• Home »
  • BARC »
  • టీవీ రేటింగ్స్ కు ఈ నెల 29న టామ్ గుడ్ బై: ఈ రోజు నుంచే బార్క్ తో భాగస్వామ్యం

టీవీ రేటింగ్స్ కు ఈ నెల 29న టామ్ గుడ్ బై: ఈ రోజు నుంచే బార్క్ తో భాగస్వామ్యం

ఒకటిన్నర దశాబ్దానికి పైగా భారత టెలివిజన్ రంగంలొ ప్రేక్షకాదరణ లెక్కింపులో గుత్తాధిపత్యం కొనసాగించిన టామ్ ఇండియా సంస్థ ఎట్టకేలకు ఈ నెల 29 తో గుడ్ బై చెప్పి రేటింగ్స్ డేటా లెక్కింపునుంచి వైదొలగుతోంది. భారత ప్రభుత్వం నియమించిన రేటింగ్స్ కమిషన్ ఇచ్చిన సిఫార్సులకు అనుగుణంగా నడుచుకోవటం సాధ్యం కాదని తేలిపోవటంతో పరిశ్రమ సారధ్యంలో బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) ప్రారంభం కావటం తెలిసిందే. టామ్ వైదొలగటం అనివార్యమని తేలిపోవటంతో ఈ నెల 29 తో డేటా ఆపేస్తున్నట్టు ప్రకటించింది.

అయితే, అదే సమయంలో బార్క్ ఇండియా తో కలిసి ఈ రోజు నుంచే జాయింట్ వెంచర్ భాగస్వామిగా చేరిపోయింది. మీటర్ల నిర్వహణలో ఈ రెండు సంస్థల జాయింట్ వెంచర్ పనిచేస్తుంది. ఈ కొత్త సంస్థ మీటరాలజీ డేటా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నడుస్తుంది. మరో రెండు వారాల్లో కార్యకలాపాలు మొదలవుతాయి. రేటింగ్స్ డేటా ఇచ్చే వ్యాపారం నుంచి ఇప్పుడు టామ్ వైదొలగటం వలన భారత టీవీ పరిశ్రమకు  ప్రేక్షకాదరణ డేటా ఇచ్చే ఏకైన సంస్థగా బార్క్ మాత్రమే మిగిలిపోతుంది.

కొత్తగా ఏర్పాటు చేసుకున్న జాయింట్ వెంచర్ లో బార్క్ ఇండియా వాటా 51% ఉండటం వల్ల నియంత్రణ దాని చేతిలోనే ఉంటుంది. మిగిలిన 49% వాటా టామ్ ఇండియాకు చెందుతుంది. అయితే, టామ్ ఇండియాలో నీల్సెన్, కంటార్ సంస్థలున్న సంగతి తెలిసిందే. శాంపిల్ ఇళ్ళ నిర్వహణ, మీటర్లనుంచి డేటా తీసి బార్క్ కు అందజేయటం, భవిష్యత్తులో శాంపిల్ ఇళ్ళు పెంచటం లాంటి పనులన్నీ ఈ జాయింట్ వెంచర్ బాధ్యత. ఈ రెండు సంస్థలూ కలవటం భారత బ్రాడ్ కాస్ట్ పరిశ్రమను బలోపేతం చేయటమే అవుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే, టీవీ చానల్స్ రేటింగ్స్ ఇవ్వకపోయినప్పటికీ టామ్ మాత్రం పత్రికలు, రేడియోలతో బాటు టీవీలకు యాడెక్స్ సర్వీసులు, ఇండెక్స్ రిపోర్టులు, రేడియో ఆడియెన్స్ లెక్కింపు, స్పోర్ట్స్ స్పాన్సర్ షిప్ ఆదాయం లెక్కింపు తదితర సేవలు అందించటం మాత్రం కొనసాగిస్తుంది. గడిచిన పదిహేనేళ్ళ కాలంలో టామ్ పెంచుకుంటూ వచ్చిన 12 వేల పీపుల్స్ మీటర్లు ఇప్పుడు బార్క్ మీటర్లతో కలిసిపోతున్నాయి.