• Home »
  • Cable/DTH/HITS »
  • సన్ డైరెక్ట్ లో HMTV సహా 13 కొత్త చానల్స్

సన్ డైరెక్ట్ లో HMTV సహా 13 కొత్త చానల్స్

సన్ గ్రూప్ కి చెందిన డిటిహెచ్ ఆపరేటర్ సన్ డైరెక్ట్ ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు 13 స్టాండర్డ్ డెఫినిషన్ చానల్స్ ను చేర్చింది. దీంతో సన్ డైరెక్ట్ ప్రేక్షకులకు మొత్తం 219 చానల్స్ అందుబాటులోకి వచ్చినట్టయింది. అలా కొత్తగా చేరిన చానల్స్ లో సూపర్ టీవీ, ట్రావెల్ ఎక్స్ పీ, సోనీ పాల్, నాప్ టాల్ కన్నడ, నాప్ టాల్ మలయాళం, 9ఎక్స్ జల్వా, ఆరాధన టీవీ, నంబిక్కై టీవీ, సఫారి టీవీ, దిగ్విజయ్ 24X7న్యూస్, వానవిల్, హెచ్ ఎం టీవీ, పవర్ విజన్ ఉన్నాయి.

సన్ డైరెక్ట్ పరిధిలో మొత్తం కోటీ 20 లక్షల కనెక్షన్లున్నాయి.  ఇటీవలే హార్మోనిక్స్ సాఫ్ట్ వేర్ ఆధారిత హెచ్ ఇ వి సి మీడియా ప్రాసెసింగ్ సొల్యూషన్ ను అమర్చుకోవటం ద్వారా ఎక్కువ చానల్స్ అందించటానికి సిద్ధమైంది. హార్మోనిక్స్ ఎలక్ట్రా ఎక్స్ 2 ఎన్ కోడర్, ప్రో స్ట్రీమ్ మల్టిప్లెక్సర్ ఉండటం వలన నాలుగు ట్రాన్స్ పాండర్ల సాయంతో 80 వరకు హెచ్ డి చానల్స్ అదనంగా ఇచ్చే వెసులుబాటు కలిగింది. వీడియో నాణ్యత కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం 59 హెచ్ డి చానల్స్ అందిస్తున్న  సన్ డైరెక్ట్ ఇకముందు మరిన్ని హెచ్ డి చానల్స్ ఇవ్వబోతోంది.

2017 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రాబడి రూ. 1207 కోట్లు కాగా అందులో రూ. 32 కోట్లు లాభం వచ్చింది. అంతకుముందు సంవత్సరంలో రూ.1112 కోట్ల రాబడిలో రూ.35 కోట్ల నష్టం వచ్చింది. దీంతో గత ఏడాది రూ. 67 కోట్ల మేరకు పరిస్థితి మెరుగుపడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. సన్ డైరెక్ట్ లో కళానిధి మారన్ కు 18% వాటా ఉండగా ఆయన భార్య కావేరి కళానిధి వాటా 62%. మిగిలిన 20% వాటా మారిషస్ కి చెందిన సౌత్ ఏషియా ఎంటర్టైన్మెంట్ హోల్డింగ్స్ ది.