• Home »
  • Cable »
  • చందారేట్ల సమాచారం దాస్తున్న చానల్స్: ట్రాయ్ పర్యవేక్షించాలంటున్న టిడిశాట్

చందారేట్ల సమాచారం దాస్తున్న చానల్స్: ట్రాయ్ పర్యవేక్షించాలంటున్న టిడిశాట్

ఇంటర్ కనెక్షన్ ఒప్పందాల విషయంలో స్టార్ ఇండియా, తాజ్ టెలివిజన్ వాణిజ్యపరమైన సమాచారాన్ని దాచి ఉంచటాన్ని టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్ (టిడిశాట్) తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే ఈ విషయంలో టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) స్వయంగా రంగంలో దిగి పర్యవేక్షించాలని సూచిస్తోంది.  ఈ కేసులో మరో పార్టీ అయిన హిట్స్ ఆపరేటర్ నోయిడా సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ లిమిటెడ్ (ఎన్ ఎస్ టిపిఎల్) వల్లనే ఈ కేసు సుప్రీంకోర్టుదాకా వెళ్ళిన సంగతి తెలిసిందే. 2015 డిసెంబర్ 18వ తేదీ నాటి ఆదేశాలతో బాటు 2016 జనవరి 29, ఫిబ్రవరి 9 ఆదేశాల ప్రతులను కూడా ట్రాయ్ కి పంపింది.

మూడు దేశ వ్యాప్త ఎమ్మెస్వోలైన డెన్, హాత్ వే, సిటి తో కుదుర్చుకున్న ఇంటర్ కనెక్షన్ ఒప్పందాలను సమర్పించాల్సిందిగా 2015 డిసెంబర్ 18 న ట్రైబ్యునల్ అదేశాలిచ్చింది. వాటి ఆధారంగా ఎన్ ఎస్ టి పి ఎల్ కు మధ్యంతర ఉత్తర్వులివ్వాలని ట్రైబ్యునల్ భావించింది. అందుకు అనుగుణంగా స్టార్, తాజ్ టెలివిజన్ కు తాత్కాలిక చెల్లింపులు జరిపించాలని నిర్ణయించుకుంది. అయితే  స్టార్, తాజ్ టెలివిజన్ ఆ తరువాత జరిగిన విచారణ సందర్భంగా ఆ విషయం దాటవేస్తూ, ప్రస్తుతానికి ఎన్ ఎస్ టి పి ఎల్ ఎలాంటి చెల్లింపులు జరపకపోయినా ప్రసారాలు అందిస్తామని, ఆ తరువాత ట్రైబ్యునల్ తీర్పుకు అనుగుణంగా వసూలు చేసుకుంటామని చెప్పాయి.

ఈ కోణాన్ని కూడా ట్రాయ్ పరిగణనలోకి తీసుకోవాలని ట్రైబ్యునల్ ఫిబ్రవరి 16 నాటి ఆదేశాలలో ట్రాయ్ ని కోరింది. తాజా నియమావళి రూపొందించే సమయంలో ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది.  ఇదే పార్టీలకు సంబంధించిన మరో కేసు విచారణ సమయంలో ట్రాయ్ తరఫు న్యాయవాది ట్రైబ్యునల్ ముందు మాట్లాడుతూ, ఇంటర్ కనెక్షన్ల కీలక సూత్రమే వివక్ష చూపకపోవటమేనని ప్రస్తావించటాన్ని గుర్తు చేసింది. మరి బ్రాడ్ కాస్టర్లు అలా వాణిజ్యపరమైన అంశాలను అలా రహస్యంగా ఉంచుతూ ఉన్నప్పుడు వివక్ష ఉండదని ఎలా చెప్పగలమో గ్రహించాలని ట్రాయ్ ని కోరింది. ఇద్దరు బ్రాడ్ కాస్టర్లు తీసుకున్న వైఖరికి అభ్యంతరం చెబుతూ ఎన్ ఎస్ టి పి ఎల్ తరఫు న్యాయవాది  వివేక్ చిబ్ ఆ రెండు సంస్థలూ డిసెంబర్ 18 నాటి ఉత్తర్వులు పాటించేలా చూదాలని కోరారు. వారు అందించే డాక్యుమెంట్స్ ఆధారంగా ట్రైబ్యునల్ మంధ్యంతర ఆదేశాలివ్వాలని కోరారు. తాము ఆ విధంగా నెలవారీ చెల్లింపులకు సిద్ధమన్నారు.

మొత్తంగా చూస్తే పిటిషనర్ కు టిడిశాట్ ఆదేశాలు మాత్రమే ఊరటనిచ్చే అవకాశం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే ట్రాయ్ అందుకు తగిన నిబంధనలు రూపొందించాలని, ఈ విషయమై రెండు వారాల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది.