• Home »
  • Cable »
  • సెట్ టాప్ బాక్సుల పంపిణీలో నిర్లక్ష్యం: అరసు కు చందాదారులు దూరం ?

సెట్ టాప్ బాక్సుల పంపిణీలో నిర్లక్ష్యం: అరసు కు చందాదారులు దూరం ?

సెట్ టాప్ బాక్సుల పంపిణీలో తమిళనాడు ప్రభుత్వ కేబుల్ టీవీ సంస్థ అరసు కేబుల్ అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి కారణంగా చందాదారులు క్రమంగా దూరమవుతున్నారు. తిరుచిరాపల్లి నగరంలో దాదాపు 90 శాతం ఇళ్ళ చందాదారులు ఇప్పటిదాకా అరసు కేబుల్ టీవీ కార్పొరేషన్ కిందనే ఉన్నప్పటికీ పరిస్థితిలో మార్పు కనబడుతోంది. ఒక్క తిరుచిరాపల్లి జిల్లాలోనే 15 లక్షల కేబుల్ కనెక్షన్లుండగా తిరుచ్చి నగరంలోనే 7 లక్షలున్నాయి. అందులో ఒకే ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లున్నవారు కూడా ఉన్నారు.

కేబుల్ టీవీ డిజిటైజేషన్ సక్రమంగా పూర్తి చేసే లక్ష్యంతో కేబుల్ టీవీ ఆపరేటర్ల ద్వారా డిజిటల్ సెట్ టాప్ బాక్సులు పంచే కార్యక్రమానికి అక్కడి కార్పొరేషన్ అక్టోబర్ లో శ్రీకారం చుట్టింది. ఇదంతా అరసు కంట్రోల్ రూమ్ నుంచి ఫీడ్ అందుకునే ఆపరేటర్ల ద్వారా జరుగుతూ వచ్చింది. అయితే, జిల్లా మొత్తం మీద కేవలం 65 వేల బాక్సులు మాత్రమే పంపిణీ జరిగింది.

ఒకవైపు అరసు కేబుల్ తరఫున కనెక్షన్ కు రూ.70 మాత్రమే వసూలు చేస్తుండటంతో దాన్ని అడ్దుకోగలిగే సాహసానికి ప్రైవేట్ ఆపరేటర్లు దిగలేకపోయారు. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత హయాంలో తీసుకున్న నిర్ణయం ఫలితమిది. నిజానికి ఆమె ఎన్నిక సమయంలో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా జరిగినదిది.  జయలలిత భారీ మెజారిటీతో తిరిగి అధికారపీఠం దక్కించుకున్నారు. అయితే, ఇప్పుడు నెలకొన్న పరిస్థితులకారణంగా ప్రైవేట్ ఎమ్మెస్వోలుపెద్ద ఎత్తున సెట్ టాప్ బాక్సులతో రంగ ప్రవేశానికి సిద్ధమయ్యారు. ఆరేడు  సంవత్సరాలుగా కుదరని వాతావరణం ఇప్పుడు అనుకూలంగా ఉందని భావిస్తున్నారు.

తిరుచ్చిలో కేబుల్ ఆపరేటర్లు కూడా  ప్రైవేట్ ఆపరేటర్ల బాక్సులు పంచటానికి మొగ్గు చూపుతున్నారు. వాళ్ళంతా ఒక గ్రూపుగా తయారవటం కూడా విశేషం. పైగా, చందాదారుల దగ్గరినుంచి ఇన్ స్టలేషన్ ఫీజు పేరుతో రూ. 500 నుంచి 2,000 దాకా దొరికినంత లాక్కునే ప్రయత్నం చేయటం, ఈ మధ్య జరిగిన ట్రాయ్ సమావేశంలో ప్రస్తావనకు రావటం తెలిసిందే. చందాదారులు అభ్యంతరాలు తెలియజేసినా, ఆశించిన ఫలితం కనబడలేదు. ప్రైవేట్ ఎమ్మెస్వోలు వాళ్ళకు అండగా నిలబడటమే అందుకు కారణమని భావిస్తున్నారు.