టామ్ మొబైల్ యాప్ లో అదనపు ఫీచర్లు

టామ్ మీడియా రీసెర్చ్ నిరుడు విడుదల చేసిన మొబైల్ యాప్ వెర్షన్ 1.0 స్థానంలో ఇప్పుడు అదనపు ఫీచర్లతో అప్ గ్రేడ్ చేసిన వెర్షన్ 2.0 ను విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ ద్వారా టామ్ చందాదారులు టీవీ వ్యూయర్ షిప్ డేటాను మరింత సులభంగా అర్థం చేసుకునేందుకు, వాడుకునేందుకు వీలుంటుంది. ప్రేక్షకాదరణ సమాచారాన్ని జీఆర్పీలలోను, టీవీఆర్ ల లోను ఇవ్వడంతోబాటు అస్సాం, ఒడిశా మార్కెట్ల సమాచారాన్ని కూడా జోడించటం ఒక ప్రత్యేకత.

టామ్ సంస్థ నిరుడు జులై లో మొదటి వెర్షన్ విడుదల చేయడంతో చందాదారులు ఎక్కడున్నా తమ సెల్ ఫోన్లలో సమాచారం క్షణాల్లో అందుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అడ్వర్టయిజర్లకు, బ్రాడ్ కాస్టర్లకు, మీడియా ఏజెన్సీలకు ఇది చాలా అనువుగా ఉందని తేలటంతో ఇప్పుడు ఈ మెరుగైన వెర్షన్ విడుదల చేసినట్టు టామ్ మీడియా రీసెర్చ్ సీఈవో ఎల్ వి కృష్ణన్ చెప్పారు. ఇప్పుడున్న చందాదారులతో బాటు కొత్తవాళ్ళకూ ఇది ఉపయోగంగా ఉంటుందన్నారు. వ్యాపార నిర్ణయాలను ఇది వేగవంతం చేస్తుందని కూడా అభిప్రాయపడ్డారు.

ఇప్పుడున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ మార్కెట్లకు తోడు  అస్సాం, ఒడిశా చేర్చటం కూడా అదనపు ఆకర్షణగా భావిస్తున్నారు. వారం మొత్తానికి సంబంధించిన సమాచారం ఇవ్వడంతోబాటు గడిచిన నాలుగు వారాల సగటు కూడా అందుబాటులో ఉంటుందని చందాదారులు కానివారికి నామమాత్రపు చందాతో సమాచారం ఇవ్వటానికి కూడా ఏర్పాటు చేసినట్టు టామ్ వెల్లడించింది. ఈ మొబైల్ యాప్ ప్రతి గురువారం టామ్ సమాచారాన్ని పరిశ్రమకు విడుదలచేసిన వెంటనే అప్ డేట్ అవుతుంది.