• Home »
  • Data & Projections »
  • స్పోర్ట్స్ స్పాన్సర్ షిప్ ఏటా 5వేల కోట్లు: మొత్తం టీవీ ప్రకటనల ఆదాయంలో 10%

స్పోర్ట్స్ స్పాన్సర్ షిప్ ఏటా 5వేల కోట్లు: మొత్తం టీవీ ప్రకటనల ఆదాయంలో 10%

భారతదేశంలో స్పోర్ట్స్ స్పాన్సర్ షిప్ మార్కెట్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు స్పోర్ట్స్ అటే క్రికెట్ మాత్రమే అనుకునే పరిస్థితి ఉన్నా, ఇప్పుడు మారిపోయింది. 2015 లో స్పోర్ట్స్ స్పాన్సర్ షిప్ మార్కెట్ 12.3% పెరిగి రూ. 5,185 కోట్ల 40 లక్షలకు చేరింది. గ్రూప్ ఎమ్ ఇ ఎస్ పి, స్పోర్ట్జ్ పవర్ ఉమ్మడిగా రూపొందించిన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. మొత్తం ప్రకటనల ఆదాయంలో స్పోర్ట్స్ స్పాన్సర్ షిప్ వాటా 10.4% ఉండటం కూడా గమనార్హం.

ఇందులో బ్రాడ్ కాస్టింగ్ ఆదాయానిదే చెప్పుకోదగిన వాటా. స్పోర్ట్స్ ప్రత్యక్షప్రసారాల స్పాన్సర్ షిప్ విలువ 2015 లో 6.8% పెరిగి రూ. 2,690 కోట్లకు చేరింది. ఇదే ఏడాదిలో క్రికెట్ కాకుండా ఇతర క్రీడలు కూడా బాగా పెరిగాయి. 2008-15 మధ్య కాలంలో ప్రకటనల ఆదాయం 130% పెరిగింది. అత్యధికంగా పెరిగిన సంవత్సరానికొస్తే 2011 అనే చెప్పాలి. ఆ సంవత్సరం 50శాతం పెరిగింది. కానీ ఆ మరుసటి సంవత్సరం 25% పడిపోయింది. అయితే, 2011 లో ఐపిఎల్ 10 జట్లకు విస్తరించటం గమనించాల్సిన విషయం. 2013 లో క్రీడల ప్రత్యక్షప్రసారాల ఆదాయంలో పెద్దగా మార్పులేకపోగా 2014లో 12% పెరుగుదల నమోదైంది.

లీగ్ స్పోర్ట్స్ కు ప్రత్యక్షప్రసారాల వ్యవధి ఎక్కువ, విస్తృతంగా అందుబాటులోకి రావటంతోబాటు ప్రకటనల ఫలితాలు స్థిరంగా ఉంటాయి. అందుకే ప్రకటనలమీద పెట్టుబడులు కూడా ముందు ముందు బాగా పెరుగుతాయి. 2015 లో కేవలం 6.8% పెరగటానికి కారణం ఏషియా కప్ గాని, టి20 వరల్డ్ కప్ గాని లేకపోవటమే. పైగా భారత జట్టు ఆడిన మాచ్ లు కూడా తక్కువే. 2015 లో భారత్ 16 ఇంటర్నేషనల్ మాచ్ లు ఆడింది. చాంపియమ్స్ టి20 లీగ్ కారణంగా రూ.45 కోట్లకు గండిపడింది. దానికి బదులుగా వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ పూడ్చింది.  బ్రాడ్ కాస్టింగ్ ఆదాయానికి తోడు గ్రౌండ్ మీద స్పాన్సర్ షిప్, టికెట్ల అమ్మకం, టీమ్ స్పాన్సర్ షిప్, ఫ్రాంచైజ్ ఫీజు, ఎండార్స్ మెంట్లు కూడా చేరి మొత్తం ఆదాయంగా మారుతోంది.