• Home »
  • Cable »
  • ఆంధ్ర, తెలంగాణ కేబుల్ డిజిటైజేషన్ స్టే మీద విచారణ వచ్చే 5 కు వాయిదా

ఆంధ్ర, తెలంగాణ కేబుల్ డిజిటైజేషన్ స్టే మీద విచారణ వచ్చే 5 కు వాయిదా

మూడవ దశ కేబుల్ టీవీ డిజిటైజేషన్ గడువును సవాలు చేస్తూ అనలాగ్ సిగ్నల్స్ కొనసాగింపు కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెస్వోల సంఘాలు తెచ్చుకున్న స్టే మీద విచారణ అక్టోబర్ 5 వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసును హైదరాబాద్ లోని ఉమ్మడి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు బదలీ చేయటం, విచారణ బాధ్యతను ఢిల్లీ హైకోర్టుకు అప్పగించటం తెలిసిందే. ఈ రోజు విచారణ ప్రారంభించిన ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 5 కు వాయిదా వేసింది.

 

మూడో దశ ముగిసే ముందురోజు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ఉమ్మడి హైకోర్టులో ఎపి ఎమ్మెస్వోల సంక్షేమ సమాఖ్య తరఫున మోహన్, తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య తరఫున సుభాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లమీద స్టే రావటంతో మిగిలిన హైకోర్టులు కూదా అదే బాటలో నడిచాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ అంశం కలకలం రేపటంతోబాటు మొత్తం డిజిటైజేషన్ ప్రక్రియ స్తంభించి పోయింది. దీని ప్రభావం నాలుగోదశమీద కూడా పడటంతో వీలైనంత త్వరగా పరిష్కారం కావాలంటే అన్ని రాష్ట్రాల హైకోర్టులలో ఉన్న కేసులూ సుప్రీంకోర్టుకు బదలీ కావటమే మార్గమంటూ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి అనుమతి పొందింది.

 

సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వివిధ రాష్ట్రాలనుంచి పిటిషన్లు  బదలీ అయ్యాయి. వాటిలో రోహ్తక్ కేబుల్ ఆపరేతర్ల సంఘం, శ్రీదేవి డిజిటల్ సిస్టమ్స్,  సాయి బిగ్ స్టార్ వెల్ఫేర్ అసోసియేషన్, డెన్ మనోరంజన్ శాటిలైట్, విక్టరీ డిజిటల్, శ్రీ చౌడేశ్వరీ కేబుల్ నెట్ వర్క్, శ్యామ్ బాబా, కేబుల్ నెట్ వర్క్, పాంచజన్య మీడియా, భారత్ డిజిటక్ కేబుల్ నెట్ వర్క్, నాసిక్ జిల్లా కేబుల్ ఆపరేటర్ల సంఘం, భీమీ రిద్ధి డిజిటల్ సర్బీసెస్, యోగేశ్ కేబుల్ నెట్ వర్క్స్ ఉన్నాయి.

 

ఈ విషయాలన్నీ జస్టిస్ సంజీవ్ సచ్ దేవ ధర్మాసనం ముందుకు రాగా మిగిలిన పెండింగ్ కేసుల కారణంగా విచారణ సాగలేదు. దీంతో తదుపరి విచారణ అక్టోబర్ 5 కు వాయిదా పడింది. ఇలా ఉండగా డిజియానా సిస్టమ్స్, ఓమ్ సిస్టమ్స్ కు చెందిన రెండు కేసులు రేపు (సెప్టెంబర్ 8న) విచారణకు రాబోతున్నాయి. తనను కూడా ఈ కేసులో చేర్చాలంటూ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ సభ్యులుగా ఉన్న ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ ఒక దరఖాస్తు దాఖలు చేసుకుంది. డిజిటైజేషన్ ఆలస్యం కావటం వలన తనకు రావాల్సిన ఆదాయం పూర్తిగా రావటం లేదన్నది వీళ్ళ అభ్యంతరం. అనలాగ్ కంటే డిజిటల్ లో ఎక్కువ చందాలు వసూలవుతాయి కాబట్టి ఈ కోణంలో వాదించే ప్రయత్నం చేస్తోంది.

 

డిజిటైజేషన్ అమలు వాయిదా కోరుతూ ఎమ్మెస్వోలు వివిధ కోర్టులలో మొత్తం 62 కేసులు నమోదు చేయగా 12 కేసులు ఆయా కోర్టులలోనే పరిష్కృతమయ్యాయి. మూడింటిని పిటిషనర్లే స్వయంగా ఉపసంహరించుకున్నారు. మిగిలిన కేసులలో ఇప్పటివరకు 29 కేసులు ఢిల్లీ హైకోర్టుకు బదలీ అయ్యాయి. 18 కేసులు ఇంకా బదలీ కావాల్సి ఉండగా ఇంకో రెండు కేసులు ఈ నెల 13 న విచారణకు వస్తాయి.