• Home »
  • MIB/Licencing »
  • త్వరలో స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్: లైసెన్స్ లాంఛనాలు పూర్తి

త్వరలో స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్: లైసెన్స్ లాంఛనాలు పూర్తి

స్టార్ ఇండియా ఆధ్వర్యంలో త్వరలో ఒక స్పోర్ట్స్ చానల్ తెలుగులో రాబోతున్నది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నుంచి ఇందుకోసం లైసెన్స్ కూడా తీసుకున్న స్టార్ ఈ దిశలో ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇప్పటికే స్టార్ ఆధ్వర్యంలో ఇంగ్లిష్, హిందీ లో మొత్తం నాలుగు హెచ్ డి ( హై డెఫినిషన్ ) చానల్స్, మరో  నాలుగు ఎస్ డి (స్టాండర్డ్ డెఫినిషన్) చానల్స్ కలిపి మొత్తం 8 స్పోర్ట్స్ చానల్స్ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ప్రాంతీయ భాషల్లో 10 స్పోర్ట్స్ చానల్స్ ప్రారంభించటం కోసం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖనుంచి లైసెన్సులు తీసుకోగా అందులో తెలుగు కూడా ఉంది.

స్పోర్ట్స్ చానల్స్ కు ఎక్కువ చందా ధరలు నిర్ణయించి పెద్దమొత్తాల్లో నెలసరి చందాలు వసూలు చేసుకోవటానికి అలవాటుపడ్డ స్టార్ గ్రూప్ తన బొకేలో స్పోర్ట్స్ చానల్స్ పెట్టుకోవటం ద్వారా మిగిలిన చానల్స్ కు భిన్నంగా ఉండాలని నిర్ణయించుకుంది. పైగా స్పోర్ట్స్ ప్రసార హక్కులను గరిష్ఠస్థాయిలో వాడుకోవాలన్నా ప్రాంతీయ చానల్స్ ఉండాలన్న అభిప్రాయానికొచ్చింది. ఇప్పుడు లైసెన్స్ తీసుకున్న చానల్స్ లో తెలుగుతో బాటు తమిళం, మలయాళం, మరాఠీ, బెంగాలీ చానల్స్ కూడా ఉన్నాయి. ఐదు భాషల్లో ఐదు ఎస్ డి చానల్స్, ఐదు హెచ్ డి చానల్స్  కోసం లైసెన్స్ తీసుకున్నారు.

క్రికెట్ వరల్డ్ కప్ 2015 సమయంలో స్టార్ స్పోర్ట్స్ తో బాటు ప్రాంతీయంగా స్టార్ ఆధ్వర్యంలోని చానల్స్ లో కూడా ప్రాంతీయ భాషల్లో కామెంటరీతో ప్రసారం చేసి ప్రేక్షకాదరణ పొందటం తెలిసిందే. ఇప్పటివరకు స్టార్ ఇండియా,  సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ఫీఫా వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్, ఐపిఎల్, ప్రొ కబడ్డీ లీగ్ , ఇండియన్ సూపర్ లీగ్  లో  అలాంటి ప్రయోగం చేసి విజయం సాధించాయి. కానీ ప్రాంతీయ భాషల్లో పూర్తిగా స్పోర్ట్స్ కోసమే ఒక చానల్ ప్రారంభించటం మాత్రం ఇదే మొదటిసారి.

ప్రసారహక్కులు ఎలాగూ కొనుగోలు చేస్తుండటం వలన అదనపు ఖర్చులేకుండా ప్రాంతీయ భాషల్లో చానల్స్ ప్రారంభించటం స్టార్ లాంటి గ్రూపుకు బాగా కలసి వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కొద్దిపాటి అదనపు ఖర్చుతో ప్రాంతీయ చానల్స్ నడిపే అవకాశముంటుంది. అదే సమయంలో ప్రాంతీయంగా అనేక స్థానిక క్రీడలకు టీవీలో ప్రసారమయ్యే అవకాశం ఏర్పడుతుందని, దేశీయ క్రీడలకు ప్రాధాన్యం పెరుగుతుందని విశ్లేషిస్తున్నవారున్నారు.