• Home »
  • BARC »
  • రేటింగ్స్ లెక్కింపు నుంచి తప్పుకున్న టామ్: బార్క్ వ్యాపారంలో భాగస్వామ్యం

రేటింగ్స్ లెక్కింపు నుంచి తప్పుకున్న టామ్: బార్క్ వ్యాపారంలో భాగస్వామ్యం

టీవీ చానల్స్ ప్రేక్షకాదరణ లెక్కింపులో ఒకటిన్నర దశాబ్దాలపాటు గుత్తాధిపత్యం సాగిస్తూ వచ్చిన టామ్ ( టెలివిజన్ ఆడియెన్స్ మెజర్ మెంట్ ) ఇండియా  ఎట్టకేలకు తప్పుకుంటోంది. టీవీ పరిశ్రమలోని బ్రాడ్ కాస్టర్లు, అడ్వర్టయిజర్లు, యాడ్ ఏజెన్సీలు స్వయంగా ఏర్పాటు చేసుకున్న బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ )  ముందు మోకరిల్లక తప్పలేదు. తన మౌలిక సదుపాయాలన్నిటినీ బార్క్ కి అప్పగించి విశ్లేషణ్ బాధ్యతలనీ బార్క్ చేపట్టేలా ఒక ఉమ్మడి వ్యాపార ఒప్పందానికి టామ్ మొగ్గుచూపుతోంది.

పారదర్శకత లోపించటం మొదలుకొని తక్కువ శాంపిల్స్, అసమగ్ర సమాచారం అంటూ రకరకాల విమర్శలు, కోర్టు కేసులు ఎదుర్కుంటూ వచ్చిన టామ్ ను వదిలించుకోవటానికి పరిశ్రమ నిర్ణయించుకున్నప్పటినుంచీ టామ్ కు కష్టాలు మొదలయ్యాయి. ఎప్పటికప్పుడు టామ్ తన లెక్కింపును సమర్థించుకుంటూ వచ్చినప్పటికీ పరిశ్రమ వైపు నుంచి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతూనే వచ్చింది.

ప్రభుత్వం జోక్యం చేసుకొని రేటింగ్స్ కమిషన్ ఏర్పాటుచేసి నివేదిక మీద నిర్ణయాలు వెల్లడించటంతో టామ్ ఇరకాటంలో పడింది. నిబంధనకు అనుగుణంగా నడుచుకోవటం టామ్ కి అసాధ్యమని తేలిపోయింది. కొత్త నిబంధనలకు అనుగుణంగా ఎంటర్టైన్మెంట్ చానల్స్ సంఘం ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్, అడ్వర్టయిజర్ల సంఘం, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీల సంఘం కలిసి బార్క్ ఏర్పాటు చేసుకోవటంతో టామ్ భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలో పడింది.

నాలుగు నెలలుగా అటు టామ్, ఇటు బార్క్ రేటింగ్స్ ఇస్తున్నప్పటికీ చందాదారులు క్రమంగా టామ్ కి గుడ్ బై చెప్పి బార్క్ వైపు మొగ్గు చూపటం టామ్ ని మరింత కలవరపెట్టింది. రెండి ఏజెన్సీలకూ చందా కట్టటమన్నది దాదాపు అసాధ్యమేనని తేలిపోవటంతో టామ్ ఇండియా ఇక తప్పుకోవటమే మేలని నిర్ణయించుకుంది. అయితే, ఆఖరి అవకాశంగా తన మౌలిక సదుపాయాలు బార్క్ కి ఇస్తూ వ్యాపార ఒప్పందానికి సిద్ధమైంది. శాంపిల్స్ ఎంపిక, విశ్లేషణ తదితర కీలకాంశాలన్నీ బార్క్ చేతిలోనే ఉంటాయి.

ఒకప్పుడు తన పోటీ సంస్థ అయిన ఇన్ టామ్ ని కూడా టామ్ ఇదేవిధంగా కలుపుకొని గుత్తాధిపత్యం సంపాదించుకుంది. ఇప్పుడు టామ్ ని కలిపేసుకొని బార్క్ కూడా గుత్తాధిపత్యం పొందింది. అయితే, ఇది పరిశ్రమ స్వయంగా నడుపుకుంటున్న సంస్థ కాబట్టి విమర్శలకు అతీతంగా ఉంటుందని భావిస్తున్నారు.