• Home »
  • Legal Issues »
  • టీవీ చానల్స్ పెట్టేందుకు రాష్ట్రాల ఆసక్తి : ససేమిరా అంటున్న కేంద్రప్రభుత్వం

టీవీ చానల్స్ పెట్టేందుకు రాష్ట్రాల ఆసక్తి : ససేమిరా అంటున్న కేంద్రప్రభుత్వం

గతంలో హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు టీవీ చానల్స్ పెట్టటం కోసం లైసెన్స్ కు దరఖాస్తు చేసుకొని భంగపడగా ఇప్పుడు తాజాగా మరో మూడు రాష్ట్రాలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లోక్ సభలో  వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు టీవీ వ్యాపారంలో అవకాశం ఇవ్వకూడదన్నది ఇప్పటివరకు ఉన్న విధానం కాగా,  నిబంధనలో సడలింపు మీద ఎలాంటి హామీ ఇవ్వకపోయినా ప్రభుత్వం నిబంధనలు మార్చుకునే అవకాశం లేకపోలేదని  సూచనప్రాయంగా చెప్పారు.

గతంలో రెండు రాష్ట్రాల దరఖాస్తులు నిరాకరించిన విషయాన్ని, డిజిటల్ ఎమ్మెస్వోగా తమిళనాడు ప్రభుత్వ సంస్థ అరసు కేబుల్ పెట్టుకున్న దరఖాస్తును పెండింగ్ లో పెట్టిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు అదే విధంగా గుజరాత్, కర్నాటక, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు దరఖాస్తు చేసుకున్నాయన్నారు. అయితే, వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదీ మాత్రం వెల్లడించలేరు. నిబంధనలనేవి కాలానుగుణంగా మారుతుంటాయనే అభిప్రాయం వెల్లడించటం ద్వారా ప్రభుత్వం తన విధానంలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందని పరోక్షంగా చెప్పినట్టయింది.

2008 నవంబర్ 12 న టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్ ) చేసిన సిఫార్సుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు రాజకీయ పార్టీలకు, మత సంస్థలకు చానల్స్ పెట్టుకునేందుకు, పంపిణీ చేసేందుకు అనుమతులు ఇవ్వకూడదు. రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలకు అక్కడి డిడి ప్రాంతీయ చానల్స్ ద్వారా ప్రాచుర్యం కల్పించుకోవచ్చునని వివరణ ఇచ్చింది. 2012 డిసెంబర్ 20 న కూడా ట్రాయ్ అదేవిధమైన సిఫార్సులు చేసింది.

అయితే, తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే కేబుల్ టీవీ పంపిణీ కొనసాగిస్తూ ఉండటం, ఆ తరువాత కాలంలో కర్నాటక ప్రభుత్వం కూడా ఆదే పద్ధతిలో కేబుల్ చానల్ ద్వారా పంపిణీ చేపట్టాలనుకోవటం తెలిసిందే. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ లోక్ సభ టీవీ, రాజ్యసభ టీవీ తరహాలో విశ్లేషణాత్మకమైన చానల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. పంజాబ్ ప్రభుత్వం విద్యాత్మక విషయాలకు ప్రాధాన్యమిస్తూ విద్య పేరుతో చానల్ ప్రారంభించటానికి సిద్ధమవుతోంది. ఇది ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.