• Home »
  • Legal Issues »
  • సన్ టీవీ ఆస్తుల జప్తు కేసు విచారణ 2జి స్కామ్ బెంచ్ కి అప్పగింత

సన్ టీవీ ఆస్తుల జప్తు కేసు విచారణ 2జి స్కామ్ బెంచ్ కి అప్పగింత

సన్ టీవీ ఆస్తుల జప్తును సవాలు చేస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మీద సన్ టీవీ దాఖలు చేసుకున్న పిటిషన్ ను 2జి స్కామ్ విచారించే బెంచ్ కే అప్పగించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. 2జి స్కామ్ దర్యాప్తులో భాగంగానే సన్ టీవీ ఆస్తులు జప్తు చేసినందున అదే బెంచ్ విచారించటం సమంజసమని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు నాయకత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది.

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సన్ టీవీకి చెందిన రూ.742.58 కోట్ల విలువచేసే ఆస్తులను జప్తు చేసిన విషయం తెలిసిందే. అయితే, 2జి స్కామ్ కు ఎలాంటి సంబంధమూ లేకుండా ఆస్తుల జప్తు జరిగిందని ఆరోపిస్తూ సన్ టీవీ మొదట మద్రాస్ హైకోర్టుకు వెళ్ళింది. ఎయిర్ సెల్ – మాక్సిస్ కేసుకూ 2జి కి ఎలాంటి సంబంధమూ లేదని వాదించినా ఫలితం కనబడలేదు. అక్కడ కేసు కొట్టివేయటంతో సన్ గ్రూప్ అధిపతి కళానిధి మారన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసులో అభియోగాలు ఎదుర్కుంటున్న కారణంగానే సన్ గ్రూప్ కు అనేక ఇబ్బందులు మొదలయ్యాయి. కల్ కేబుల్స్ కు తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చిన డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ రద్దుకు హోం మంత్రిత్వశాఖ సిఫార్సు చేసింది. ఎఫ్ ఎమ్ రేడియో లైసెన్సుల విషయంలోనూ అదే జరిగింది. అంతకంటే ముఖ్యంగా తాజాగా 33 సన్ గ్రూప్ లైసెన్సుల రెన్యూవల్ వ్యవహారం కూడా ఇబ్బందుల్లో పడింది.  సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ పదే పదే కోరినా హోం శాఖ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.