జీ మీడియా అధిపతి సుభాష్ చంద్ర రాజీనామా

జీ మీడియా అధిపతి సుభాష్ చంద్ర డైరెక్టర్, నాన్ ఎగ్జిక్యుటివ్ చైర్మన్ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ కి లేక రాశారు. మే 24 న జరిగిన బోర్డు సమావేశంలో ఈ రాజీనామా నిర్ణయం మీద తుది నిర్ణయం ప్రకటించినట్టు అధికారికంగా స్టాక్ ఎక్స్ఛేంజ్ కి తెలియజేశారు. ఆ రోజు నుంచి ఇది అమలులోకి వచ్చింది.

ఆయన స్థానంలో ఆ బాధ్యతలు నిర్వర్తించటానికి ఆర్.కె.అరోరా సీఈవోగా నియమితులయ్యారు. సంస్థ అదనపు డైరెక్టర్ గా కూడా పనిచేస్తారాయన. జీ గ్రూపులో జీ మీడియాకింద న్యూస్ చానల్స్, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజ్ లిమిటెడ్ కింద ఎంటర్టైన్మెంట్ చానల్స్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

జీ మీడియాలో ఉన్న న్యూస్ చానల్స్ లో జీ న్యూస్, జీ బిజినెస్, ఇండియా 24X7, జీ పంజాబ్ హర్యానా, హిమాచల్, జీ మధ్యప్రదేశ్ చత్తీస్ గఢ్, జీ 24 తాస్, 24 గంట, జీ కళింగ న్యూస్ , జీ పూర్వయా, జీ రాజస్థాన్ న్యూస్ ఉన్నాయి. గతంలో తెలుగులో నడిచిన జీ 24 గంటలు మూతబడిన తరువాత దానిని జీ కళింగ్ న్యూస్ గా మార్చారు.