• Home »
  • Entertainment »
  • ’సన్’ యజమానులు మారన్ దంపతుల ఏడాది జీతం, డివిడెండ్ రూ.600 కోట్లు

’సన్’ యజమానులు మారన్ దంపతుల ఏడాది జీతం, డివిడెండ్ రూ.600 కోట్లు

సన్ టీవీ వ్యవస్థాపకుడైన ళానిధి మారన్, ఆయన భార్య కావేరి కళానిధి ఒక్కొక్కరి ఏడాది జీతం రూ, 71 కోట్ల 47 లక్షలు. అంటే ఇద్దరికీ కలిపి 2015-16 ఆర్థిక సంవత్సరానికి జీతం రూపంలో రూ.142 కోట్ల 94 లక్షల రూపాయలు అందింది. ఆ విధంగా దేశంలోనే అత్యధిక జీతం అందుకుంటున్న కార్పొరేట్ ఎగ్జిక్యుటివ్ లుగా స్థానం సంపాదించుకున్నారు.

జీతం అంతకు ముందు సంవత్సరం ఉన్నదే కొనసాగినా బోనస్ 21% పెరగటంతో మొత్తంగా 17% పెరుగుదల నమోదైంది. కళానిధి మారన్ ఎగ్జిక్యుటివ్ చైర్మన్ గాను, ఆయన భార్య కావేరి కళానిధి ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ గాను ఈ జీతభత్యాలు సంపాదించుకున్నారు. 2015-16 సంవత్సరపు వార్షిక నివేదిక ఈ విషయం వెల్లడించింది.

సంస్థలో ఉన్న తన వాటాలకు గాను  కళానిధి మారన్ కు వచ్చిన డివిడెండ్ ఇంకా ఎక్కువ. 2015-16 ఆర్థిక సంవత్సరానికి అది  రూ.458 కోట్ల 12 లక్షలకు చేరుకుంది.  సన్ టీవీ మీద ఇద్దరికీ కలిపి వస్తున్న ఆదాయం 601  కోట్ల 6 లక్షలు. ఇతర వ్యాపారాలలో పెట్టుబడులమీద వారి ఆదాయం దీనికి అదనం.

గడిచిన ఆర్థిక సంవత్సరంలో సన్ టీవీ మొత్తం ఆదాయం రూ. 2,493 కోట్ల 30 లక్షలు. అది అంతకుముందు ఏడాది కంటే 6.94% ఎక్కువ. నికరలాభం రూ. 737.23 కోట్ల నుంచి రూ, 867.25 కోట్లకు పెరిగింది. ఈ లాభంలో 53% వాటా సన్ గ్రూప్ వ్యవస్థాపకుడైన కళానిధి మారన్ కే డివిడెండ్ రూపంలో అందింది.