• Home »
  • BARC »
  • లాండింగ్ పేజ్ ప్రకటనల కేసు 29కి వాయిదా

లాండింగ్ పేజ్ ప్రకటనల కేసు 29కి వాయిదా

టీవీ ఆన్ చేయగానే మనకు తెరమీద ఎప్పుడూ ఒకే చానల్ కనబడుతూ ఉండవచ్చు. ఆ తరువాత మనం మనకు కావాల్సిన చానల్ మార్చుకునే అవకాశం ఎలాగూ ఉంటుంది. అలా టీవీ ఆన్ చేయగానే వచ్చే చానల్ తమదే అయి ఉండాలనుకుంటే ఆ చానల్ యాజమాన్యం ఎమ్మెస్వోకు లేదా డిటిహెచ్ ఆపరేటర్ కు కొంతమొత్తం ముట్టజెబుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఎమ్మెస్వోలకు, డిటిహెచ్ ఆపరేటర్లకు ఇదొక రకమైన ఆదాయ వనరు. ఇవన్నీ లాండింగ్ పేజ్ అడ్వర్టయిజ్ మెంట్ ఒప్పందాల ఫలితమే.

మరికొందరు ఎమ్మెస్వోలు మరో అడుగు ముందుకేసి చానల్ ఏదిపెట్టినా సరే తమ ప్రకటన ప్రసారమయ్యే ఏర్పాటు కూడా చేసుకున్నారు.. ఇది కూడా అదనపు ఆదాయ మార్గమే. కొత్త చానల్స్ లేదా కొన్ని ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాల ప్రచారం కోసం బ్రాడ్ కాస్టర్లు ఈ పద్ధతి వాడుకుంటున్నారు. అయితే, ఇది సరైన పద్ధతి కాదంటూ ట్రాయ్ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇది ఎమ్మెస్వోల ఆదాయానికి గండి కొట్టటమే అవుతుందని ఆలిండియా డిజిటల్ కేబుల్ సమాఖ్య, డెన్ నెట్ వర్క్స్, ఫాస్ట్ వే తదితర ఎమ్మెస్వోలు టిడిశాట్ లో ఫిర్యాదు చేశాయి.

దీంతో లాండింగ్ పేజీ ప్రకటనల మీద నవంబర్ 8 న ట్రాయ్ ఇచ్చిన ఆదేశాలమీద స్టే విధిస్తూ టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్( టిడిశాట్) ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ట్రాయ్ తన వివరణ ఇస్తూ, లాండింగ్ పేజ్ ప్రకటనల సాయంతో పంపిణీ వేదికలను వాడుకోవాలన్న బ్రాడ్ కాస్టర్ల ప్రయత్నం సరైనది కాదంటూ తన వాదనను బలంగా సమర్థించుకుంది.. అలా బ్రాడ్ కాస్టర్లు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు ఇచ్చుకుంటూ పోవటాన్ని అమోదిస్తే తప్పుడు సంకేతాలు పంపినట్టవుతుందని కూడా పేర్కొంది. ఒక చానల్ ను ఒక చోట మాత్రమే ప్రదర్శించాలన్న ప్రాథమిక నిబంధనకు ఇది అవరోధంగా మారతుందని టిడిశాట్ కి ట్రాయ్ తేల్చి చెప్పింది.

రేటింగ్స్ ప్రతివారం విడుదల అవుతాయి కాబట్టి తక్షణ చర్యలు అవసరమని కూడా పేర్కొంది. ట్రాయ్ చట్టానికి అనుగుణంగానే ఆ ఆదేశాలు జారీ అయ్యాయని స్పష్టం చేసింది. పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు అదనపు ఆదాయం సమకూర్చుకోవటానికి మరెన్నో మార్గాలు ఉన్నాయని గుర్తు చేసింది. లాండింగ్ పేజ్ ప్రకటనలను అడ్డుకున్నంత మాత్రాన వారి వ్యాపారానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని కూడా వివరణ ఇచ్చింది. అందువలన దీన్ని రాజ్యాంగ విరుద్ధమనో, ఉపాధి హక్కుకు భంగమనో అనుకోవటానికి వీల్లేదని ట్రాయ్ స్పష్టం చేసింది. పైగా చందాదారుడి అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా యాక్టివేట్ చేసినట్టవుతుందని కూడా పేర్కొంది. రేటింగ్స్ లెక్కింపులో ప్రతి నిమిషమూ విలువైనదన్న సంగతి గుర్తు చేసింది. దీంతో, ఈ కేసు విచారణను ఈ నెల (జనవరి , 2018)29 కి వాయిదా వేస్తున్నట్టు టిడిశాట్ ప్రకటించింది.

వివాదం పూర్వాపరాలు

లాండింగ్ పేజ్ ప్రకటనల ఒప్పందాలు చెల్లవని ట్రాయ్ ప్రకటించటంతోబాటు అలా ప్రకటనలిచ్చే చానల్స్ కు రేటింగ్స్ వెంటనే నిలిపివేయాలంటూ సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఇటీవలే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్) ను ఆదేశించింది. దీంతో టీవీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. బ్రాడ్ కాస్టర్లు అడ్డదారుల్లో తమ ప్రసారాల గురించి ప్రచారం చేసుకోవటానికి పరోక్షంగా ఇతర చానల్స్ ను సైతం వాడుకుంటున్నారంటూ కొంతకాలంగా నిరసన వ్యక్తమవుతూ వస్తుండగా ఎట్టకేలకు కేంద్రం గట్టిగా స్పందించింది. ప్రేక్షకాదరణ కోసం ఎలాంటి విధానాలకైనా దిగజారే తీరును సహించబోమంటూ ప్రభుత్వం హెచ్చరించింది. టీవీ పెట్టగానే మనం ఏ చానల్ పెట్టినా సరే ఆ ఎమ్మెస్వో ఒప్పందం చేసుకున్న చానల్ వారి ప్రకటన తెర దిగువ భాగాన ఆకస్మాత్తుగా ప్రత్యక్షమై సహజంగానే అది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది.

ఇందుకోసం బ్రాడ్ కాస్టర్లు పెద్ద ఎత్తున డబ్బు ముట్టజెబుతూ పంపిణీసంస్థలైన ఎమ్మెస్వోలతో, డిటిహెచ్ ఆపరేటర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అయితే, ఇప్పటివరకూ వీటిమెద ఎలాంటి నియంత్రణా లేదు. గతంలో ట్రాయ్ చేసిన సిఫార్సుల ప్రకారమైతే తెరమీద మితిమీరిన ప్రకటనలు ఉండకూడదు. ప్రసారమవుతున్న కార్యక్రమం వివరాలు మాత్రమే కనబడి మాయం కావాలి. మరో విధంగా చూస్తే డబ్బున్న చానల్స్ ఇలాంటి పద్ధతులద్వారా ప్రచారం పొందుతున్నాయి.

కృత్రిమంగా ప్రేక్షకాదరణ పెంచుకునే ప్రయత్నాలు ఆపాలని కేంద్రం భావిస్తోంది. అందుకే బార్క్ కు ఇలాంటి ఆదేశాలు జారీచేసింది. ఈ మధ్యనే టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీల మధ్య వివాదం చెలరేగినప్పుడు కూడా బహుళ స్లాట్స్ లో చానల్స్ ప్రసారం కావటం మీద చర్చ జరిగి, ట్రాయ్ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు లాండిం పేజ్ మీద చర్చ మొదలైంది. ఇప్పటికే ప్లేస్ మెంట్ ఫీజు వసూలు చేసుకుంటున్న ఎమ్మెస్వోలు ఇప్పుడు లాండింగ్ పేజ్ ఒప్పందాలతో మరింత ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నాయనే విమర్శలున్నాయి.

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పేర్కొన్న ఇంటర్ కనెక్షన్ నిబంధనలకు ఇది వ్యతిరేకమని మంత్రిత్వశాఖ బార్క్ కు రాసిన లేఖలో స్పష్టం చేసింది. అలా నియమాలను ఉల్లంఘించిన చానల్స్ కు రేటింగ్స్ నిలిపివేయటం ద్వారా అదుపుచేయాలని బార్క్ కు సూచించింది. అయితే, ఇప్పటివరకు నిరభ్యంతరంగా ఈ వెసులుబాటును బాగా వాడుకుంటూ వచ్చిన చానల్స్ ఇప్పుడు తీవ్రంగా స్పందిస్తుననయి. మరో వైపు ఎమ్మెస్వోలు తమ ఆదాయ మార్గానికి గండి కొట్టారంటూ ప్రభుత్వాన్ని తప్పుబట్టే ప్రమాదం కూడా ఉంది.