• Home »
  • Cable »
  • కేబుల్ ఆపరేటర్లు ఉమ్మడిగా కూడా పిటిషన్లు దాఖలు చేయవచ్చు : టిడిశాట్

కేబుల్ ఆపరేటర్లు ఉమ్మడిగా కూడా పిటిషన్లు దాఖలు చేయవచ్చు : టిడిశాట్

స్థానిక కేబుల్ ఆపరేటర్లు ఒక సమూహంగానో, ఒక సంఘంగానో టిడిశాట్ లో ఫిర్యాదు చేయటానికి చట్టపరంగా ఎలాంటి అవరోధాలూ లేవని టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ( టిడిశాట్ ) స్పష్టం చేసింది. జబల్పూర్ కేబుల్ ఆపరేటర్లకు, సిటీ కేబుల్ కు మధ్య ఏర్పడిన వివాదంలో సిటీ కేబుల్ లేవనెత్తిన అభ్యంతరాన్ని తోసిపుచ్చుతూ టిడిశాట్ ఇలా తేల్చి చెప్పటం కేబుల్ ఆపరేటర్ల ఉమ్మడి బలానికి మరింత చేయూత నిచ్చినట్టయింది.

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియ (ట్రాయ్ ) చట్టం లోని 14 వ సెక్షన్ ప్రకారం ఒక లైసెన్స్ పొందిన వ్యక్తికీ, ఇచ్చిన సంస్థకూ మధ్యగాని, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది సర్వెస్ ప్రొవైడర్లమధ్యగాని, ఒక సర్వీస్ ప్రొవైడర్ కూ, వినియోగదారులకూ మధ్యగాని ఏర్పడిన వివాదాలకు మాత్రమే ట్రైబ్యునల్ కు జ్యూరిస్ డిక్షన్ ఉంటుందని సిటీకేబుల్ తరఫు న్యాయవాది తేజ్ వీర్ భాటియా అభ్యంతరం తెలియజేశారు. అందువలన జబల్పూర్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఈ మూడు వర్గాలలో దేనికీ చెందదని గుర్తు చేశారు.

అయితే, ఈ అభ్యంతరాన్ని తోసిపుచ్చుతున్నట్టు టిడిశాట్ చైర్మన్ జస్టిస్ అఫ్తాబ్ ఆలమ్, సభ్యులు కుల్దీప్ సింగ్, బిబి శ్రీవాస్తవ స్పష్టం చేశారు. పిటిషనర్ కేబుల్ ఆపరేటర్ల రిజిస్టర్డ్ సంఘం కావటం, అది 90 మందికి పైగా కేబుల్ ఆపరేటర్లకు ప్రాతినిధ్యం వహించటం, ఎమ్మెస్వోతో వివాదంలో ఉండటం అనే కారణాలదృష్ట్యా ఆ అభ్యంతరానికి అర్థం లేదని అభిప్రాయపడ్డారు.

అందరి వివాదమూ ఒకటే అయినప్పుడు, అది ఒక ఎమ్మెస్వోతో మాత్రమే ముడిపడి ఉన్నప్పుడు ఒక్కో ఆపరేటర్ ఒక్కో సర్వీస్ ప్రొవైడర్ హోదాలో ట్రైబ్యునల్ ను ఆశ్రయించటం తప్పు కాదని అన్నారు. అయితే, ఒక్కో ఆపరేటర్ కార్యకలాపాలు చాలా పరిమితం కాబట్టి వనరులు కూడా పరిమితంగా ఉంటాయని, ఢిల్లీ వచ్చి టిడిశాట్ లో వాదించుకునేందుకు ఒక్కొక్కరికీ వెసులుబాటు ఉండకపోవచ్చునని టిడిశాట్ అభిప్రాయపడింది.

సంఘం సభ్యులు విడివిడిగా రాలేనప్పుడు తమ తరఫున సంఘానికి అధికారం అప్పగించవచ్చునని, అయితే అదే సమయంలో ఆ పిటిషన్ మీద ట్రైబ్యునల్ ఇచ్చే తీర్పుకు కట్టుబడాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. దీనిమీద అభ్యంతరాలుంటే తెలియజేయటానికి సిటీకేబుల్ కి అవకాశమిచ్చారు. ఈలోగా చెల్లింపులు జరపాల్సి వస్తే ఆఖరి చెల్లింపు ఆధారంగా కొనసాగించాలని కేబుల్ ఆపరేటర్లకు టిడిశాట్ సూచించింది.