• Home »
  • Cable/DTH/HITS »
  • రాష్ట్రప్రభుత్వాలకు చానల్స్ పెట్టే హక్కు లేదు: కేంద్రం

రాష్ట్రప్రభుత్వాలకు చానల్స్ పెట్టే హక్కు లేదు: కేంద్రం

రాష్ట్రప్రభుత్వాలు శాటిలైట్ చానల్స్ నడపటానికి వీల్లేదని, ఏ రాష్ట్రానికీ అనుమతి ఇవ్వలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఏ రాష్ట్రప్రభుత్వాన్నైనా శాటిలైట్ చానల్ నడుపుకునేందుకు అనుమతించారా, ఏవైనా దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయా అనే ప్రశ్నకు సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పార్లమెంట్ లో సమాధానమిచ్చారు. గతంలో పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు దరఖాస్తు చేసుకోగా తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు.

అయితే, ఈ మధ్యనే కర్నాటక,మహారాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి సమాచార, పౌరసంబంధాల శాఖల ఆధ్వర్యంలో చానల్స్ నడపాలని ఆలోచిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. డిడి రాజ్య సభ, డిడి లోక్ సభ తరహాలో విధాన్ సభ, విధాన పరిషత్ కార్యకలాపాలను ప్రసారం చేయటానికి చానల్స్ ప్రారంభిస్తున్నట్టు ప్రలటించటమే కాకుండా బడ్జెట్ కేటాయింపులు కూడా చేశాయి. ఈ నేపథ్యంలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానమివ్వటంతో రాష్ట్రప్రభుత్వాల ప్రతిపాదనలను నీరుగార్చినట్టయింది.

నిజానికి ఇదే విషయంలో తమిళనాడు ప్రభుత్వం డిజిటల్ ఎమ్మెస్వోగా రిజిస్ట్రేషన్ కోసం దాఖలు చేసుకున్న దరఖాస్తు కూడా పెండింగ్ లో ఉండిపోయింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించలేదు. అయితే, కె యు బాండ్ లో డిటిహెచ్ తరహాలో విద్యాత్మక కార్యక్రమాలు ప్రసారం చేసుకోవటానికి మాత్రం ప్రసారభారతి ద్వారా అనుమతులు మంజూరవుతున్నాయి. ఇటీవలే గుజరాత్ అదే పద్ధతిలో చానల్స్ ప్రసారానికి రంగం సిద్ధం చేసుకుంది.