• Home »
  • Cable »
  • స్టార్ – ఆర్వీయార్ వివాదానికి తెర: టిడిశాట్ ఆదేశాలతో సిగ్నల్స్ పునరుద్ధరణ

స్టార్ – ఆర్వీయార్ వివాదానికి తెర: టిడిశాట్ ఆదేశాలతో సిగ్నల్స్ పునరుద్ధరణ

టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్( టిడిశాట్) ఆదేశాలకు అనుగుణంగా స్టార్ ఇండియా సంస్థ హైదరాబాద్ కు చెందిన ఆర్ వి ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సిగ్నల్స్ పునరుద్ధరించింది. హైదరాబాద్ లో అతిపెద్ద స్వతంత్ర ఎమ్మెస్వో అయిన ఆర్ వి ఆర్ చౌదరి నిర్వహిస్తున్న నెట్ వర్క్ కు స్టార్ ఇండియా సిగ్నల్స్ నిలిపివేయటంతో ఆయన టిడిశాట్ ను ఆశ్రయించి సిగ్నల్స్ పునరుద్ధరించేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. దీంతో స్టార్ ప్రసారాలకు ఆటంకం తొలగిపోయింది.

ప్రసారాలు నిలిపివేయటం అక్రమమంటూ అగస్టు 24 న ఆర్ వి ఆర్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన టిడిశాట్ సభ్యుడు బిబి శ్రీవాస్తవ కనెక్షన్ పునరుద్ధరించాలని ఆదేశించారు. ఇరుపక్షాలూ కూర్చొని లెక్కలు తేల్చుకోవాలని సూచించారు. రూ.2 లక్షల 50 వేల వంతున రెండు చెక్కులు ఇప్పటికే స్టార్ ఇండియాకు అందించామని, అవి వారి దగ్గరే ఉన్నాయని ఆర్ వి ఆర్ తరఫు న్యాయవాది ట్రైబ్యునల్ కు తెలియజేశారు.

స్టార్ పంపిన డిస్ కనెక్షన్ నోటీసు ప్రకారం ఆర్ వి ఆర్ సంస్థ రూ. 8 లక్షల 51 వేల రూపాయలు బాకీ ఉంది. ఈ డిస్ కనెక్షన్ నోటీసు  వ్యవధి ఆగస్టు 12 తో పూర్తి కాగా 23 న సిగ్నల్స్ నిలిపివేశారు. అయితే, చెక్కులకు బదులు ఆర్ టి జి ఎస్ చేయాలన్న స్టార్ విజ్ఞప్తిని ఆర్ వి ఆర్ ఒప్పుకోవటంతో సిగ్నల్స్ పునరుద్ధరించారు.