• Home »
  • MIB/Licencing »
  • జెమినీ సహా 33 సన్ నెట్ వర్క్ చానల్స్ మూతబడతాయా?

జెమినీ సహా 33 సన్ నెట్ వర్క్ చానల్స్ మూతబడతాయా?

SUN HOME MINISTRY

 దక్షిణభారతదేశంలో 33 టీవీ చానల్స్ నడపటంతో బాటు పత్రికలు, ఎఫ్   రేడియో, టీవీ పంపిణీ రంగాలకూ విస్తరించి భారీ మీడియా సామ్రాజ్యాన్ని  నెలకొల్పిన సన్ నెట్ వర్క్ కు ఇప్పుడు పెనుముప్పు ముంచుకొచ్చింది. టీవీ  చానల్స్ మూతబడే ప్రమాదం వచ్చింది. హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఉపసంహరించుకోవటం వల్ల సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఆ గ్రూపు లోని లైసెన్సులను రద్దు చేయవచ్చు. అదే జరిగితే మొత్తం 33 చానల్స్ మూతబడతాయి. అయితే, హోంశాఖ సిఫార్సులను తప్పనిసరిగా పాటించాలనా, పాటించకపోతే వచ్చే సమస్య ఏంటి, పాటించకపోతే వచ్చే ఇబ్బందేమిటి అనే విషయాలమీద న్యాయపరమైన సంకటం మొదలైంది, పైగా, సన్ గ్రూపుకు వర్తింపజేసే నిబంధన అన్ని చానల్స్ కూ వర్తింప జేస్తే కనీసం 17 సంస్థలకూ వర్తింపజేయాలని కళానిధి మారన్ రాసిన లేఖ కలకలం రేపింది. మరోవైపు అటార్నీ జనరల్ సలహా కూదా సన్ గ్రూప్ కి అనుకూలంగా ఉండటంతో ఇది హోం శాఖకూ, సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖకూ మధ్య వివాదంగా తయారైంది.

ఇప్పుడు లైసెన్సుల అవసరం ఏమొచ్చింది ?

శాటిలైట్ టీవీ చానల్స్ కు ప్రభుత్వమిచ్చే లైసెన్స్ పదేళ్లపాటు అమలులో ఉంటుంది. 22 ఏళ్లకిందట మొదలైన సన్ టీవీలో వరుసగా అనేక చానల్స్ చేరుతూ వచ్చాయి. ఎప్పటికప్పుడు కొత్త చానల్స్ కు లైసెన్సులు తీసుకుంటూ ఉండగా ఇప్పుడు ఒకేసారి 33 చానల్స్ ఎందుకు ఇబ్బందుల్లొ పడ్డాయని అనుమానం రావటం సహజం. కానీ అసలేం జరిగిందంటే, ఒక్కొక్క చానల్ కూ గడువు తేదీ చూసుకుంటూ లైసెన్స్ రెన్యూవల్ కి దరఖాస్తు చేసుకునే సమస్య రాకుండా ఒకేసారి అన్నిటికీ రెన్యూ చేయించుకుంటే మళ్ళీ పదేళ్ళ దాకా రెన్యువల్ చేయించాల్సిన అవసరమే ఉండదని సన్ నెట్ వర్క్ భావించింది. అందుకే మొత్తం చానల్స్ కు కలిపి లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తు చేసుకుంది.

అన్ని దరఖాస్తులనూ హోం శాఖ పరిశీలించి సెక్యూరిటె క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా లైసెన్స్ రావటానికి ఆరు నెలల సమయం పడితే అందులో మూడు నెలలు హోంశాఖ వారి ఎంక్వైరీకే పడుతుంది. ఇతీవలి కాలంలో హోంశాఖ పని వత్తిడి పెరగటం వలన దాదాపు ఆరునెలలు గడిచినా క్లియరెన్స్ రావటం లేదనే ఫిర్యాదులు అనేకం ఉన్నాయి. ఏది ఏమైనా, సన్ టీవీకి హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ నిరాకరించింది. ఈ దరఖాస్తును తోసిపుచ్చుతున్నట్టు సమాచార, ప్రసారాల శాఖ తెలియజేసినా అన్ని చానల్స్ కూ లైసెన్సులు రద్దయ్యే అవకాశం లేదు. నిజంగా గడువు పూర్తవుతున్న చానల్స్ మాత్రమే ఇబ్బందుల్లో పడతాయి.

హోంశాఖ అంత శక్తిమంతమా?

హోం శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ అంత కీలకమా అనే అనుమానం రావచ్చు. అవును. కీలకమే. టీవీ చానల్ లైసెన్స్ లో ఇది చాలా ముఖ్యమైన మెట్టు. ఇది పూర్తయితే దాదాపుగా లైసెన్స్ వచ్చినట్టే. ప్రధానంగా సంస్థ డైరెక్టర్లమీద క్రిమినల్ కేసులు ఉండకూడదు. అయితే, కొంతమంది మెజారిటీ వాటాలు తీసుకొని కూడా నామమాత్రపు వాటాదారులకు డైరెక్టర్ పదవులు కట్టబెట్టి హోంశాఖ విచారణనుంచి తప్పించుకుంటున్నారని తేలిన తరువాత నిబంధనలు మారాయి. పది శాతం మించి వాటాలున్నవాళ్లందరి వివరాలూ పరిశీలిస్తోంది. నేరచరిత్ర ఉన్న డైరెక్టర్లుగాని, పదిశాతం మించిన వాటాదారులు గాని ఉంటే సెక్యూరిటీ క్లియరెన్స్ రానట్టే. అదే సమయంలో ఆర్థికపరమైన నేరాలు ఏవైనా నమోదై ఉన్నా, అవి కూడా అవరోధమే.

ఫెరా ఉల్లంఘనలాంటి అభియోగాలను హోంశాఖ చాల తీవ్రంగా పరిగణిస్తుంది. హోంశాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ రాలేదంటే చానల్ లైసెన్స్ ఆగిపోయినట్టే. అదే విధంగా హోంశాఖ ఆమోదముద్ర వేసిందంటే దాదాపుగా లైసెన్స్ వచ్చినట్టే. ఆ విధంగా హోం శాఖ చాలా శక్తిమంతమైనదని ఒప్పుకొని తీరాల్సిందే. అంతెందుకు, లైసెన్స్ దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేవాళ్ళు కూడా ఏదో రకంగా రికమండేషన్ పెట్టించాలనుకున్నా హోంశాఖ విషయంలో మాత్రం అలాంటి సాహసం చేయరు. ఆ విధంగా హోం శాఖ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నది.

ఇంతకీ మారన్ మీద అభియోగాలేంటి ?

అయితే, సన్ నెట్ వర్క్ లైసెన్సుల రెన్యూవల్ దరఖాస్తు మీద హోం మంత్రిత్వశాఖ అభ్యంతరం ఎందుకు చెప్పిందన్నది అసలు ప్రశ్న. హోంశాఖ ఇలా సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవటానికి కారణం సన్ నెట్ వర్క్ యజమాని కళానిధి మారన్ మీద ఉన్న కేసులేనని తెలుస్తోంది. ఎయిర్ సెల్-మాక్సిస్ కేసు సిబిఐ దర్యాప్తులో ఉండగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వారు దర్యాప్తు చేస్తున్నమనీ లాండరింగ్ కేసు మరొకటి. సన్ టీవీ కార్యాలయం నుమ్చి అక్రమంగా నడిపిన టెలిఫోన్ ఎక్స్ ఛేంజ్ వ్యవహారంలో సిబిఐ దాఖలు చేసిన కేసు ఇంకొకటి. ఈ మూడు కేసుల కారణంగానే హోం శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ కు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

ఎయిర్ సెల్ – మాక్సిస్ కుంభకోణంలో కళానిధి మారన్ మీద, దయానిధి మారన్ మీద సిబిఐ అభియోగాలు మోపింది. ఆ దర్యాప్తులోభాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అందులో మనీ లాండరింగ్ కోణం చూసింది. గత ఏప్రిల్ లో మారన్ సోదరులకు చెందిన 742.58 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. టెలికామ్ మంత్రిగా దయానిధి మారన్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఒక సంస్థకు మేలుచేస్తూ పొందిన ప్రయోజనాన్ని సిబిఐ గుర్తించింది. అందువల్లనే దేశ ఆర్థిక భద్రతకు ముప్పు వాటిల్లవచ్చునంటూ హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతపెద్ద నెట్ వర్క్ మీద ఇలాంటి చర్య తీసుకోవటం సహజంగానే కలకలం రేపింది.

మారన్ లేఖ సారాంశమేంటి ?

వార్త వెలువడిన వెంటనే పరిశ్రమ అంతా దీన్ని గురించే చర్చించుకోవటం మొదలుపెట్టింది. అయితే సన్ టీవీ మాత్రం తమకు ఎలాంటి సమాచారమూలేదంటూ స్పందించలేదు. ఎట్తకేలకు సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ వారు హోంశాఖ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవటం మీద చర్చోపచర్చలు సాగిస్తున్న సమయంలో సన్ గ్రూప్ అధిపతి కళానిధి మారన్ హోం శాఖకు లేఖ రాశారు. కేవలం కేసు నమోదు కాగానే చర్య తీసుకోవాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. కేవలం నిందితులు అయినంత మాత్రాన హోం శాఖ దోషులుగా తేల్చటమేమిటన్నది ఆయన ప్రధాన ప్రశ్న. కానీ హోం శాఖ మాత్రం ఆ లేక మీద మౌనంగా ఉండిపోవాలని నిర్ణయించుకుంది. అవసరమైతే కోర్టుకు సమాధానం చెప్పుకోవచ్చునన్నది ఆ మంత్రిత్వశాఖ అభిప్రాయంగా కనబడుతోంది.

అయితే, మారన్ అంతటితో ఆగకుండా నేరుగా ప్రధానికి లేఖ రాశారు. తనలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలన్నిటిమీదా చర్యలెందుకు తీసుకోలేదంటూ సూటిగా ప్రశ్నించారు. అందులో 2జి కుంభకోణంలో ప్రమేయమున్నట్టు కేసు ఎదుర్కొంటున్న కలైంజ్ఞర్ టీవీ ప్రస్తావన ఉంది. అలాగే తెలుగునాట మా టీవీ, సాక్షి టీవీల ప్రస్తావన కూడా వచ్చింది. ఆ విధంగా చూస్తే మొత్తం 16 సంస్థలకు చెందిన 61 చానల్స్ మూతపడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటన్నిటినీ వదిలిపెట్టి సన్ టీవీ మీద చర్యలకు పూనుకోవటం రాజకీయంగా కక్ష సాధించేందుకేనన్నట్టు స్పష్టంగా కనబడుతోందని మారన్ తనలేఖలో ఆరోపించారు.

ఎంఐబి ఏమంటోంది ?

అటు హోంశాఖ మాట విని తీవ్రమైన చర్య తీసుకోవాలా, బేఖాతరు చేయాలా అనేది అర్థం కాక సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ తలపట్టుకు కూర్చుంది. ఒకేసారి 33 చానల్స్ లైసెన్స్ రద్దు చేయటమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అలా అని హోంశాఖ సిఫార్సును బుట్టదాఖలు చేయటానికీ వీల్లేదు. ఇంతకాలంగా చానల్ లైసెన్సులకు హోంశాఖ క్లియరెన్స్ నే ప్రామాణికంగా తీసుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యనే సన్ గ్రూప్ వారి ఎఫ్ ఎం లైసెన్సుల విషయంలోనూ హోం శాఖ ఇదే వైఖరి తీసుకోవటం, పునఃపరిశీలించాల్సిందిగా సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ కోరినా ససేమిరా అనటం గుర్తుంది. అందుకే ఎం ఇ బి ఇరకాటంలో పడింది.

ఈ విషయంలో ఎలా నడుచుకోవాలో సలహా కోసం అటార్నీ జనరల్ ను సంప్రదించినప్పుడు హోంశాఖ తిరస్కారంలో పసలేదని సమాధానం రావటం గమనార్హం. ఆ సలహా పాటించాలా, వద్దా అనేది ఎమ్ ఐ బి నిర్ణయమే అయినప్పటికీ అయోమయాన్ని మాత్రం ఆ సలహా మరింత పెంచింది. చివరికి ఇది సన్ టీవీ సమస్యగా కంటే రెండు శాఖలమధ్య అత్యంత ప్రతిష్ఠాకరమైన వ్యవహారంగా తయారైంది. మోడీ ప్రభుత్వంలో ఈ ఘట్టం పాలనాపరమైన లోపాలను బయటపెట్టినట్టవుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఎవరు వెనక్కు తగ్గుతారన్నదే ప్రశ్నగా మారింది.

హోంశాఖ తలొగ్గుతుందా?

హోం శాఖ మాత్రం తలొగ్గేలా కనబడలేదు. మారన్ లేఖ తరువాత కాస్త మెత్తబడినట్టే కనిపించినా, సన్ టీవీ కోర్టుకు వెళ్ళే పక్షంలో అక్కడే సమాధానం చెప్పుకొవచ్చుననే ధోరణి వ్యక్తం చేసింది. కొద్దికాలం కిందటే సన్ గ్రూపు వారి 40 రేడియో చానల్స్ విషయంలోనూ హోంశాఖ ఇదే విధంగా వ్యవహరించింది. సెక్యూరిటీ క్లియరెన్స్ నిరాకరించటంతో స్వయంగా అరుణ జైట్లీ ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాసినా ప్రయోజనం కనబడలేదు. సన్ నెట్ వర్క్ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అదే విధంగా ఎఫ్ ఎం రేడియో లైసెన్సుల విషయంలోనూ అదే పరిస్థితి ఎదురైంది.

చిత్రమేమిటంటే, సెక్యూరిటీ క్లియరెన్స్ ఎందుకు నిరాకరించిందో కారణాలు అడిగినప్పుడు హోంశాఖ ఇచ్చిన వివరణ ఏంటంటే సన్ గ్రూపుకు క్లియరెన్స్ ఇవ్వటం వలన దేశ ఆర్థిక భద్రతకు విఘాతం కలుగుతుందని. కార్యక్రమాల ప్రసారానికి అనుమతించటం వలన ఆర్థిక భద్రతకు విఘాతం కలుగుతుందో సరైన సమాధానం చెప్పలేకపోతోంది. ఒక సంస్థ ఆర్థిక నేరాలకు పాల్పడటానికి, అది దేశ ఆర్థిక భద్రతకు విఘాతం కలిగించటానికి సంబంధమేమిటో చెప్పాలని సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. మరేదైనా సంస్థకు ఈ కారణం వల్ల లైసెన్సులు నిరాకరించిన సందర్భాలున్నాయా అని కూడా ప్రశ్నించింది.

వాటాల మీద తీవ్ర ప్రభావం

హోం శాఖ్ అసెక్యూరిటీ క్లియరెన్స్ నిరాకరించిందన్న వార్త వెలువడిన వెంటనే సన్ టీవీ నెట్ వర్క్ వాటాల ధర ఒక్కసారిగా 23.73% పడిపోయి రూ. 278.90 దగ్గర ముగిసింది. గడిచిన నాలుగేళ్లలో సన్ టీవీ వాటా ఒకే ఒక్క రోజులో ఇంత దారుణంగా పడిపోవటం ఇదే మొదటిసారి. పైగా సన్ టీవీ నెట్ వర్క్ మార్కెట్ అంచనా విలువ కూడా రూ. 3,051 కోట్ల 98 లక్షల మేరకు తగ్గిపోయి రూ. 10,991 కోట్లకు దిగజారింది. ట్రేడింగ్ మొదలు కాగానే సన్ టీవీ వాటా ధర రూ. 320.75 దగ్గర మొదలైంది.

అయితే, మారన్ లేఖ, సమాచార, ప్రసారాలమంత్రిత్వశాఖ పునరాలోచన, అటార్నీజనరల్ సలహా సన్ టీవీకి అనుకూలంగా ఉండటం లాంటి కారణాలవలన సన్ టీవీ షేర్ ధర పుంజుకుంది. సన్ నెట్ వర్క్ చానల్స్ కు సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వవచ్చునని అటార్నీ జనరల్ హోంశాఖకు సూచించినట్టు వార్త వెలువడిన వెంటనే సన్ నెట్ వర్క్ వాటాల ధర 8 శాతం పెరిగింది. ఉదయం రూ. 309.25 ఉన్న షేర్ ధర సాయంత్రానికి రూ. 333.55 దగ్గర ముగిసింది. అంటే మొత్తంగా చూస్తే 278.90 నుంచి కోలుకుంటూ రూ. 333.55 దాకా పెరుగుతూ వచ్చింది.

మిగతా కేసులేమవుతాయి?

లైసెన్సుల వ్యవహారంలో ఇంకా ఇతర కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. సూర్యన్ ఎఫ్ ఎం, రెడ్ ఎఫ్ ఎం పేర్లతో ఉన్న ఎఫ్ ఎం చానల్స్ విషయంలోనూ కొత్త ఎఫ్ ఎం లకు హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీనివలన మూడోదశ ఎఫ్ ఎం వేలంలో పాల్గొనటం ప్రశ్నార్థకంగా తయారైంది. రేడియో విషయంలో నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవలసిందిగా సమాచారప్రసారాల శాఖామంత్రి అరుణ్ జైట్లీ లేక రాయగా, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తిరస్కరించారు.

అంతకుముందు డిజిటల్ ఎమ్మెస్వోగా కల్ కేబుల్స్ కి ఇచ్చిన తాత్కాలిక లైసెన్సును సైతం హోంశాఖ అడ్డుకుంది. కేసుల విచారణకూ, ఎమ్మెస్వో లైసెన్సుకూ ముడిపెట్టవద్దంటూ ఎం ఐ బి విజ్ఞప్తిచేసినా హోంశాఖ పట్టించుకోలేదు. చివరికి హోంశాఖ సూచనను గౌరవిస్తూ లైసెన్స్ రద్దుచేయగా ఆ విషయంలో కల్ కేబుల్స్ కోర్టుకెళ్ళింది. మద్రాస్ హైకోర్టు ఆ రద్దు ఆదేశాలను పక్కనబెట్టింది. ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉంది.

ఏమైనప్పటికీ, సన్ టీవీ వివాదం హోంశాఖలో పెద్ద దుమారమే లేపింది. కేసులుండటమే ప్రాతిపదిక అయ్యే పక్షంలో నిజంగానే 61 చానల్స్ లైసెన్సులూ రద్దు కావాల్సి ఉంటుంది. కోర్టులోనే ఈ వాదనే నిలబడే అవకాశముంది. కానీ హోంశాఖ మాత్రం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం వల సమస్య మరింత జటిలంగా తయారైంది. మరోవైపు సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఇరకాటంలో పడింది. అటు న్యాయపరమైన చిక్కులు రాకుండా, ఇటు హోంశాఖ సిఫార్సుకు గౌరవించే మార్గం కానరాక సతమతమవుతోంది. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని టీవీ పరిశ్రమ మాత్రం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.