• Home »
  • Cable »
  • మలయాళీ చానల్స్ ప్లేస్ మెంట్ వివాదం: టిడిశాట్ లో సన్ గ్రూప్ కు చుక్కెదురు

మలయాళీ చానల్స్ ప్లేస్ మెంట్ వివాదం: టిడిశాట్ లో సన్ గ్రూప్ కు చుక్కెదురు

ఏషియానెట్ వారి పంపిణీ సంస్థ సన్ గ్రూప్ కి చెందిన మూడు మలయాళీ చానల్స్ ను పాత క్రమంలోనే ఉంచాలని, ప్లేస్ మెంట్ లో మార్పులు ఒప్పుకోకూడదని సన్ గ్రూప్ చేసిన వాదనమీద స్టే ఇవ్వటానికి టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్ ( టిడిశాట్ ) నిరాకరించింది.  తాత్కాలికంగా ఊరటనిస్తూ ఏషియానెట్ తొలగించిన చానల్స్ ను అదేచోట పెట్టేలా మధ్యంతర ఆదేశాలివ్వాలన్న సన్ విజ్ఞప్తికి టిడిశాట్ ప్రతికూలంగా స్పందించింది.

సూర్య, కిరణ్, సూర్య మ్యూజిక్ చానల్స్ ఏ వర్గానికి చెందినవనే విషయం ఇంటర్ కనెక్ట్ ఒప్పందంలో పేర్కొనలేదన్న విషయాన్ని టిడిశాట్ ప్రస్తావించింది. అది మ్యూజిక్ చానల్ అనిగాని, జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్ అనిగాని స్పష్టంగా ఒప్పందంలో లేదు కాబట్టి ఫలానా చోట పెట్టాలని పట్టుబట్టటం కుదరదని టిడిశాట్ అభిప్రాయపడింది.

ఏషియానెట్ పంపిణీ సంస్థ గతంలో 107. 144, 146 స్థానాల్లో ఆ చానల్స్ ప్రసారం చేస్తూ ఉండేది. అయితే, కొద్ది రోజులపాటు హడావిడి జరిగాక వాటిని పూర్తిగా తీసేసింది. ఆ తరువాత వాటిని 648,64,668  స్థానాల్లో ప్రసారం చేయటం మొదలు పెట్టింది. కొన్ని సాంకేతిక కారణాల వలన మార్చాల్సి వచ్చిందని ఏషియానెట్ తరఫు న్యాయవాది వెల్లడించారు. అయితేమ్ ఎలాంటి ముందస్తు నోటీసులూ లేకుండానే ఏషియానెట్ మార్చిందంటూ సన్ గ్రూప్ టిడిశాట్ కు ఫిర్యాదు చేసింది.

ఒకప్పుడు మలయాళం పాకేజ్ 1 లో పెట్టిన చానల్స్ ను మలయాళం పాకేజ్ 2 కి మార్చటంలో అర్థమేంటని కూడా సన్ గ్రూప్ ప్రశ్నించింది. భాష ఆధారంగా గ్రూపింగ్ చేయాలా, వాటి ప్రసారాంశాల ఆధారంగానా అనేది ఎమ్మెస్వో నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందా అన్నది కూదా ఇక్కడ ప్రశ్నార్థకంగా తయారైంది. ఎంఎస్ వో నిర్ణయాధికారానికి ఒక ప్రాతిపదిక ఉండాల్సినమాట నిజమే అయినా, ఇంటర్ కనెక్ట్ ఒప్పందంలో చానల్స్ ను వర్గీకరించి, ఆవిషయాన్ని స్పష్టంగా ఇంటర్ కనెక్ట్ ఒప్పందంలో రాసుకొకపోవటం ప్రధానమైన సమస్యగా మారింది.

ఏషియానెట్ తన సమాధానాన్ని మూడు వారాల్లోగా పంపాలని టిడిశాట్ ఆదేశించింది. దానిమీద అభ్యంతరాలుంటే సమాధానం అందిన రెండు వారాల్లోగా చెప్పాలని సన్ గ్రూప్ ని ఆదేశిస్తూ  ఈ కేసు విచారణను మార్చి 17 కు వాయిదావేస్తున్నట్టు టిడిశాట్ ప్రకటించింది. ఈ లోపు మధ్యంతర ఉతర్వులద్వారా పాత పరిస్థితి పునరుద్ధరించటానికి టిడిశాట్ ఒప్పుకోకపోవటంతో సన్ గ్రూప్ కి నిరాశే ఎదురైంది