• Home »
  • Cable »
  • ఎమ్మెస్వో హెడ్ ఎండ్ వివరాలమీద బ్రాడ్ కాస్టర్ పెత్తనం : స్టార్ కు టిడిశాట్ వత్తాసు

ఎమ్మెస్వో హెడ్ ఎండ్ వివరాలమీద బ్రాడ్ కాస్టర్ పెత్తనం : స్టార్ కు టిడిశాట్ వత్తాసు

ఒక ఎమ్మెస్వో పెట్టుకున్న డిజిటల్ హెడ్ ఎండ్ ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా, సాంకేతికంగా సమర్థవంతంగా ఉండాలని ట్రాయ్ చెబుతోంది. కట్టుదిట్టమైన వ్యవస్థ ఉన్నదీ, లేనిదీ సరి చూడటానికి బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ( బెసిల్ ) ఆడిట్ చేయవచ్చునని కూడా చెప్పింది. అయితే, ఎస్ ఎమ్ ఎస్ వ్యవస్థ గాని, ఇతర లెక్కింపు వ్యవహారాలమీదగాని బ్రాడ్ కాస్టర్ కు అనుమానాలుంటే తన ప్రతినిధిని పంపి హెడ్ ఎండ్ ను తనిఖీ చేయవచ్చునా? ఈ మధ్యనే టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ ( టిడిశాట్ ) ఇచ్చిన ఆదేశాలు అవుననే అంటున్నాయి.

రాజస్థాన్ ఇన్ఫోటెక్ మీడియా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి హెడ్ ఎండ్ సవ్యంగా లేదనొ, సరైన లెక్కలు చూపేలా అక్కడి కాస్, ఎస్ ఎమ్ ఎస్  వ్యవస్థలు లేవని  టిడిశాట్ కు స్టార్ ఇండియా ఫిర్యాదు చేసింది. దీంతో బెసిల్ ప్రతినిధులు వెళ్ళి తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా టిడిశాట్ ఆదేశాలిచ్చింది. అయితే, సాంకేతికంగా అంతా సజావుగానే సాగుతున్నదంటూ బెసిల్ తన నివేదిక సమర్పించింది.

అయితే, స్టార్ ఇండియా మాత్రం అప్పటికీ సంతృప్తి చెందలేదు.  వాణిజ్యపరమైన సమాచారంలో ఎంత నిజమున్నదో తనిఖీ చేయాల్సిందేనని పట్టుబట్టింది.  గత కొద్దినెలలుగా ఎస్ ఎమ్ ఎస్ తదితర సమాచారాన్ని పరిశీలించి విశ్లేషించుకోవటానికి స్టార్ కి అనుమతి ఇస్తూ టిడిశాట్ చైర్మన్ అఫ్తాబ్ ఆలం, సభ్యులు కుల్దీప్ సింగ్, బిబి శ్రీవాస్తవ ఆదేశాలిచ్చారు. తదుపరి విచారణ ఆగస్టు 19 కి వాయిదా పడింది.

బ్రాడ్ కాస్టర్లకు విస్తృతమైన అధికారాలిస్తూ ఎమ్మెస్వోల హెడ్ ఎండ్స్ ను తనిఖీ చేసే అవకాశం ఇవ్వటాన్ని ఎమ్మెస్వోలు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెసిల్ లాంటి సంస్థలచేత ఆడిట్ జరిపించటాన్ని ఎప్పుడూ తప్పు పట్టటం లేదని, అయితే ఒక బ్రాడ్ కాస్టర్ అనుమానం లేవనెత్తగానే తనిఖీ చేసే అవకాశం ఇవ్వటణ్ దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెస్వోలను అనుమానించి అవమానించటాన్ని టిడిశాట్ సమర్థించటం పట్ల ఎమ్మెస్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.