• Home »
  • Legal Issues »
  • ఆస్తుల అటాచ్ మెంట్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకెక్కిన సన్ టీవీ

ఆస్తుల అటాచ్ మెంట్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకెక్కిన సన్ టీవీ

మనీ లాండరింగ్ చట్టం కింద సన్ టీవీ నెట్ వర్క్ కి చెందిన 742 కోట్ల 58 లక్షల రూపాయల విలువచేసే ఆస్తులను అటాచ్ చేస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తీసుకున్న నిర్ణయాన్ని సన్ టీవీ అధిపతి కళానిధి మారన్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే, చీఫ్ జస్టిస్ హెచ్ ఎల్ దత్తు ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ సమయంలో తగిన ఆదేశాలిస్తామని పేర్కొంది. ఈ కేసుకూ 2జి స్కామ్ కూ సంబంధం లేదని, దాని పరిధిలోకి చేర్చవద్దని సన్ టీవీ అభ్యంతరం తెలియజేసింది.

ఎయిర్ సెల్-మాక్సిస్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తమ ఆస్తుల అటాచ్ మెంట్ ని సవాలు చేస్తూ సన్ టీవీ, కల్ కమ్యూనికేషన్స్ పిటిషన్ దాఖలు చేయగా మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తున్నందున అక్కడే తేల్చుకోవాలంటూ జస్టిస్ సత్యనారాయణ సూచించటంతో సన్ టీవీ ఇప్పుడు సుప్రీంకోర్టుకెళ్ళింది.

పిటిషనర్ అయిన సన్ టీవీ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, పి ఎస్ రామన్ హాజరయ్యారు. సన్ టీవీ ఆస్తులు ఎయిర్ సెల్-మాక్సిస్ కేసుకంటే ముందే సంపాదించుకున్నవని, వాటిని అటాచ్ చేయటం తగదని వాదించారు. పైగా, ఈ కేసులో ఇతర నిందితుల ఆస్తులు ఎందుకు అటాచ్ చేయలేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఈ కేసును పర్యవేక్షిస్తున్నదని అదనపు సొలిసిటర్ జనరల్ జి. రాజగోపాలన్ వాదించారు.