• Home »
  • Cable »
  • రాయదుర్గం గణేశ్ కమ్యూనికేషన్స్ సహా 100కు పైగా పైరసీ కేసులు: స్టార్

రాయదుర్గం గణేశ్ కమ్యూనికేషన్స్ సహా 100కు పైగా పైరసీ కేసులు: స్టార్

అక్రమంగా పే చానల్స్ సిగ్నల్స్ ప్రసారం చేస్తున్న కేబుల్ టీవీ ఆపరేటర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని స్టార్ ఇండియా నిర్ణయించుకుంది. అందులో భాగంగా స్టార్ టీవీ అధికారులు ఆంధ్రప్రదేశ్,  కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కీలక సమాచారం సేకరించి ఫిర్యాదులు చేయటం ద్వారా పోలీసుల చేత  దాడులు జరిపించారు. 100 కు పైగా ఎఫ్ ఐ ఆర్ లు నమోదయ్యాయి.  ఆయా కంట్రోల్ రూమ్స్ మీద జరిగిన పోలీసు దాడుల్లో పరికరాల స్వాధీనం, అరెస్టులు సాగాయి.

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రాయదుర్గ్ లో గణేశ్ కమ్యూనికేషన్స్ మీద, కర్నాటకలోని ఆర్ ఎస్ టి డిజిటల్ మీద, మధ్యప్రదేశ్ లోని తనిష్క్ కమ్యూనికేషన్ మీద ఈ తరహా దాడులు జరిగాయి. అక్రమ ప్రసారాలకు పాల్పడుతున్న ఈ నెట్ వర్క్ ల విషయంలో స్టార్  కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. గడిచిన 12 నెలల కాలంలో స్టార్ ఇండియా దేశవ్యాప్తంగా మొత్తం 100 కు పైగా ఇలాంటి కేసులు పెట్టింది.

పైరసీ కారణంగా బ్రాడ్ కాస్టర్లు వేలకోట్లు నష్టపోతున్నారని, ఒకవైపు కేబుల్ ఆపరేటర్లు తమ కనెక్షన్ల సంఖ్యను బాగా తగ్గించి చూపటం వల్ల కూడా భారీగా నష్టపోతుండగా ఇప్పుడు పైరసీ తోడైందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీనివలన బ్రాడ్ కాస్టర్లతోబాటు ప్రభుత్వ ఆదాయానికి కూడా పెద్ద ఎత్తున గండిపడుతుందని చెబుతున్నారు. ఈ పరిస్థితిని నివారించటానికి డిజిటైజేషన్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తుండగా ఈలోపు ఏ మాత్రం కనికరం చూపకూడదంటూ స్టార్ ఇండియా పెద్ద ఎత్తున పైరసీ నిరోధానికి సిద్ధమైంది.

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో స్థానిక కేబుల్ ఆపరేటర్ అయిన గణేశ్ కమ్యూనికేషన్ మీద స్టార్ అధికారులకు రహస్య సమాచారం అందటంతో నిఘా వేశారు. ఈ నెట్ వర్క్ పరిధిలో 10 వేలకు పైగా కనెక్షన్లున్నాయి. కర్నాటకలోని బళ్ళారికి అతి సమీపంలో ఉన్న ఈ పట్టణంలో తెలుగు, కన్నడ హిందీ చానల్స్ ప్రసారమవుతున్నాయి. డిటిహెచ్ ద్వారా అందుకున్న చానల్స్ ను పైరసీ చేసి కేబుల్ ద్వారా పంపుతూ పే చానల్స్ కు చందా కట్టే అవసరం లేకుండా రహస్యంగా నడుపుతున్నట్టు స్టార్ గ్రహించింది. ఆ నెట్ వర్క్ లో స్టార్ గ్రూప్ కి చెందిన స్టార్ ప్లస్, సువర్ణ, మా చానల్స్ తో బాటు సోనీ, జీ, జెమిని చానల్స్ కూడా ప్రసారమవుతున్నాయి. ఆ విధంగా 15 పే చానల్స్ ని పైరసీ చేసి నడుపుతున్నట్టు తేలింది.

దీంతో స్టార్ ఇండియా అధికారులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దాఖలు చేశారు. పోలీసులు ఐపిసి 420 కింద, కాపీరైట్ చట్టంలోని సెక్షన్లు 63, 69 కింద కేసు రిజిస్టర్ చేశారు. ఆ క్రమంలో ఆపరేటర్ ఆవరణమీద దాడి జరిగింది. ఈ సందర్భంగా పైరసీకి వాడుకుంటున్న సన్ డైరెక్ట్, వీడియోకాన్ డిటిహెచ్ పరికరాలు, యాంప్లిఫయర్లు, మాడ్యులేటర్లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, దాడికి వెళ్ళినప్పుడు కంట్రోల్ రూమ్ లోకి పోలీసులు రాకుండా ఆ ఆపరేటర్ తీవ్రంగా ప్రతిఘటించారు. తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకోవటంతో స్థానిక పోలీసు అధికారులు ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. అక్కడినుంచి అందుకున్న ఆదేశాలకు అనుగుణంగా బలవంతంగా లోపలికి ప్రవేశించి పరికరాలు స్వాధీనం చేసుకోవటంతోబాటు ఒక టెక్నీషియన్ ను అరెస్ట్ చేశారు.

ఈ నెట్ వర్క్ కొత్త యజమానులకు బాగా పలుకుబడి ఉన్నదని, ఎమ్మెస్వో సంఘాల ద్వారా దానికి బలమైన సంబంధాలున్నాయని స్టార్ అధికారులు పేర్కొన్నట్టు ఇండియా టెలివిజన్ డాట్ కామ్ వెల్లడించింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కొందరు మంత్రులకు కూడా ఈ యజమానులతో సత్సంబంధాలున్నాయని స్టార్ గ్రహించింది. అంతకు ముందు ఒకసారి సన్ నెట్ వర్క్ వారి యాంటీ పైరసీ బృందం గణేశ్ కమ్యూనికేషన్ మీద దాడి చేయటానికి ప్రయత్నించి దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే.

ఇక కర్నాటకలోని ఉడుపి జిల్లాకు చెందిన కర్కలా లో ఉన్న ఆర్ ఎస్ టి డిజిటల్ మీద కూడా స్టార్ నిఘా పెట్టింది. ఈ నెట్ వర్క్ పరిధిలో 2,500 కు పైగా కనెక్షన్లున్నాయి.  ఇది కూడా డిటిహెచ్ ద్వారా సిగ్నల్స్ పైరసీకి పాల్పడుతున్నట్టు తేలింది. స్టార్ ప్లస్, స్తార్ స్పోర్ట్స్ 1, లైఫ్ ఓకే, సువర్ణ, ఏషియానెట్ చానల్స్ తోబాటు జీ, కలర్స్ చానల్స్ కూడా అక్రమంగా ప్రసారం చేస్తున్నట్టు స్టార్ నిఘాలో తేలింది. కర్కలా ప్రాంతంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఆర్ ఎస్ టి డిజిటల్ మరే ఇతర నెట్ వర్క్ నూ అక్కడ కంట్రోల్ రూమ్ పెట్టనివ్వకుండా అడ్డుకుంటోంది. అధికార పక్షంలో దీని యాజమాన్యానికి సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతారు.

 

ప్రాథమికంగా సమాచారం సేకరించిన స్టార్ ఇండియా అధికారులు కర్కలా పోలీస్ స్టేషన్ లో మే 25న ఫిర్యాదు చేశారు.  ఐపిసి 379 తోబాటు కాపీరైట్ చట్టంలోని 37, 51, 63, 65, 68 సెక్షన్లకింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆపరేటర్ ఆవరణమీద దాడి జరిపారు. ఆ సమయంలో ఆపరేటర్ తీవ్రంగా ప్రతిఘటించటంతోబాటు తీవ్ర వాగ్యుద్ధానికి దిగాడు. అయితే, పోలీసులు బలవంతంగా లోపలికి వెళ్ళి సన్ డైరెక్ట్ కి చెందిన డిటిహెచ్ సెట్ టాప్ బాక్సులు, యాంప్లిఫయర్, మాడ్యులేటర్, స్టార్ బాక్సులు స్వాధీనం చేసుకున్నారు.ఆర్ ఎస్ టి డిజిటల్ యజమాని విజయ్ షెట్టిని అరెస్ట్ చేసి మే 25 నుంచి రిమాండ్ లో ఉంచారు. మొదటి విడత బెయిల్ దరఖాస్తును కోర్టు తోసిపుచ్చింది.

 

మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ జిల్లా ఇటార్సి పట్టణంలోని తనిష్క్ కమ్యూనికేషన్స్ మీద కూదా స్టార్ ఇండియా ఇదే తరహా  నిఘావేసి సమాచారం సేకరించింది. అక్రమంగా చానల్ పైరసీకి పాల్పడుతున్నట్టు గ్రహించింది. అందులో స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ ప్లస్, లైఫ్ ఓకే చానల్స్ ఉన్నాయి. ఎస్ వి ఎంటర్ ప్రైజెస్ కి చెందిన ప్రాంతంలోకి చొరబడి మరీ ఇలా పైరసీ చేసిన చానల్స్ ఇస్తున్నట్టు తెలియటంతో స్టార్ నిఘావేసి వివరాలు రాబట్టింది.  దాదాపు 15 వేలకు పైగా కనెక్షన్లున్న తనిష్క్ కమ్యూనికేషన్స్  యజమాని మహేశ్ చౌక్సే బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అధికారపార్టీకి దగ్గరివాడని స్టార్ నిర్థారించుకుంది.

 

పైరసీ గురించి స్థానిక పోలీసులకు గత ఆగస్టునుంచీ సమాచారం ఇస్తూ వచ్చిన  స్టార్ ఇండియా అధికారులుమే 25న అధికారికంగా ఫిర్యాదు చేయటంతో పోలీసులు కాపీరైట్ చట్టంలోని సెక్షన్లు 63.65 కింద కేసు నమోదు చేశారు. అదే సమయంలో స్టార్ ప్రతినిధులు ఎస్పీని, ఐజి ని, డిజిపి ని కలుసుకొని పరిస్థితి వివరించారు. దీంతో స్థానిక పోలీసులు ఆపరేటర్ ఆవరణమీద దాడి జరిపి నోడ్, టాన్స్ మిటర్, చానల్ మిక్సర్ తదితర పైరసీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక టెక్నీషియన్ ను అరెస్ట్ చేశారు.