• Home »
  • Entertainment »
  • బాలాజీ టెలిఫిల్మ్స్ నుంచి వైదొలగిన స్టార్ : మార్కెట్లో 20% పెరిగిన వాటా ధర

బాలాజీ టెలిఫిల్మ్స్ నుంచి వైదొలగిన స్టార్ : మార్కెట్లో 20% పెరిగిన వాటా ధర

ఏక్తా కపూర్ కి చెందిన బాలాజీ టెలీఫిల్మ్స్ లో ఉన్న 26 శాతం వాటాను స్టార్ గ్రూప్ అమ్ముకుంది. 2004 లో వ్యూహాత్మకంగా బాలాజీ టెలీఫిమ్స్ లో వాటా  కొనుగోలు చేయటం ద్వారా ఈ సంస్థ నిర్మించిన అనేక సీరియల్స్ వాడుకుంటూ స్టార్ గ్రూప్ బాగానే లాభపడింది. ఇప్పుడు ఉన్నట్టుండి తన వాటాలు ఏకమొత్తంగా అమ్ముకుంది. అయితే,  బాలాజె టెలీఫిల్మ్స్ ప్రమోటర్లు శోభా కపూర్, ఏక్తాకపూర్ దాదాపు రూ. 18 కోట్లకు పైగా విలువచేసే వాటాలు కొనుక్కొని సంస్థలో తమ వాటాను 48శాతం దాకా పెంచుకున్నట్టు తెలుస్తుండగా మిగిలిన  వాటాలు ఎవరు కొన్నదీ ఇంకా వెల్లడి కాలేదు.

బాలాజీ టెలీఫిల్మ్స్  లో స్టార్ వాటాలు అమ్ముకున్న విషయం తెలిసిన వెంటనే బాలాజీ టెలీఫిల్మ్స్ వాటా ధర  బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ లో 20% పెరుగుదల నమోదు చేసుకోవటం విశేషం. ఈ సంస్థలో ఏక్తా కపూర్, ఆమె కుటుంబ సభ్యులైన శోభా కపూర్, జీతేంద్ర, తుషార్ కపూర్ కు 43 శాతం వాటాలున్నాయి.

స్టార్ తన వాటాలను రూ. 63.60 చొప్పున మొత్తం రూ. 107.80 కోట్లకు అమ్ముకుంది. అయితే, ఈ వార్త బయటికి పొక్కిన వెంటనే మార్కెట్లో వాటా ధర రూ.95.25 కు పెరిగింది. అంటే 19.96% పెరుగుదల నమోదు చేసుకుంది. పైగా ఇది గడిచిన 52 వారాలలో అత్యధిక ధర కావటం విశేషం.

2004 లో రూ. 123 కోట్లకు వాటాలు కొనుక్కున్న స్టార్ ఇండియా ఇప్పుడు రూ. 108 కోట్లకే అమ్ముకోవటం నష్టంలా పైకి కనిపించినా బాలాజీ టెలిఫిల్మ్స్ కార్యక్రమాలు,ప్రసారహక్కులతో పోల్చుకుంటే స్టార్ బాగానే లాభపడిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.