• Home »
  • Cable »
  • డిజిటైజేషన్ 90% విజయవంతం:ప్రభుత్వం వంతపాడిన కార్పొరేట్ ఎమ్మెస్వోలు

డిజిటైజేషన్ 90% విజయవంతం:ప్రభుత్వం వంతపాడిన కార్పొరేట్ ఎమ్మెస్వోలు

ఒకవైపు సెట్ టాప్ బాక్సుల కొరత కారణంగా డిజిటైజేషన్ ఆశించినంత వేగంగా సాగకపోవటం, ఈ వాదనను విని సానుకూలంగా స్పందించిన కోర్టులు అనలాగ్ సిగ్నల్స్ మరికొంతకాలం పాటు కొనసాగేలా స్టే ఇవ్వటం తెలిసిందే. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ వాదనతో ఎంత మాత్రమూ ఏకీభవించటం లేదు. డిజిటైజేషన్ సాఫీగా సాగిపోతున్నట్టు ప్రభుత్వానికి కనిపిస్తోంది. ప్రభుత్వానికి కళ్ళూ చెవులూ అయిన కార్పొరేట్ ఎమ్మెస్వోలు చెప్పినమాటల ఆధారంగా నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పెంచేది లేదంటూ భీష్మించుకుంది. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ సమావేశంలోనూ అదే తంతు కొనసాగిస్తూ కార్పొరేట్ ఎమ్మెస్వోల మద్దతు కూడగట్టుకుంది.

నిరుడు ఆఖరి నిమిషంలో మూడో దశ ముగింపు గడువుకు ఒక్కరోజు ముందు సమావేశమై అంతా సజావుగా ఉందని తనను తాను అభినందించుకున్న ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ టాస్క్ ఫోర్స్ సమావేశం ఏర్పాటు చేసింది. 2015 డిసెంబర్ 30న ఏర్పాటు చేసిన టాస్క్ ఫోస్ సమావేశం అంచనాల ప్రకారం దేశ వ్యాప్తంగా మూడో దశ డిజిటైజేషన్ 76.45% పూర్తయింది. అయితే, 2016 ఫిబ్రవరి 16 న జరిగిన సమావేశం నాటికి ఈ లెక్క ఒక్కసారిగా 90.44% అయిపోయింది. టాస్క్ ఫోర్స్ సమావేశంలో చెప్పిన లెక్కలివి. అదే సమయంలో ఎమ్మెస్వోలు సెట్ టాప్ బాక్సులు ఏర్పాటు చేయటంలోనూ గణనీయమైన పురోగతి సాధించినట్టు తేల్చారు. ఇదే కాలానికి 69 లక్షల 10 వేల నుంచి కోటీ 24 లక్షల 30 వేలకు పెరిగాయన్నారు. అంటే, ఏడాది కాలంలో పెట్టిన బాక్సులకు సమానంగా ఈ ఒకటిన్నర నెలలకాలంలోనే పెట్టినట్టు కార్పొరేట్ ఎమ్మెస్వోల చేత చెప్పించి టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆమోద ముద్ర వేయించటం ప్రభుత్వానికే చెల్లింది. ఇవే లెక్కలను సుప్రీంకోర్టుకు సమర్పించటం ద్వారా వివిధ రాష్ట్రాలలో అనలాగ్ సిగ్నల్స్ కొనసాగించటాన్ని అడ్డుకోబోతోంది.

స్వదేశీ కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ గురించి కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్  టెక్నాలజీ విభాగం తయారుచేసిన ఇండియన్ కాస్ స్వదేశీ తయారీ సెట్ టాప్ బాక్స్ లలో అమర్చటమే కాకుండా పన్నెండు మంది ఎమ్మెస్వోలు ఆ సెట్ టాప్ బాక్సులు వాడినట్టు చెప్పారు. ఈ ఇండియన్ కాస్ మరో మూడేళ్ళలో అందరికీ అందుబాటులోకి రాగలదని భావిస్తున్నారు. టెలికామ్ విభాగం భారత్ సంచార్ నిగమ్ వాళ్ళను ఎమ్మెస్వోలు సిగ్నల్స్ అందుకునేలా లింక్ ఇవ్వాలని కోరింది. మూడు, నాలుగు దశల్లో ఎమ్మెస్వోలు చాలామంది పెద్ద ఎమ్మెస్వోల హెడ్ ఎండ్స్ నుంచి ఫీడ్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి లింక్ సౌకర్యం కల్పించాలని సూచించింది. మూడో దశలో కొన్ని చోట్ల ఎమ్మెస్వోలు తమకు బ్రాడ్ బాండ్ సౌకర్యం అందుబాటులో ఉండటం లేదని చేసిన ఫిర్యాదులమీద టెలికాం శాఖ ఈ విధంగా స్పందించింది.

మూడు, నాలుగు దశల డిజిటైజేషన్ అమలు తీరును సమీక్షించేందుకు ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ ఫిబ్రవరి 16 న తన 14 వ సమావేశం ఏర్పాటు చేసుకుంది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి జె. ఎస్. మాథుర్ ఈ సమావేశాన్నుద్దేశించి మాట్లాడారు. గడువు తేదీ పొడిగింపు కోరుతో అనేక చోట్ల కోర్టులలో పిటిషన్లు దాఖలైనప్పటికీ డిజిటైజేషన్ పురోగతి  చాలా బాగుందన్నారు. కొన్ని కోర్టులు స్టే ఇచ్చినంత మాత్రాన డిఝిటైజేషన్ నిలిచిపోయినట్టు భావించకూదదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. డిజిటైజేషన్ ఇప్పుడు వాస్తవ రూపం ధరిస్తున్నదని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగే ప్రసక్తే లేదని అన్నారు. బ్రాడ్ కాస్టర్లు, ఎమ్మెస్వోలు ఈ సందేశానికి విస్తృత ప్రచారం కల్పించాల్సి ఉందన్నారు. డిజిటైజేషన్ ఊసే లేని ప్రాంతాల సంఖ్య బాగా తగ్గిందని కూడా మాథుర్ గుర్తు చేశారు. ఇటీవలే ఎమ్మెస్వో లైసెన్స్ పొందినవాళ్ళందరూ సెట్ టాప్ బాక్సులకు ఆర్డర్ పెట్టిందీ లేనిదీ తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

మొత్తం డిజిటైజేషన్ ప్రక్రియను సమీక్షిస్తూ జాయింట్ సెక్రెటరీ ఆర్ జయ మాట్లాడారు. మూడో దశ డిజిటైజేషన్ గడువు పెంచాలంటూ దేశ వ్యాప్తంగా వేరు వేరు కోర్టులలో మొత్తం 19 కేసులు నమోదయ్యాయని చెప్పారు. వెంటనే ఆ స్టే ఉత్తర్వులన్నీ తొలగించేలా మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలియజేశారు. అన్ని కేసులూ కలిపి సుప్రీంకోర్టుకు బదలాయించి వెంటనే విచారించాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. ఇప్పటివరకు 695 మందికి డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్సులు మంజూరు చేయగా మరో 164 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, 240 దరఖాస్తులలో సమాచారం అసంపూర్తిగా ఉందని టాస్క్ ఫోర్స్ సమావేశానికి తెలియజేశారు. మూడు, నాలుగు దశల డిజిటైజేషన్ ను సమర్థంగా పర్యవేక్షించటం కోసం ప్రాంతీయ విభాగాలు ఏర్పాఋ చేయటాన్ని జయ గుర్తు చేశారు. ఈ కేంద్రాలు ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెస్వోలతో క్రమం తప్పకుండా మాట్లాడుతున్నాయన్నారు. డిజిటైజేషన్ మీద అనుమానాల నివృత్తి కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ కు రోజుకు సగటున 300 నుంచి 500 కాల్స్ వస్తున్నట్టు కూడా తెలియజేశారు.

డిజిటల్ హెడ్ ఎండ్స్ తనిఖీ బాధ్యతలను ప్రసార భారతి సిబ్బందికి అప్పగించగా  వారు అన్ని హెడ్ ఎండ్స్ కు వెళ్ళి తనిఖీ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకూ మొత్తం 340 హెడ్ ఎండ్స్ తనిఖీ చేపట్టగా అందులో 109 హెడ్ ఎండ్స్ పనిచేయటం లేదని తెలిపారు. లైసెన్స్ తీసుకున్నప్పటికీ ఇతర పెద్ద హెడ్ ఎండ్స్ మీద ఆధారపడే దిశలో వీరంతా ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. నాలుగో దశ డిజిటైజేషన్ కిందికి వచ్చే ప్రాంతాల జాబితాలు పంపాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరామని కూడా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ జయ తెలియజేశారు.  హిమాచల్ ప్రదేశ్, జమూకాశ్మీర్ మినహా ఎవరూ ఈ జాబితాలు అందించలేదన్నారు. అయితే, జమూ కాశ్మీర్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ సెట్ టాప్ బాక్సులు చాలినన్ని అందుబాటులో లేకపోవటం వల్ల మూడోదశ పూర్తిచేయలేకపోయినట్టు చెప్పారు. అయితే, ఎప్పుడు ఆర్డర్ చేసిందీ చెప్పలేదని టాస్క్ ఫోర్స్ అధికారులు వ్యాఖ్యానించటం గమనార్హం.్

తెలంగాణ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ , తమ రాష్ట్రంలో మూడో దశ డిజిటైజేషన్ జరిగే ప్రాంతాలలో కేవలం 30 నుంచి 35 శాతం మాత్రమే పూర్తయిందని చెబుతూ లక్ష్యాలు పూర్తి చేయటానికి ఎమ్మెస్వోలకు మరింత సమయం కావాలన్నారు. చాలామంది ఎమ్మెస్వోల ప్రతినిధులు బాక్సుల కొరత గురించి కాకుండా అనేక ఇతర సమస్యలు ప్రస్తావించారని టాస్క్ ఫోర్స్ ప్రకటించింది. కోర్టులు వ్య్వధి పొడిగించటం వలన తమ పరిధిలోని చాలామంది ఆపరేటర్లు సెట్ టాప్ బాక్సులు తీసుకోవటానికి పెద్దగా ఆసక్తి కనబరచటం లేదని హాత్ వే ప్రతినిధి ఒకరు చెప్పారు

మరో ఎమ్మెస్వో  ఇండస్ ఇండియా మీడియా ప్రతినిధి మాట్లాడుతూ, కోర్టులు పొడిగింపుకు అనుమతి ఇవ్వటం వలన చాలా చోట్ల మూడో దశలో ఇంకా అనలాగ్ ప్రసారాలు కొనసాగుతున్నాయన్నారు. అలాంటి పరిస్థితిలో బ్రాడ్ కాస్టర్లు పాత ఒప్పందాల ప్రకారం అనలాగ్ ధరలు మాత్రమే వసూలు చేయాలని కోరారు. సిటీ కేబుల్ ప్రతినిధి కూడా సెట్ టాప్ బాక్సులు నిల్వ ఉంఛటం గురించి ప్రస్తావించారు. తమ దగ్గర దాదాపు పది లక్షల సెట్ టాప్ బాక్సులు నిల్వ ఉన్నాయన్నారు. ఎమ్మెస్వోలు ప్రణాళికాబద్ధంగా సెట్ టాప్ బాక్సులకు ఆర్డర్ ఇస్తూ ఎప్పటికప్పుడు తగినన్ని నిల్వలు ఉంచుకునేట్టు చూడాలని సూచించారు. కొత్తగా రిజిస్టర్ చేసుకున్న ఎమ్మెస్వోలు ఈ పద్ధతి పాటిస్తున్నట్టు కనిపించలేదన్నారు. జిటిపిఎల్-హాత్ వే ప్రతినిధి మాట్లాడుతూ సెట్ టాప్ బాక్సుల కోసం పెట్టిన కొన్ని ఆర్డర్లు ఇంకా రవాణాలోనే ఉండిపోవటం వలన తగినన్ని నిల్వలు లేవని, మొత్తంగా మాత్రం చాలినన్ని ఉన్నాయన్నారు.

కనీసం డిజిటల్ ఎమ్మెస్వోగా లైసెన్స్ కోసం దరఖాస్తు కూడా చేసుకోని కొంతమంది ఎమ్మెస్వోలు డిజిటైజేషన్ గడువు పెంపుదల కోరుతూ కోర్టుకు వెళ్ళారన్న విషయం ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. సాంకేతికంగా ఎంతమాత్రమూ సిద్ధంగా లేని ఎమ్మెస్వోలు కూడా  ఇలా కోర్టుకెక్కారన్నారు. ఒక కోర్టులో అయితే స్థానిక కేబుల్ ఆపరేటర్లను వెంటనే సెట్ టాప్ బాక్సులకోసం ఎమ్మెస్వోలకు వెంటనే ఆర్డర్ చేయాలని ఆదేశించటాన్ని గుర్తుచేసుకున్నారని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రతినిధి ప్రస్తావించారు. రాష్ట్రప్రభుత్వాలు ఆయా ఎమ్మెస్వోల నుంచి సెట్ టాప్ బాక్సుల అందుబాటుమీద సమాచారం రాబట్టాలని సూచించారు. డిజిటైజేషన్ వలన రాష్ట ప్రభుత్వాలకు ఎంత మేలు జరుగుతుందో ట్రాయ్ ఈ మధ్యనే ఆయా ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసిందన్నారు.

మహారాష్టకు చెందిన ఒక కేబుల్ ఆపరేటర్ల సంఘం ప్రతినిధి మాట్లాడుతూ, నాలుగో దశ కిందికి వచ్చే ప్రాంతాలకు కూడా కొంతమంది ఎమ్మెస్వోలు తమ కంట్రోల్ రూమ్స్ నుంచి ఫీడ్ ఇవ్వటం ఆపేశారని ఫిర్యాదు చేశారు. డిజిటైజేషన్ అనేది అసలు చందాదారు కోణం నుంచే ఆలోచించటం లేదని, సెట్ టాప్ బాక్స్ కొనగలరా లేదా అనేది కూడా పట్టించుకోవటం లేదని, మరీ ముఖ్యంగా నాలుగో దశ పరిస్థితి చాల దయనీయంగా ఉన్న విషయం గుర్తించాలని కోరారు. మంత్రిత్వశాఖ అధికారి మాథుర్ మాట్లాడుతూ, మొత్తం డిజిటైజేషన్ అనేది పూర్తిగా చందాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జరుగుతున్న ప్రక్రియేనని అన్నారు. అందుకే గడువు తేదీలకు కట్టుబడటానికి చందాదారులు ప్రయత్నించాలన్నారు. పరిశ్రమలోని భాగస్వాములందరూ ప్రజలను డిజిటైజేషన్ దిశగా ప్రోత్సహించాలన్నారు.

ఇలా ఉండగా, సెట్ టాప్ బాక్సుల ధర నిర్ణయించుకునే అధికారం ఎమ్మెస్వోలకే ఇవ్వటం సమంజసమని కూడా  ట్రాయ్ ప్రతినిధి సూచించారు. ట్రాయ్ ఎప్పుడూ సెట్ టాప్ బాక్స్ ధర నిర్ణయించలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే, సెట్ టాప్ బాక్సుల సరఫరా, ఏర్పాటు చేయటం లాంటి విషయాల్లో టారిఫ్ ఆర్డర్ లో పేర్కొన్న విషయాలలో మాత్రం ఎలాంటి మినహాయింపులూ ఉండబోవని కూడా ట్రాయ్ స్పష్టం చేసింది. ఈ విషయంలో చందాదారుల హక్కులకు భంగం కలగకూడదని గుర్తుచేసింది. సెట్ టాప్ బాక్సులు తయారుచేసే కంపెనీల సంఖ్య గడిచిన ఏడాది కాలంలో రెట్టింపైందని CEAMA ప్రతినిధి చెప్పారు. అదే విధంగా భారత్ లో తయారీ కూడా నూరు శాతం పెరిగిందని చెప్పారు. ఒక చైనా కంపెనీ త్వరలో భారత్ లో తయారీ ప్రారంభించబోతున్నదన్నారు. చిన్న ఎమ్మెస్వోల నుంచే ఎక్కువగా బాక్సులకోసం ఆర్డర్లు వస్తున్నట్టు తయారీదారులు గుర్తించారు.  కానీ ఆర్డర్ చేసే ప్రతిసారీ ఎమ్మెస్వోలు గుర్తుంచుకోవాల్సింది ఆ బాక్సుల ఇంటిగ్రేషన్ కోసం కనీసం రెండు నెలలు పడుతుందన్న విషయమన్నారు. అందుకే ఈ సంగతి దృష్టిలో పెట్టుకొని ముందుగా ఆర్డర్ చేస్తే సకాలంలో అందుతాయన్నారు.

ఇండియన్ కాస్ గురించి అది తయారు చేసే సెట్ టాప్ బా క్సుల గురించి ఎమ్మెస్వోలందరికీ తెలిసేలా CEAMA చర్యలు తీసుకోవాలని మంత్రిత్వశాఖ ప్రతినిధి జయ సూచించారు. అందరు ఎమ్మెస్వోలనూ ఆహ్వానించి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని CEAMA ప్రతినిధి చెప్పారు. ప్రభుత్వపు మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొన్ స్వదేశీ సెట్ టాప్ బాక్సులమీద దృష్టిపెట్టాలని మాథుర్ సూచించారు. సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయాలనుకున్న  ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ తరఫున వారి ప్రతినిధి మాట్లాడుతూ, మంత్రిత్వశాఖ మూడో దశ డిజిటైజేషన్ గడువు పెంచలేదన్న విషయాన్ని చానల్స్ స్క్రోల్ ద్వారా ప్రచారం చేస్తున్నాయని చెప్పారు.

నాలుగో దశ డిజిటైజేషన్ కిందికి వచ్చే ప్రాంతాలన్నిటి జాబితా అందించాలని అన్ని రాష్ట ప్రభుత్వాలనూ మంత్రిత్వశాఖ కోరినట్టు మాథుర్ చెప్పారు. అప్పుడే పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించటం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.  గ్రామ స్థాయి మొదలుకొని రాష్ట్రప్రభుత్వాల దగ్గర సమాచారం ఉన్నప్పటికీ మండల స్థాయి నుంచి ఇస్తే సరిపోతుందన్నారు. డిజిటైజేషన్ లో భాగస్వాములందరూ ప్రజలలో చైతన్యంపెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలను మంత్రిత్వశాఖ ప్రతినిధి జయ అభినందించారు. ఎమ్మెస్వోలకు అందుబాటులో లేని ప్రాంతాలను కూడా గుర్తించాలని కోరారు. నాలుగోదశ చివరిదాకా ఆగకుండా ఎమ్మెస్వోలు, బ్రాడ్ కాస్టర్లు పని మొదలుపెట్టాలని మాథుర్ కోరారు. ఒక్కో దరఖాస్తు పరిశీలించటానికి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నందున ఆ సంగతి దృష్టిలో పెట్టుకొని ఇంకా దరఖాస్తుచేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించారు. నాలుగో దశ రిజిస్ట్రేషన్ కోసం పత్రికలలో ఒక ప్రకటన కూడా జారీచేయబోతున్నట్టు వెల్లడించారు. అదే సమయంలో ఎమ్మెస్వోలు సెట్ టాప్ బాక్సుల విషయంలో తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మంత్రిత్వశాఖ ఇప్పటికే కోర్టుకు వెళ్ళినందువల్ల ఎమ్మెస్వోలు సెట్ టాప్ బాక్సులు అమర్చే పని వేగంగా కొనసాగించాలని కోరారు.