస్ ఎ బి )మ్  బ్రాండ్ తో ప్రారంభించబోతున్నట్టు ఇప్పుడు స్పష్టంగా తేలిపోయింది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు అదే విధంగా లైసెన్సులకోసం దాఖలు చేసుకొని ఇప్పుడు లైసెన్స్ పొందింది. సబ్ తెలుగు, సబ్ మరాఠీ, సబ్ తమిళ్, సబ్ బంగ్లా, సబ్ పంజీబీ  చానల్స్ కు లైసెన్స్ మంజూరైనట్టు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ధ్రువీకరించింది.

సోనీ చాలా కాలంగా ప్రాంతీయ మార్కెట్లలో ప్రవేశించటానికి ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదు. సోనీ ఆథ్ పేరుతో ఒకే ఒక బెంగాలీ చానల్ మాత్రమే సోనీ ఖాతాలో ఉన్న ప్రాంతీయ చానల్. గతంలో ఈటీవీ గ్రూప్ లోని చానల్స్ కొనటానికి ప్రయత్నించినా వీలుకాలేదు. మా టీవీ గ్రూప్ లో ఉన్న నాలుగు చానల్స్ విషయంలో చర్చలు పూర్తయి దాదాపుగా ఒప్పందం స్థాయి వరకు వచ్చినా ఆఖరి నిమిషంలో డీల్ ఫలించలేదు.

ఆ తరువాత కాలంలో ఈటీవీ ని టీవీ 18 గ్రూప్ తీసుకోవటం, ఆ గ్రూపును తిరిగి రిలయెన్స్ తీసుకోవటం, మా టీవీ నెట్ వర్క్ లోని నాలుగు చానల్స్ ను స్టార్ ఇండియా సొంతం చేసుకోవటం తెలిసిందే. మల్టీ స్క్రీన్ మీడియా ( ఎం ఎస్ ఎం ) గా పేరుపొందిన సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ఆధ్వర్యంలో మొత్తం 17 చానల్స్ ఉన్నాయి. వాటిలో ఇంగ్లిష్, హిందీ చానల్స్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, మ్యూజిక్, పిల్లల విభాగాలకు చెందినవి ఉన్నాయి.