• Home »
  • MIB/Licencing »
  • ఎఫ్ ఎం వేలంలో అనుమతి నిరాకరణ: రేపు సుప్రీంకోర్టులో సన్ గ్రూప్ సవాలు

ఎఫ్ ఎం వేలంలో అనుమతి నిరాకరణ: రేపు సుప్రీంకోర్టులో సన్ గ్రూప్ సవాలు

మూడో దశ ఎఫ్ ఎం రేడియోలకోసం జరిపే వేలంలో పాల్గొనటానికి సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ అనుమతించకపోవడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని సన్ గ్రూప్ నిర్ణయించింది. అంతకు ముందు హోం మంత్రిత్వశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ నిరాకరించటంతో సమాచార, ప్రసారాల శాఖ ఈ అంశాన్ని ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ కి అప్పగించింది. ఈ అంశాన్ని పరిశీలించిన మీదట అనుమతి నిరాకరించాలనే నిర్ణయించటంతో సోమవారం నాడు (20న) సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకుంది.

సన్ గ్రూప్ కి తమిళనాడులో సూర్యన్ ఎఫ్ ఎం పేరిట, మిగిలిన నగరాలలో రెడ్ ఎఫ్ ఎం పేరిట మొత్తం 45 ఎఫ్ ఎం చానల్స్ ఉన్నాయి.ఇప్పుడు తాజాగా మూడో దశ ఎఫ్ ఎం వేలం జరుగుతుండగా సౌత్ ఏషియా ఎఫ్ ఎం లిమిటెడ్, కల్ రేడియో లిమిటెడ్, సన్ నెట్ వర్క్, డిజిటల్ రేడియో ముంబయ్ బ్రాడ్ కాస్టింగ్, డిజిటల్ రేడియో ఢిల్లీ బ్రాడ్ కాస్టింగ్ అనే ఐదు కంపెనీల పేర్లతో పాల్గొనాలని నిర్ణయించుకుంది. అయితే ఈ వేలంలో సెక్యూరిటీ క్లియరెన్స్ పేరుతో సన్ గ్రూప్ కి మాత్రమే అనుమతి నిరాకరించటం విశేషం.

గతంలో సన్ గ్రూప్ వారి డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ ను సైతం ప్రభుత్వం రద్దు చేయగా సన్ గ్రూప్ కు  స్టే లభించింది. ఈ మధ్యనే సన్ గ్రూప్ వారి 33 చానల్స్ లైసెన్స్ పునరుద్ధరణకు సైతం హోం శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవటంతో సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో సన్ గ్రూప్ న్యాయపోరాటం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ప్రభుత్వ చర్యను మీడియా పరిశ్రమ ప్రముఖులు ఖండించారు.