ఈ తమిళ చానల్ పురుషులకోసం

ఎంటర్టైన్మెంట్ చానల్స్ అన్నీ మహిళా ప్రేక్షకులనే లక్ష్యంగా చేసుకుంటుండగా కార్యక్రమాలన్నీ పురుష ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రూపొందించి ఒక చానల్ అందించాలని స్టార్ యాజమాన్యం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా తమిళంలో విజయ్ సూపర్ పేరుతో ఒక చానల్ కు శ్రీకారం చుట్టింది. స్టార్ ఇండియకు ఇప్పటికే తమిళంలో స్టార్ విజయ్ పేరుతో ఒక చానల్ ఉండగా కొత్తగా ఇప్పుడు విజయ్ సూపర్ పేరుతో రెండో చానల్ మొదలైంది. దేశంలో మరే ఇతర చానల్ ప్రకటించుకోని విధంగా దీన్ని పురుషుల చానల్ గా చెప్పటం విశేషం.

అంతమాత్రాన విజయ్ సూపర్ లో సీరియల్స్ ఉండవని కాదు. కానీ ఆ  సీరియల్స్ కు మహిళలకంటే పురుషులే ఎక్కువ ఆకర్షితులవుతారని చెబుతున్నారు. నిజానికి తమిళనాట ఒక ప్రత్యేకత ఏమిటంటే 60 శాతం ఇళ్లలో రెండేసి టీవీలుంటాయి. గతంలో డిఎంకె ప్రభుత్వం ఉచితంగా కలర్ టీవీలిచ్చే పథకం పెట్టినప్పుడు చాలామందికి అందటంతో రెండేసి టీవీలుండే ఇళ్లు అక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అందువలన సాయంత్రం ప్రైమ్ టైమ్ లో ఆడవాళ్లు సీరియల్స్ కు అతుకుపోయి రిమోట్ ఇవ్వటం లేదని బాధపడే మగవాళ్ళు కూడా అక్కడ చాలా తక్కువగానే ఉంటారు.

స్టార్ గ్రూప్ తన స్పోర్ట్స్ ప్రసారాలు ప్రాంతీయ భాషల్లో అందజేయటానికి అందుబాటులో ఉన్న రెండో చానల్ వాడుకుంటూ ఉండగా తమిళంలో మాత్రం ఇప్పటివరకూ ఆ అవకాశం లేకపోయింది. అందుకే గతంలో జయా టీవీ ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇకమీదట విజయ్ సూపర్ ను వాడుకుంటారు. త్వరలో తమిళనాడు ప్రీమియర్ లీగ్ ను కూడా విజయ్ సూపర్ లోనే ప్రసారం చేయాలని స్టార్ యాజమాన్యం నిర్ణయించింది.

రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ లో ఎమ్మెస్వోలకు ఇచ్చే పే చానల్ ధర రూ. 5.25 గా నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం మాత్రం ప్రమోషనల్ ఆఫర్ గా వచ్చే జులై వరకూ ఉచితంగానే అందించబోతోంది. ఒకప్పుడు విజయ్ మాల్యా ప్రారంభించిన ఈ చానల్ ను ఆ తరువాత కాలంలో యు టీవీ కమ్యూనికేషన్స్ తరఫున రోనీ స్క్రూవాలా కొనుగోలు చేయగా, వారినుంచి స్టార్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ప్రస్తుతం తమిళ మార్కెట్ లో సన్ టీవీ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తుండగా రెండో స్థానం కూడా సన్ గ్రూప్ వారి కె టీవీకే దక్కుతోంది. జీ తమిళ్ మూడో రాంకులో ఉండగా స్టార్ విజయ్ ది నాలుగో స్థానం.

ఇప్పటివరకూ జాతీయ స్థాయి బ్రాడ్ కాస్టర్లు స్థానిక యాజమాన్యాల గుత్తాధిపత్యాన్ని దెబ్బతీయలేకపోయిన మార్కెట్ తమిళనాడు మాత్రమే కావటం విశేషం. మలయాళంలో ఏషియానెట్, కన్నడ లో కలర్స్ కన్నడ, తెలుగులో కొంతకాలం పాటు జీ తెలుగు ఆధిపత్యం ప్రదర్శించాయి. తమిళంలో సన్ టీవీ తిరుగులేని ఆధిపత్యం సాగించటమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా నెంబర్ వన్ గా నిలబడుతూ వస్తోంది.  ఈ పరిస్థితుల్లో విజయ్ సూపర్ టెస్ట్ సిగ్నల్ మొదలుపెట్టింది.