• Home »
  • Entertainment »
  • రేటింగ్స్ తగ్గిన ప్రైమ్ టైమ్ సీరియల్ ’కులదైవమ్’ మీద సన్ టీవీ వేటు

రేటింగ్స్ తగ్గిన ప్రైమ్ టైమ్ సీరియల్ ’కులదైవమ్’ మీద సన్ టీవీ వేటు

సన్ టీవీలో సోమవారం నుంచి శనివారం దాకా రాత్రి 7.30 కి ప్రసారమయ్యే కులదైవమ్ సీరియల్ ను అర్థాంతరంగా ఆపేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ మధ్యనే 100 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న ఈ సీరియల్ మరో పాతిక ఎపిసోడ్స్ కంటే ప్రసారం కాకపోవచ్చునని, పరిస్థితినిబట్టి మధ్యాహ్నానికి మార్చవచ్చునని అంటున్నారు. దీని స్థానంలో మరో సీరియల్ ప్రసారమవుతుందని నేరుగా చెప్పాకుండానే అదే డైరెక్టర్ అదే సమయంలో ప్రసారం కాబోయే సీరియల్ కి నటీనటుల ఎంపిక ప్రారంభించటంతో ఈ విషయం వెల్లడైంది.

సన్ టీవీ వర్గాలు ఈ విషయాన్ని పరోక్షంగా ధృవీకరించాయి. అంతకుముందు ఇదే స్లాట్ లో ప్రసారమైన నాదస్వరం సూపర్ హిట్ సీరియల్ గా ఐదేళ్ళకు పైగా ప్రేక్షకులను అలరించింది. 14 రేటింగ్ పాయింట్లు సాధించి పెడుతూ వచ్చింది. 1356 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న నాదస్వరం స్థానంలో అందుకు దీటుగా ఉండే సీరియల్ ప్రసారం చేయాలని సన్ టీవీ భావించింది. అందుకే ఒకప్పటి విజయవంతమైన సీరియల్ మెట్టి ఒలి (తెలుగులో మెట్టెల సవ్వడి) దర్శకుడు, నిర్మాత తిరుమురుగన్ కి అవకాశమిచ్చింది. అయితే రేటింగ్స్ 11 పాయింట్లు మించకపోవటంతో చానల్ తో బాటు డైరెక్టర్ కూడా అసంతృప్తితోనే ఉన్నారు.

దీంతో కులదైవమ్ స్థానంలో మరో కొత్త సీరియల్ ప్రసారం చేసే ఆలోచన వేగంగా అమలు చేస్తున్నారు. ముందే ప్రకటిస్తే ప్రేక్షకులు ఇప్పటినుంచే ఇతర చానల్స్ కు వెళ్ళిపోతే తిరిగి రాబట్టుకోవటం కష్టం కాబట్టి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నట్టు తెలిసింది. ఎప్పుడూ కనీసం సగం కొత్త ముఖాలు ఉండేట్టు చూసే తిరుమురుగన్ ఈ కొత్త ప్రాజెక్ట్ కు మాత్రం పాతవాళ్ళనే ఎంచుకుంటున్నారని కూడా చెబుతున్నారు.