• Home »
  • Cable »
  • బకాయి ఉన్నా ఎమ్మెస్వోకు సిగ్నల్స్ ఆపకండి: జీ గ్రూప్ కి టిడిశాట్ ఆదేశం

బకాయి ఉన్నా ఎమ్మెస్వోకు సిగ్నల్స్ ఆపకండి: జీ గ్రూప్ కి టిడిశాట్ ఆదేశం

ఇన్వాయిస్ ల ఆధారంగా కొద్ది కొద్ది మొత్తాల్లో బకాయిలు చెల్లిస్తూ ఉన్నంతకాలం సిగ్నల్స్ నిలిపివేయవద్దంటూ టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్  (టిడిశాట్) జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఆదేశించింది. సెవెన్ స్టార్ డాట్ కామ్ సంస్థ దాఖలు చేసుకున్న పిటిషన్ మీద ట్రైబ్యునల్ ఈ ఆదేశాలు జారీచేసింది. అయితే, పిటిషన్ దారుడు నెలవారీ చందాలు చెల్లిస్తూనే ఉండాలని పేర్కొంది.

ట్రైబ్యునల్ సభ్యుడు బిబి శ్రీవాత్సవ ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 16 కు వాయిదా వేశారు. సెవెన్ స్టార్ తరఫు న్యాయవాది తన క్లైంట్ రూ. 50 లక్షలు చెల్లించిన విషయాన్ని కోర్టుకు తెలియజేయటంతో ట్రైబ్యునల్ ఆదేశాలిస్తూ సిగ్నల్స్ నిలిపివేయరాదని స్పష్టం చేసింది. అయితే, ఈ చెల్లింపుకూ కేసు విచారణలో అభ్యంతరాలకూ ఎటువంటి సంబంధమూ ఉండదని ట్రైబ్యునల్ వివరించింది. తుది ఉత్తర్వులకు లోబడే ఇరుపక్షాలూ వ్యవహరించాలని సూచించింది.

అయితే, పాక్షిక చెల్లింపులో నామమాత్రపు చెల్లింపులు కుదరవని మరో కేసులో ట్రైబ్యునల్ తన వైఖరి చాటింది. హాత్ వే కేబుల్ అండ్ డాటాకామ్ లిమిటెడ్ కు ప్రజ్ఞ విజన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ 94 లక్షలకు పైగా బకాయి ఉండగా కేవలం లక్ష రూపాయలకు ఒక చెక్కు, పది వేల రూపాయలకు మరో చెక్కు మాత్రమే ఇచ్చారని ట్రైబ్యునల్ దృష్టికి వచ్చింది. దీంతో ఈ కేసు విచారణను ఈ నెల 21 కి వాయిదా వేస్తూ ప్రజ్ఞ విజన్ ఎండి ఆ రోజు కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. చెల్లింపుల తేదీలతో ఒక అఫిడవిట్ ఇవ్వటానికి ప్రజ్ఞ సిద్ధంగా ఉన్నట్టు ఆ సంస్థ తరఫు న్యాయవాది విన్నవించారు.